ప్లాస్టిక్ బకెట్‌లో బాంబులు
ప్రశాంతంగా ఉన్న పల్నాడు పల్లెల్లో చిచ్చుపెట్టే కుట్ర.. ఫ్యాక్షన్‌కు దూరంగా బతుకుతున్న గ్రామాల్లో అలజడి రేపే కుయుక్తులు.. సినీ ఫక్కీలో నాటు బాంబులు ఏర్పాటు చేసి అక్రమ కేసులు బనాయించేందుకు అధికార పార్టీ నేతల పథక రచన.. మొత్తంగా రెండు దశాబ్దాలుగా బాంబుల మోతలు లేని పల్నాడులో మళ్లీ నాటు బాంబులు కలకలం రేపాయి. రెంటచింతల మండలం మంచికల్లులో శుక్రవారం తెల్లవారుజామున నాటు బాంబులు దొరికాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాంబుల తతంగంతో పల్నాడు గ్రామాలు ఉలిక్కిపడ్డాయి.
సాక్షి, గుంటూరు, రెంటచింతల: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామం మంచికల్లులో ఆయన ఇంటికి అతి సమీపంలో శుక్రవారం నాటు బాంబులు దొరకడం కలకలం రేపింది. ఈ నాటు బాంబులు పట్టుబడిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం గ్రామ దేవత పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా గుంటూరుకు చెందిన 10 మంది డాగ్ స్క్వాడ్, మరో 10 మంది బాంబు స్క్వాడ్‌తోపాటు 30 మంది పోలీసులతో గురజాల రూరల్ సీఐ బీ నర్సింహారావు, మాచర్ల సీఐ జీ సాంబశివరావు నేతృత్వంలో కారంపూడి ఎస్‌ఐ ఎం మురళితో కలిసి రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు జరిపారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత యరపతినేని నరసింహారావు నివాసం ముందు ఉన్న వాహనం కింద ప్లాస్టిక్ బకెట్‌లో నాటు బాంబులను పోలీసు జాగిలాలు గుర్తించాయి. పోలీసులు నరసింహారావు కుటుంబ సభ్యులను నిద్రలేపి బాంబులు ఉన్న విషయం చెప్పడంతో వాళ్లు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఆ బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నరసింహారావునును అదుపులోకి తీసుకుని గురజాల డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో విచారించారు.
అన్నీ అనుమానాలే..
పోలీసులు తనిఖీలకు వచ్చిన రోజే నరసింహారావు ఇంటి ముందు నాటు బాంబుల బకెట్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గురజాల ఎమ్మెల్యేకు వరుసకు తమ్ముడు అయిన నరసింహారావు ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో బాంబులతో నరసింహారావును హత మార్చేందుకు ప్రత్యర్థులు ఆయన కారు కింద ఉంచారో? అక్రమ కేసులో ఇరికించి వేధింపులకు గురి చేసేందుకే కుయుక్తులు పన్నారో ? తెలియాల్సి ఉంది. ఒక వేళ నరసింహావు బాంబులు తెచ్చి ఉంటే నడి రోడ్డుపై తాను కొత్తగా కొనుగోలు చేసిన కారు కింద ఎందుకు పెడతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు గ్రామంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిసినా వాటిని అక్కడ ఎందుకు వదిలేస్తారనే చిన్న లాజిక్కును టీడీపీ నేతలు, పోలీసులు విస్మరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో
పట్టుకోల్పోతున్నామనే భయంతోనే ?
మంచికల్లులో టీడీపీ నుంచి ముఖ్య నేతలు, భారీ స్థాయిలో కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. దీంతో గ్రామంలో పట్టుకోల్పోతున్నామనే భయంతోనే నాటు బాంబులను తెచ్చి పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గురజాల, మాచర్ల నియోజకవర్గంలో ఓ ముఖ్యనేత తన స్వగ్రామంలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బాంబుల కుట్ర పన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నరసింహారావు ఈ ఏడాది మేలో మాజీ సర్పంచ్‌లు గీదా సీతారామిరెడ్డి, గోగుల లక్ష్మీ పుల్లారెడ్డి, బొల్లినేని లక్ష్మీ నారాయణతో కలిసి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నరసింహారావు కుమారుడు శివాజీ సోషల్ మీడియా ద్వారా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోస్టింగ్‌లు పెడుతుండే వాడు. శుక్రవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు తెనాలి వెంకట నారపరెడ్డితోపాటు మరో ముగ్గురు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పెట్టారు ? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు పెట్టారని కేసు నమోదు చేశామని వెల్లడించారు.
గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు
నాటు బాంబుల కలకలంతో మంచికల్లులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం అమ్మవారి తిరునాళ్ల జరగనున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుంతుందోనని గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment