ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ వడ్లపట్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు రామిశెట్టి శ్రీనుబాబు
భీమడోలు/ఏలూరు టౌన్ : వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఫేస్‌బుక్‌లో పోస్టింగులు పెడుతున్నాడనే అక్కసుతోపాటు, పాత కక్షల నేపథ్యంలో టీడీపీ నేత తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీకి చెందిన నాయకుడిపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా కొట్టటంతోపాటు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. గొడవ జరగటం చూసి అక్కడికి జనాలు రావటంతో టీడీపీ నేతలు జారుకున్నారు. తల, శరీరబాగాలపై తీవ్రంగా కొట్టటంతో పడిపోయిన అతడిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి కథనం మేరకు.. భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామానికి చెందిన రామిశెట్టి శ్రీనుబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఇటీవల భీమడోలులో కాపునేత ముద్రగడ పద్మనాభం కార్యక్రమానికి హాజరైన అతను ఆ సభలోని అంశాలతోపాటు కొంత కాలంగా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఫేస్ బుక్కులో పోస్టింగులు పెడుతున్నాడు. దీంతో శ్రీనుబాబుపై కక్షపెంచుకున్న భీమడోలు మండల టీడీపీ అధ్యక్షుడు గంజి మాజేష్‌చౌదరి సమయం కోసం వేచిఉన్నాడు. వ్యవసాయ కూలీ అయిన శ్రీనుబాబు గురువారం సాయంత్రం డీజిల్ కోసమని భీమడోలు పెట్రోల్ బంకుకు వెళ్లి డీజిల్ కొట్టించుకుని బయటకు వస్తుండగా అతడిని అడ్డుకుని మాజేష్, అతని సోదరుడు మనోజ్, ఉయ్యాల సాయి, అలజింగి హరిష్, మోపిదేవి శివ, తుమ్మగుంట పవన్‌కల్యాణ్ తదితరులు తీవ్రంగా కొట్టారు.
తనను ఎందుకు కొడుతున్నారని శ్రీనుబాబు ప్రశ్నించగా, ఈ మధ్య బాగా అతి చేస్తున్నావనీ, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. ఈలోగా మరో వ్యక్తి కత్తి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా జనాలు గుమిగూడటంతో వారు అక్కడి నుంచి జారుకున్నారు. శ్రీనుబాబును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. తనను కొట్టిన వారిపై శ్రీనుబాబు భీమడోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెనువెంటనే టీడీపీ నాయకులు బాధితుడు రామిశెట్టి శ్రీనుబాబు, వైఎస్సార్ సీపీ నేతలు తుమ్మగంట రంగాతో పాటు పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు భీమడోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
రామిశెట్టి శ్రీనివాసరావును దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన టీడీపీకి చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్ద బైఠాయించారు. గాయపర్చిన వ్యక్తులను ఎందుకు వదిలేస్తున్నారని ఎస్సై శ్రీరామగంగాధర్‌ను ప్రశ్నించారు. నేరస్తులైన టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారన్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం సీఐ బీఎన్ నాయక్, ఎస్సై శ్రీరామగంగాధర్ వైఎస్సార్ సీపీ నేతలతో చర్చించారు. రెండు కేసులను నమోదు చేసి విచారణ చేస్తామని చెప్పారు.బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ నాయకులు వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment