అన్నీ మావే....అన్నీ మాకే
పోస్టుల భర్తీలో ముడుపులు
అడ్డగోలుగా కాంట్రాక్ట్‌లు
టీడీపీ నేతలపై
వెల్లువెత్తుతున్న
ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అంగన్‌వాడీ పోస్టులు, విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ పనులు, హుద్‌హుద్ తుపాను పనులు, ... ఇలా అన్ని పనులు, పోస్టుల భర్తీలో ప్రజాప్రతినిధుల జోక్యం అధికమవుతోంది. ఇందు గలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదికినా గలండు అన్నట్టుగా జిల్లాకు ఏదీ మం జూరైనా, జిల్లాలో ఏం చేసినా నేతల జోక్యం, చేతివాటం లేనిదే ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ‘దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి. నిధులొచ్చినప్పుడే నాలుగు కాసులు వెనుకేసుకోవాలి’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
అంగన్‌వాడీ పోస్టులతో ప్రారంభం....
ఆ మధ్య జిల్లా వ్యాప్తంగా 130 అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులను అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా పంచేసుకున్నారన్న విమర్శలొచ్చాయి. నీకిన్ని- నాకిన్ని పద్ధతిలో కార్యకర్తల పోస్టుల్ని వాటాలేసుకుని దర్జాగా తమ అనుకూల వ్యక్తులకు కట్టబెట్టారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. మూడేసి లక్షలు గుంజేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ విషయమై అర్హులైన కొందరు బాధితులు కోర్టుల్ని సైతం ఆశ్రయించారు.
ఈపీడీసీఎల్ పోస్టుల భర్తీలోనూ అదే పరిస్థితి
షిఫ్ట్ ఆపరేటర్లు, జేఎల్‌ఎం పోస్టుల భర్తీలోనూ చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 12 షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు తీసుకోగా వాటిని ప్రాంతాల వారీగా, నాయకుల వారీగా పంచేసుకుని ఒక్కొక్క పోస్టును రూ.3లక్షలకు అమ్ముకున్నట్టు అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ఈ విషయమై సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కోర్టును ఆశ్రయించారు. జూనియర్ లైన్‌మెన్ పోస్టుల విషయంలోనైతే మరింత దారుణంగా వ్యవహరించారు. ఎంపికైన
దేన్నీ... వదల బొమ్మాళీ వదల!
అభ్యర్థుల జాబితాను ముందే తెలుసుకుని, వారి వద్దకే వెళ్లి పోస్టులిప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. ఐదేసి లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలొచ్చాయి.
అధికార పార్టీ నేతలకు చిక్కిన భారీ మంచినీటి పథకాలు
జిల్లాలోని 21 భారీ మంచినీటి పథకాలు ఉన్నాయి. వీటి నిర్వహణ కాంట్రాక్టర్ కోసం టెండర్లు పిలవాలి. రూ.10లక్షల లోపు పనులకు సాధారణ టెండర్లు పిలవల్సి ఉండగా, రూ.10లక్షలు దాటే పనులకు ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలవల్సి ఉంది. రూ.10 లక్షలు దాటితే ఆన్‌లైన్‌లో టెండర్లు పిలవాల్సి వస్తుందని తెలివిగా పని విలువను విభజన చేసి, రెండేసి నెలలకని టీడీపీ నేతల సూచనల ప్రకారం అధికారులు టెండర్లు పిలిచారు. ఇదే అవకాశంగా తీసుకుని బయట వ్యక్తులెవ్వరనీ టెండర్లు వేయనివ్వకుండా బెదిరింపులకు దిగి అధికార పార్టీ నాయకులే అన్నీ తామై కోట్లాది రూపాయల కాంట్రాక్ట్‌లను దక్కించుకున్నారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులే తమ బినామీలను రంగంలోకి దించి, వారిచేత టెండర్లు వేయించి సక్సెస్‌ఫుల్‌గా దక్కించుకున్నారు.
హుద్‌హుద్ తుపాను పనులనూ వదలని తెలుగు తమ్ముళ్లు
గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపానులో దెబ్బతిన్న ఇరిగేషన్ వనరుల పునరుద్ధరణ పనుల్ని సైతం తెలుగు తమ్ముళ్లు వదల్లేదు. జిల్లాలో మధ్య, చిన్న తరహా పథకాలకు సంబంధించి 1,014పనులు చేపట్టేందుకు రూ.37కోట్ల 55లక్షల 75వేలు మంజూరవగా వాటిని కూడా దాదాపు తమ చేతుల్లోకి తీసుకున్నారు. జన్మభూమి కమిటీల ముసుగులో అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు దక్కించుకున్నారు. అధికారులు అడ్డం తిరిగిన చోట(వైఎస్సార్‌సీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో) ఏకంగా పనులే జరగకుండా అడ్డుకున్నారు.
నేతల మధ్య విభేదాలతో బయటపడ్డ ఉపాధి పనుల భాగోతం
డబ్బే పరమావదిగా భావిస్తూ వస్తున్న టీడీపీ నాయకులు చివరికీ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్ని వదల్లేదు. అయితే ఆ పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలతో ఉపాధి పనుల వ్యవహారం బయటపడింది. ఆ మధ్య జరిగిన సుమారు రూ.41కోట్లు విలువైన ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ పనుల్ని ఇలాగే అధికార పార్టీ నేతలు పంచేసుకున్నారు. వాటిలో చాలా పనులు చేతులు మారిపోయాయి. ఒక్కొక్క వర్క్‌కు ఇంతని కమీషన్ తీసుకుని అమ్మేసుకున్నారన్న విమర్శలున్నాయి. అదే తరహాలో మరో పర్వానికి తెరలేచింది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తనకున్న పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని రూ.5.29కోట్ల విలువైన పనుల్ని ప్రతిపాదించడమే కాకుండా అనుమతి కోసం ఇంజినీరింగ్ అధికారులు సిద్ధం చేశారు. మరో విశేషమేమిటంటే అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో మైత్రి వెనుక ఈ స్వలాభ మే ఉందన్న వాదనలు ఉన్నాయి. ఎంపీ హోదాలో గీతచే పనులు ప్రతిపాదించారని, అవి మంజూరయ్యాక తన ఖాతాలో వేసుకుని లబ్ధిపొందాలన్నదే వ్యూహమని సాక్షాత్తు టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఈ విధంగా టీడీపీ నేతలు దేన్ని వదలడం లేదని, పంపకాలు చేసుకుని, వాటాలేసుకుని ప్రభుత్వ నిధుల్ని, నిరుద్యోగుల ఆశల్ని కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి.
దేన్నీ...వదల బొమ్మాళీ వదల!
Published Wed, Apr 22 2015 2:28 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement