
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలంగాణ ఫలితాలపై బెట్టింగ్ కాసిన వారి రాతలు మారిపోయాయి. ఒక్కరోజులోనే కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఇంటికొచ్చి చేరితే, ఇంకొందరు భారీగా నష్టపోయారు. వీరిలో ఎక్కువశాతం టీడీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కీలక వ్యాపారులు ఉండటం గమనార్హం. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని ఓడిపోతుందని ఓ టీడీపీ ఎమ్మెల్యే రూ.10కోట్లు పందెం కాశారు. ఆమె ఓటమితో సదురు ఎమ్మెల్యేకు ఒక్క రోజులోనే రూ.10కోట్లు వచ్చి చేరింది. అలాగే మరో ఎమ్మెల్యే కూటమి అధికారంలోకి వస్తుందని, సుహాసిని గెలుస్తుందని రూ.7కోట్లు పందెం కాశారు. ఈ మొత్తం డబ్బులు ఆయన కోల్పోయారు.
అలాగే జిల్లాలో నోటి దురుసు ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న మరో నేత టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని రూ.4కోట్లు దక్కించుకున్నారు. అలాగే నందమూరి సుహాసిని గెలుస్తుందని రూ.3కోట్లు పందెం కాసి నష్టపోయారు. ఈ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలే రూ.35కోట్ల వరకూ పందెం కాసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు తాడిపత్రి, ధర్మవరం, అనంతపురం, హిందూపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు, రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు, కాంట్రాక్టర్లు మరో రూ.15కోట్ల వరకూ బెట్టింగ్ కాశారు. దీంతో రూ.30కోట్ల వరకూ బెట్టింగ్ జరిగి ఉంటుందని ఫలితాల ముందు రోజు ఓ అంచనా ఉన్నా, ఫలితాల తర్వాత చేతులు మారిన డబ్బు రూ.50కోట్ల పైమాటేనని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment