నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
Published Wed, Feb 8 2017 9:40 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
- ఇసుక మాఫియాపై
హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం
– కేఈ శ్యాంబాబుపై జరిపే విచారణలో
అధికారులపై ఒత్తిడి ఉండరాదు
– డిప్యూటీ సీఎం అధికారం నుంచి తప్పకోవాలి
– వైఎస్‌ఆర్‌సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి
వెల్దుర్తి రూరల్ : వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో హంద్రీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ చేయాలని హైకోర్టు జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం తనయుడు కేఈ శ్యాంబాబుపై రైతులు ఫిర్యాదు చేయడంతో కోర్టు స్పందించిందన్నారు. చెరుకులపాడు, కొసనాపల్లె, కృష్ణగిరి ప్రాంతాల్లో ఇసుక తరలింపుతో భూగర్భజలాలు తగ్గడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను, కారకులను తాము,రైతులు పలుమార్లు మీడియాకు, జిల్లా అధికారులకు తెలిపామన్నారు.
డిప్యూటీ సీఎంకు సైతం శ్యాంబాబు ప్రమేయంపై రైతులు విన్నవించారన్నారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరకు రైతులు సీఎంకు లేఖలు రాశారని వివరించారు. అయినా పాలకులు,అధికారులు స్పందించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారన్నారు. స్థానిక అధికారులతో న్యాయం జరగనందుకే వారు అంతదూరం వెళ్లారని అన్నారు. ఈ ప్రాంతాల్లో ఇసుక రవాణా జరుగుపుతున్న ట్రాక్టర్లపై కేఈ శ్యాంబాబు, కేఈ ప్రభాకర్ అని రాసి ఉండడం, అలా ఉన్న ఎన్నో ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించి వదిలేశారన్నారు.
కేఈ శ్యాంబాబు హస్తంపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే జిల్లా అధికారులపై అధికారపార్టీ ఒత్తిడి ఉండరాదని సూచించారు. తన కొడుకు ప్రమేయంపై ఆరోపణలకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాలో పనిచేసిన కొందరు టీడీపీ నాయకులు తమపై బురద జల్లడానికి చేయడం తగదన్నారు. రైతులు బాధలు హైకోర్టు గమనించి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబాలు చేస్తున్న అక్కమాలను ప్రశ్నించడం హర్షించదగ్గ విషయమన్నారు. పార్టీ మండల కన్వీనర్ రవిరెడ్డి, బొమ్మిరెడ్డిపల్లె మధుసూదన్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్‌నాయుడు, రామళ్లకోట రాధాకృష్ణారెడ్డి, బింగిదొడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, అల్లుగుండు శ్రీరాంరెడ్డి, బొమ్మిరెడ్డిపల్లె చక్రపాణిరెడ్డి, సొసైటీ సభ్యుడు వెంకటేశ్వరరెడ్డి, గుంటుపల్లె జనార్ధనరెడ్డి, వడ్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement