టీడీపీ నాయకుల దాష్టీకం! | TDP Leaders Attack On YSRCP Office In Srikakulam | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల దాష్టీకం!

Published Fri, Feb 15 2019 11:07 AM | Last Updated on Fri, Feb 15 2019 11:07 AM

TDP Leaders Attack On YSRCP Office In Srikakulam - Sakshi

దాడిలో తలపై తీవ్ర గాయమైన నగేష్‌

టెక్కలి రూరల్‌/కోటబొమ్మాళి: మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో టీడీపీ నాయకులు.. కార్యకర్తలు దౌర్జన్యకాండకు దిగారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి పట్టుతగ్గుతోందనే భయంతో అధికార పార్టీ కార్యకర్తలు బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఓటమి భయాన్ని సహించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే కోటబొమ్మాళిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోకి గురువారం ఉదయం పది గంటల సమయంలో దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఉన్న కార్యకర్తలు.. నాయకులపై విచక్షణ రహితంగా దాడిచేశారు. కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి కొట్టడంతో 8 మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయడినవారిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బొయిన నాగేశ్వరరావు, నేతింటి నగేష్, అన్నెపు రామారావు, దుబ్బ వెంకట్రావు, మెండ తాతయ్య, తోట వెంటరమణ, కళ్ల ఆదినారాయణ, పిల్లల లక్ష్మణరావు ఉన్నారు.

వీరిలో తోట వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిగిలిన వారిని టెక్కలిలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. టీడీపీ వర్గీయుల దాడులతో కోటబొమ్మాళిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ వైస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి మంత్రి అచ్చెన్నాయుడును ఏ–1గా, టీడీపీ మండల అధ్యక్షుడు బొయిన రమేష్‌పై ఏ–2గా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టులు చేయాలని నినాదాలు చేశారు. సుమారు 3 గంటల పాటు అటు పోలీసులకు, ఇటు వైఎస్సార్‌ సీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తక్షణమే దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీంతో కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాద్‌రావు, సీఐలు శ్రీనివాసరావు, పైడప్పనాయుడు, తిరుపతిరావు, మహేష్‌లు, ఆరుగురు ఎస్సైలతోతోపాటు సుమారు 50 మందికి పైగా పోలీసులు కోటబొమ్మాళి స్టేషన్‌కు చేరుకొని ఆందోళన విరమించాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను కోరారు. అయితే తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని దువ్వాడ శ్రీనివాస్, తిలక్‌లు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై అట్రాసిటీ, 307 కేసులు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ ప్రసాదరావు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిపై 307, 324 సెక్షన్లతోపాటు అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని అందరి మధ్యలో ప్రకటించారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు శాంతించారు.

కాగా వైఎస్‌ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ కోటబొమ్మాళిలోని పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి.. గచ్చుపై పడి ఉన్న రక్తం మరకలను పరిశీలించారు. ఆందోళన కార్యక్రమంలో పార్టీ నాయకులు యర్ర చక్రవర్తి, సింగుపురం మోహన్‌రావు, కుర్మాణ బాలకృష్ణ,  ఎస్‌.హేమసుందరరాజు, చిన్ని జోగారావు, చింతాడ గణ పతి, తమ్మన్నగారి కిరణ్, బగాది హరి, సత్తారు సత్యం, కవిటి రామరాజు, శ్రీరాంమూర్తి, బి.మోహన్‌రెడ్డి, ఎం.నాగభూషణరావు, ఎం భాస్కర్‌రెడ్డి, మదీన్, శ్యామలరావు, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాడి ఘటనను దళిత నాయకుడు బొకరి నారాయణరావు ఖడించారు.

నేడు కోటబొమ్మాళి బంద్‌కువైఎస్సార్‌ సీపీ పిలుపు
వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడిని నిరసిస్తూ శుక్రవారం కోటబొమ్మాళి బంద్‌కు పార్టీ నాయకులు పిలుపునించారు. బంద్‌కు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, తిలక్‌లు కొత్తపేట నుంచి కోటబొమ్మాళి వరకూ ర్యాలీ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్, దువ్వాడ, తిలక్‌ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement