డబ్బు కొట్టు.. ప్లాట్ పట్టు! | tdp leaders committing illegal collection | Sakshi
Sakshi News home page

డబ్బు కొట్టు.. ప్లాట్ పట్టు!

Published Wed, Dec 23 2015 12:40 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

tdp leaders committing illegal collection

అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న  కొందరు ‘తమ్ముళ్లు’
పట్టించుకోని పోలీసులు .. మోసపోతున్న పేదలు

 
తెనాలి అర్బన్ : తెనాలిలో అక్రమ వసూళ్ళ పర్వం కొనసాగుతోంది. ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేసి కొందరు అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి ఏకంగా పేదలను దోచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారనే వాదన పట్టణంలో విన్పిస్తోంది. ఇదే విషయాన్ని కొందరు టీడీపీ నాయకులు సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వయంగా వెల్లడించడాన్ని బట్టి దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమౌతుంది.
 
పేదలే టార్గెట్..
 తెనాలి పట్టణంలో మొత్తం 40 వార్డులున్నాయి. ఇక్కడ అనేక మంది పేదలు నివశిస్తున్నారు. వీరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే ఉద్ధేశంతో దివంగత మహానేత వైఎస్ అప్పట్లో భావించారు. అందులో భాగంగా అప్పటి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పెదరావూరు సమీపంలో సుమారు 40 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు రైతులు దీనిపై కోర్టును ఆశ్రయించగా మరి కొందరు స్వచ్ఛందంగా భూమిని ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆ స్థలంలో అపార్ట్‌మెంట్‌లను ని ర్మించి పేదలకు ఇవ్వాలని భావించారు. ఎంపికైన లబ్ధిదారుడు ప్రభుత్వానికి రూ.50 వేలు చెల్లిస్తే ప్రభుత్వం బ్యాంకర్ల సాయంతో దానిని నిర్మించి పేదలకు అందజేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులకు తెలిసింది.

దీంతో కొందరు స్థానిక సంస్థల ప్ర జా ప్రతినిధులు, నాయకులు వసూళ్ళ పర్వానికి తెర తీశారు. లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే తమ ఆమోదం లేకుండా కుదరదని పేదలను నమ్మిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక్కో పేదవాడి నుంచి రూ.10 వేల నుంచి రూ.25 వేల వర కు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో దళారి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, గ్యాస్ కనెక్షన్లను ఇప్పిస్తామని మరి కొందరు టీడీపీ నాయకులు పేదలను దోచుకుంటున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీనిపై తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, డీఎస్పీ సీహెచ్ సౌజన్యలను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఇలాంటి అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. బాధితులెవరైనా తమకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement