ke shambabu
-
కర్నూల్లో కాల‘కేఈ’సోదరులు..
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : పత్తికొండ నియోజకవర్గంలో ఐదేళ్లు అరాచకం రాజ్యమేలింది. అక్రమాలు గద్దెనెక్కి తాండవం చేశాయి. అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రోడ్డు నిర్మాణాలు.. నీరు–చెట్టు పనులు.. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు..పని ఏదైనా కేఈ సోదరులకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే. లేదని ఎదురు తిరిగితే విధ్వంసం మెరుస్తుంది..బెదిరింపు ఉరుముతుంది. కబ్జాలు..సెటిల్మెంట్లు..ఒకటేమిటి అన్నీ వారి ఆధీనంలోనే..చివరకు కూలీల రెక్కల కష్టాన్నీ వదల్లేదు..గాలిమరల ఏర్పాటులో చేతివాటం..ప్రైవేట్ సబ్స్టేషన్ల నిర్మాణాల్లో బలవంతపు వసూళ్లు .. మొక్కల పెంపకంలో అక్రమాలు..ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో..ఎన్నెన్నో.. కాల‘కేఈ’ల అరాచకాలు.. వాటిల్లో కొన్ని... అవినీతికి చిహ్నం.. కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్ ఎర్రగుడి నుంచి మన్నెకుంట వరకు గత ఏడాది సబ్‌ప్లాన్ కింద 3.2 కి.మీ రహదారిని రూ.1.45కోట్లతో వేశారు. ఇది ఆరు నెలలకే దెబ్బతినడంతో మళ్లీ ప్యాచ్‌లు వేశారు. కృష్ణగిరి మండలంలో కేఈ కృష్ణమూర్తి సోదరుడు, మాజీ జెడ్పీటీసీ కేఈ జయన్నదే పెత్తనం. ఏ పనిలోనైనా కమీషన్లు తీసుకోవడం రివాజుగా మారింది. ఐదేళ్ల నుంచి ఒక్క కృష్ణగిరి మండలంలోనే రూ.7కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. దత్తత గ్రామంలో అక్రమాలు ఇది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దత్తత గ్రామమైన ఎరుకలచెర్వులోని సీసీ రోడ్డు దుస్థితి. అక్రమాలకు పాల్పడి నాసిరకంగా నిర్మించారనేదానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. నడవడానికి వీలులేకుండా తయారైన రోడ్లను చూసి.. గ్రామాన్ని దత్తత తీసుకుంది అభివృద్ధికా? అవినీతికా? అని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. భారీగా కమీషన్లు! పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద రూ.2కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ఇది. దీని నిర్మాణంలో కేఈ శ్యాంబాబుకు భారీగా కమీషన్లు అందాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నలకదొడ్డి గ్రామం వద్ద ప్రధాన మంత్రి గ్రామ సడక్ నిధులు రూ.7కోట్లతో కాజ్వే నిర్మించారు. దీనిలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నాలుగేళ్లలో పత్తికొండ ఆర్అండ్బీ పరిధిలో రూ.49 కోట్లతో 89 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్ల పనులు జరిగాయి. ఈ పనుల్లో టీడీపీ నేతలకు కమీషన్లు అందాయి. పత్తికొండ మండలంలో రూ.6 కోట్లతో 515 పనులు జరిగాయి. వీటిలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా చేసిన పనుల్లో 10 శాతానికి పైగా కమీషన్ కేఈ శ్యాంబాబు ఆదేశాలతో నేరుగా టీడీపీ కార్యాలయానికి అందింది. పక్కా ఇళ్ల నిర్మాణం, చంద్రన్న బీమా మంజూరులోనూ కమీషన్ల పర్వం కొనసాగింది. ‘పక్కా’మోసం వెల్దుర్తిలో నక్కలతిప్పపై మూడేళ్ల నుంచి మొండిగోడలకే పరిమితమైన ఎన్టీఆర్ గృహాలు ఇవీ. వెల్దుర్తికి 106 గృహాలు మంజూరు కాగా.. లబ్ధిదారులకు తానే నిర్మించి ఇస్తానని వెల్దుర్తి టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ ఒక్కొక్కరినుంచి రూ.50 వేలు వసూలు చేశాడు. ఊరికి దూరంగా నక్కల తిప్పపై రెండెకరాల స్థలంలో ఇళ్లు కడతామని ఊరించాడు. మొండిగోడలు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. కూలీల కష్టాన్నీ దోచుకున్నారు.. సోలార్‌ప్లాంట్ అనుమతుల విషయంలో అధికార పార్టీ నేత రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నదాన్ని తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటయ్యేలా అనుమతులు తీసుకున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో పట్టా భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా వినియోగించారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో కంకర, ఇసుకతో పాటు పనిచేసే రోజు వారీ కూలీల డబ్బుల్లో కూడా కమీషన్లు కత్తిరించారు. అనుచరులు సైతం... పత్తికొండ మండలంలో రూ.60 లక్షలతో నీరు–చెట్టు పనులు చేశారు. అలాగే పత్తికొండ–ఆదోని రోడ్డులోని హంద్రీ–నీవా కాలువ నుంచి ఊరి చెరువుకు నీరు నింపేందుకు రూ.50లక్షలతో పైప్‌లైన్ నిర్మించారు. అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు ఈడిగ సుకన్యకు మామ అయిన ఇ.నాగయ్యగౌడు, అతని కుమారుడు రామ్మూర్తి గౌడు ఈ పనులు దక్కించుకొని భారీ అక్రమాలకు పాల్పడ్డారు. చక్రాళ్ల గ్రామ శివారులోని ఫారెస్టులో మొక్కల పెంపకం పేరుతో అధికార పార్టీ కార్యాలయ ఇన్చార్జ్ సుమారు రూ.30 లక్షల వరకు బొక్కేశారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేఈ శ్యాంబాబు అండతో పత్తికొండ–ఆదోని రోడ్డులో సుమారు 72 సెంట్ల కడగమ్ము వంక పోరంబోకు స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించారు. దర్జాగా బేరం పెట్టి అమ్ముకున్నారు. గాలిమరల ఏర్పాటులోనూ.. పత్తికొండ మండలంలోని దేవనబండ, హోసూరు, పెద్దహుల్తి, పుచ్చకాయలమాడ, పందికోన గ్రామాల్లో గాలిమరలు, ప్రైవేట్ సబ్స్టేషన్ల ఏర్పాటు చేశారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి కేఈ శ్యాంబాబు, సాంబ, శ్రీధర్‌రెడ్డి కోట్లాది రూపాయల కమీషన్లు రాబట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మన్ను తిన్న పాములు.. వెల్దుర్తి ఎర్ర చెరువు వద్ద టిప్పర్లులో పూడికమన్ను నింపుతున్న దృశ్యమిది. ఎర్రచెరువు మట్టిని ఇటుకల బట్టీలకు తరలించి టీడీపీ నాయకులు భారీగా సొమ్ము చేసుకున్నారు. మాట వినని అధికారులపై అధికార పార్టీ నాయకులు చేయిచేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. వెల్దుర్తి మేజర్ పంచాయతీ ఈఓగా ఉన్న ఫకృద్ధీన్ (ప్రస్తుతం ఈఓఆర్డీ)ను ఆఫీసుకు వెళ్లి చెంప చెళ్లు మనిపించారు. అభివృద్ధిని అడ్డుకొని.. ఇది మద్దికెర మండలం ఎం.ఆగ్రహారంలోని వనకుంట. 227 సర్వే నంబర్లో 1.92 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కుంటను వెడల్పు చేయడానికి వాటర్‌షెడ్ పథకం కింద రూ.5.80 లక్షలు మంజూరు చేశారు. పనులు పూర్తి అయితే వర్షపునీరు నిలిచి గ్రామంలో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. అయితే పనులు టీడీపీ నేతలకు దక్కలేదనే అసూయతో అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి నిలిపివేశారు. గ్రామాభివృద్ధికి సహకరించాల్సిన నాయకులు పర్సంటేజీల కోసం పనులకు బ్రేకులు వేయించాయరని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. విధ్వంసకాండ తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామ సమీపంలో ధ్వంసమైన వాహనాలివి. రైల్వే కాంట్రాక్ట్ విషయంలో ఎవరూ టెండర్ వేయవద్దని కేఈ వర్గం నుంచి హెచ్చరికలు వెళ్లినా.. వీటిని ఖాతరు చేయకుండా తుగ్గలి నాగేంద్ర టెండర్ దక్కించుకున్నారు. పనులు చేస్తున్న ప్రాంతంలో లారీలు, జేసీబీల అద్దాలను కేఈ శ్యాంబాబుకు చెందిన మనుషులు పగలగొట్టి బెదిరింపులకు దిగారని నాగేంద్ర ఆనాడు తీవ్రంగా ఆరోపించారు. -
కేఈ శ్యాంబాబు నిందితుడే
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుతోపాటు టీడీపీకి చెందిన ఆస్పరి మండల జెడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్ది ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను డోన్ కోర్టు నిందితులుగా పేర్కొంది. ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆంజనేయులు శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘‘నారాయణరెడ్డి హత్య ఘటనలో కేఈ శ్యాంబాబు, బొజ్జమ్మ, నాగతులసీ ప్రసాద్‌ల పాత్రపై ఆధారాలను బట్టి కచ్చితంగా కోర్టు విచారణ జరపాల్సిందే. అందువల్లే ఐపీసీ సెక్షన్ 147, 148, 149 (గుంపుగా మారణాయుధాలతో తిరగడం), 302(హత్య), 109(తప్పు చేసేందుకు సహకరించడం), మారణాయుధాల చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ 120(బీ)(కుట్ర చేయడం) కింద వీరిపై కేసులు నమోదు చేయాలి. ఇందుకు అనుగుణంగా ఈ ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాం. తదుపరి విచారణను మార్చి 1వ తేదీన చేపడతాం’’అని న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు. -
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
- ఇసుక మాఫియాపై హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం – కేఈ శ్యాంబాబుపై జరిపే విచారణలో అధికారులపై ఒత్తిడి ఉండరాదు – డిప్యూటీ సీఎం అధికారం నుంచి తప్పకోవాలి – వైఎస్ఆర్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి వెల్దుర్తి రూరల్ : వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో హంద్రీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ చేయాలని హైకోర్టు జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం తనయుడు కేఈ శ్యాంబాబుపై రైతులు ఫిర్యాదు చేయడంతో కోర్టు స్పందించిందన్నారు. చెరుకులపాడు, కొసనాపల్లె, కృష్ణగిరి ప్రాంతాల్లో ఇసుక తరలింపుతో భూగర్భజలాలు తగ్గడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను, కారకులను తాము,రైతులు పలుమార్లు మీడియాకు, జిల్లా అధికారులకు తెలిపామన్నారు. డిప్యూటీ సీఎంకు సైతం శ్యాంబాబు ప్రమేయంపై రైతులు విన్నవించారన్నారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరకు రైతులు సీఎంకు లేఖలు రాశారని వివరించారు. అయినా పాలకులు,అధికారులు స్పందించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారన్నారు. స్థానిక అధికారులతో న్యాయం జరగనందుకే వారు అంతదూరం వెళ్లారని అన్నారు. ఈ ప్రాంతాల్లో ఇసుక రవాణా జరుగుపుతున్న ట్రాక్టర్లపై కేఈ శ్యాంబాబు, కేఈ ప్రభాకర్ అని రాసి ఉండడం, అలా ఉన్న ఎన్నో ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించి వదిలేశారన్నారు. కేఈ శ్యాంబాబు హస్తంపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే జిల్లా అధికారులపై అధికారపార్టీ ఒత్తిడి ఉండరాదని సూచించారు. తన కొడుకు ప్రమేయంపై ఆరోపణలకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాలో పనిచేసిన కొందరు టీడీపీ నాయకులు తమపై బురద జల్లడానికి చేయడం తగదన్నారు. రైతులు బాధలు హైకోర్టు గమనించి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబాలు చేస్తున్న అక్కమాలను ప్రశ్నించడం హర్షించదగ్గ విషయమన్నారు. పార్టీ మండల కన్వీనర్ రవిరెడ్డి, బొమ్మిరెడ్డిపల్లె మధుసూదన్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్‌నాయుడు, రామళ్లకోట రాధాకృష్ణారెడ్డి, బింగిదొడ్డి జగన్మోహన్రెడ్డి, అల్లుగుండు శ్రీరాంరెడ్డి, బొమ్మిరెడ్డిపల్లె చక్రపాణిరెడ్డి, సొసైటీ సభ్యుడు వెంకటేశ్వరరెడ్డి, గుంటుపల్లె జనార్ధనరెడ్డి, వడ్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.