Thallarevu
-
కాకినాడ: తాళ్లరేవులో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళా కార్మికుల మృతి
సాక్షి, కాకినాడ: తాళ్లరేవు బైపాస్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళా కార్మికులు మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను రొయ్యల కంపెనీలో పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. తాళ్లరేవు నుంచి యానాం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది,. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
తాళ్లరేవు :సముద్ర తీరానికి చెంతన.. నదీగర్భంలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. అక్రమార్కులు వీటిని బేఖాతరు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఇసుక వ్యాపారులు యథేచ్ఛగా ఇసుక తవ్వి, అక్రమంగా రవాణా చేసేందుకు ఎక్కడపడితే అక్కడ ఏటిగట్టుకు తూట్లు పొడిచేస్తున్నారు. సముద్రానికి సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఇసుక తవ్వరాదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సైతం వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. మండల పరిధిలోని పిల్లంక నుంచి యానాం దరియాలతిప్ప వరకూ గౌతమి నదీ ప్రవాహం అధికంగా ఉంటుంది. ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు ఏటిగట్టు చెంతన కోట్ల రూపాయలతో గ్రోయిన్లు నిర్మిస్తున్నారు. వీటివద్ద అక్రమ వ్యాపారులు ఇసుక నిల్వ చేసి వ్యాపారం సాగిస్తున్నారు. గ్రోయిన్లపై నిల్వ చేసిన ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. దీనివల్ల ఇటు గ్రోయిన్లతోపాటు, అటు ఏటిగట్టు కూడా ధ్వంసమవుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క సుమారు రూ.25 కోట్లతో గ్రోయిన్లు నిర్మిస్తుండగా, మరోపక్క వాటి చెంతనే ఇసుక అక్రమ వ్యాపారం సాగిస్తూండడం విశేషం.పర్యావరణానికి చేటు కలుగుతోందని కొందరు ఫిర్యాదు చేయడంతో గోవలంక, పిల్లంక ర్యాంపులపై గతంలో నిషేధం విధించారు. జిల్లాలో చాలా ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇచ్చినా ఈ రెండింటికీ పర్యావరణ అనుమతులు ఇందువల్లనే రాలేదని అంటున్నారు. ఇప్పట్లో వీటికి అనుమతులు వచ్చే అవకాశం లేకపోవడంతో, ఇంజరం పంచాయతీ పరిధిలో గోపులంక వద్ద ఏటిగట్టు చెంతన కొత్తగా మరో ర్యాంపు ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నాయకులు ముమ్మరంగా యత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో అధికారులు ఈ ర్యాంపు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. అయితే ఇందుకు ప్రభుత్వ భూమి లేకపోవడంతో ర్యాంపు ఏర్పాటుకు ఆటంకాలు కలిగాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే కొందరు గోపులంక వద్ద గౌతమీ గోదావరి చెంతన ర్యాంపు ఏర్పాటు చేయడం విశేషం. ఇక్కడ నుంచి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు వాహనాల్లో ఇసుక తరలించేస్తున్నారు. ఇసుక అక్రమార్కులపై అధికారులు దృష్టి సారించి, వారిబారి నుంచి ఏటిగట్టును పరిరక్షించాలని, ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు. ర్యాంపులకు ఎటువంటి అనుమతులూ లేవు మండల పరిధిలో ఇసుక ర్యాంపులకు ఎటువంటి అనుమతులూ రాలేదు. పిల్లంక, గోవలంక, కొత్తగా దరఖాస్తు చేసిన ఇంజరం ఇసుక ర్యాంపులకు కూడా ఎటువంటి అనుమతులూ లేవు. ఎవరైనా అక్రమంగా ఇసుక తవ్వినా, తరలించినా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. - జీఎస్ శేషగిరిరావు, తహశీల్దార్ -
వైఎస్సార్ సీపీ నేతపై దాడి
తాళ్లరేవు, న్యూస్‌లైన్ :వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జార్జిపేటలో వైఎస్సార్ సీపీ కార్యకర్త మందపల్లి రాంబాబుపై దాడి జరిగి నాలుగు రోజులు గడవకముందే.. సోమవారం అర్ధరాత్రి మరో నాయకుడిపై దాడి జరగడం సంచలనం కలిగింది. వైఎస్సార్ సీపీ తాళ్లరేవు గ్రామ కమిటీ కన్వీనర్ విత్తనాల తాతారావుపై టీడీపీ కార్యకర్త వల్లు భీష్మ బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటనలో తాతారావు మెడ, తలపై తీవ్ర గాయాలయ్యాయి. కిళ్లీ షాపు నిర్వహించే తాతారావు.. దుకాణం మూసివేసే సమయంలో భీష్మ అక్కడకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరగ్గా, భీష్మ తన వెంట తెచ్చిన బ్లేడుతో తాతారావు మెడపై, తలపై దాడి చేశాడు. దీంతో తాతారావుకు తీవ్ర రక్త స్రావం అవుతుండడంతో స్థానికులు వెంటనే ఆయనను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో తాతారావు, భీష్మకు మధ్య రెండు రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం భీష్మ తనపై దాడి చేశాడని, దీని వెనుక టీడీపీ నాయకుడు, తాళ్లరేవు సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసరావు, మరికొందరు ఉన్నారని తాతారావు ఆరోపించారు. కాగా ఈ సంఘటనకు బాధ్యుడైన భీష్మను కోరంగి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జార్జిపేట దాడి ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో.. ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని పార్టీ నాయకులు దడాల బుజ్జిబాబు, దడాల జగదీశ్వరరావు, చిట్టూరి చలపతి తదితరులు పేర్కొన్నారు. పలువురి పరామర్శ టీడీపీ కార్యకర్త దాడిలో గాయపడ్డ తాతారావును పలువురు నాయకులు మంగళవారం పరామర్శించారు. పార్టీ మండల కన్వీనర్ దడాల బుజ్జిబాబు, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ దడాల జగదీశ్వరరావు, నాయకులు గంజా సూరిబాబు, చిట్టూరి చలపతి, బొంతు మోహన్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.