
ఓట్లు వేయలేదని మహిళపై కత్తులతో దాడి
రేపల్లె : పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కక్షతో టీడీపీ నాయకులు ఓ మహిళపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం రేపల్లె మండలం మోళ్లగుంటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైకం కనకయ్య, శివపార్వతి దంపతులు వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో పాటు, ఓటు వేయలేదనే కక్షతో ఆరోవార్డు మెంబర్, టీడీపీ నాయకుడు కొక్కిలిగడ్డ విష్ణునారాయణ ఎన్నికలు ముగిసిన నాటినుంచి ఈ దంపతులపై వరుస దాడులకు పాల్పడుతున్నాడు. గతంలో రెండు పర్యాయాలు దాడులు చేయగా చోడాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైయ్యాయి.
దీంతో మరింత కక్ష పెంచుకున్న విష్ణునారాయణ తన బంధువులైన కొక్కిలిగడ్డ జనార్ధన్, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరావులతో కలిసి నిన్నఉదయం శివపార్వతిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. గమనించిన స్థానికులు శివపార్వతిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వరావు తెలిపారు.
టీడీపీ అకృత్యాలు నిలువరించాలి..
పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నామనే కక్షతో విష్ణునారాయణ పదే పదే తమపై దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలి భర్త కనకయ్య ఆరోపించారు. గ్రామంలో టీడీపీ నాయకుల అరాచకాలు నివారించి, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.