తాళ్లరేవు :సముద్ర తీరానికి చెంతన.. నదీగర్భంలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. అక్రమార్కులు వీటిని బేఖాతరు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఇసుక వ్యాపారులు యథేచ్ఛగా ఇసుక తవ్వి, అక్రమంగా రవాణా చేసేందుకు ఎక్కడపడితే అక్కడ ఏటిగట్టుకు తూట్లు పొడిచేస్తున్నారు. సముద్రానికి సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఇసుక తవ్వరాదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సైతం వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. మండల పరిధిలోని పిల్లంక నుంచి యానాం దరియాలతిప్ప వరకూ గౌతమి నదీ ప్రవాహం అధికంగా ఉంటుంది. ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు ఏటిగట్టు చెంతన కోట్ల రూపాయలతో గ్రోయిన్లు నిర్మిస్తున్నారు. వీటివద్ద అక్రమ వ్యాపారులు ఇసుక నిల్వ చేసి వ్యాపారం సాగిస్తున్నారు.
గ్రోయిన్లపై నిల్వ చేసిన ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. దీనివల్ల ఇటు గ్రోయిన్లతోపాటు, అటు ఏటిగట్టు కూడా ధ్వంసమవుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క సుమారు రూ.25 కోట్లతో గ్రోయిన్లు నిర్మిస్తుండగా, మరోపక్క వాటి చెంతనే ఇసుక అక్రమ వ్యాపారం సాగిస్తూండడం విశేషం.పర్యావరణానికి చేటు కలుగుతోందని కొందరు ఫిర్యాదు చేయడంతో గోవలంక, పిల్లంక ర్యాంపులపై గతంలో నిషేధం విధించారు. జిల్లాలో చాలా ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇచ్చినా ఈ రెండింటికీ పర్యావరణ అనుమతులు ఇందువల్లనే రాలేదని అంటున్నారు. ఇప్పట్లో వీటికి అనుమతులు వచ్చే అవకాశం లేకపోవడంతో, ఇంజరం పంచాయతీ పరిధిలో గోపులంక వద్ద ఏటిగట్టు చెంతన కొత్తగా మరో ర్యాంపు ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నాయకులు ముమ్మరంగా యత్నిస్తున్నారు.
ప్రజాప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో అధికారులు ఈ ర్యాంపు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. అయితే ఇందుకు ప్రభుత్వ భూమి లేకపోవడంతో ర్యాంపు ఏర్పాటుకు ఆటంకాలు కలిగాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే కొందరు గోపులంక వద్ద గౌతమీ గోదావరి చెంతన ర్యాంపు ఏర్పాటు చేయడం విశేషం. ఇక్కడ నుంచి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు వాహనాల్లో ఇసుక తరలించేస్తున్నారు. ఇసుక అక్రమార్కులపై అధికారులు దృష్టి సారించి, వారిబారి నుంచి ఏటిగట్టును పరిరక్షించాలని, ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు.
ర్యాంపులకు
ఎటువంటి అనుమతులూ లేవు
మండల పరిధిలో ఇసుక ర్యాంపులకు ఎటువంటి అనుమతులూ రాలేదు. పిల్లంక, గోవలంక, కొత్తగా దరఖాస్తు చేసిన ఇంజరం ఇసుక ర్యాంపులకు కూడా ఎటువంటి అనుమతులూ లేవు. ఎవరైనా అక్రమంగా ఇసుక తవ్వినా, తరలించినా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
- జీఎస్ శేషగిరిరావు,
తహశీల్దార్
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
Published Sun, Nov 23 2014 12:34 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement