రాజధాని పేరిట అక్రమ దందా
పెద్ద కొడుక్కి విరాళమట!
పింఛను సొమ్ములో రూ.100 కోత
జన్మభూమి కమిటీల తీర్మానాలంటూ తెలుగు తమ్ముళ్ల హడావుడి
ప్రశ్నిస్తే.. పింఛను రాదంటూ హెచ్చరికలు
కౌతవరం బ్యాంకు ప్రాంగణంలో బాహాటంగా వసూళ్లు
రెండు జిల్లాల్లో రూ.7 కోట్ల వసూలు లక్ష్యం!
రాజధాని శంకుస్థాపన పేరుతో వందల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లకు తెరతీసింది. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా ఈ వసూళ్లకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిని పింఛను రాదంటూ బెదిరింపులకు దిగుతున్నారు. విరాళం అంటే ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా ఇచ్చేదై ఉండాలి.. కానీ ముందే రూ.100 చొప్పున కోత విధించి మిగిలినదే చేతిలో పెడుతుండటం శోచనీయం.
విజయవాడ : రాజధాని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు సరికొత్త దందాకు తెరతీశారు. ఇసుక మొదలుకొని మద్యం షాపుల వరకు దేనినీ వదలని ‘తెలుగు’ తమ్ముళ్లు ఆఖరికి పింఛనుదారుల నుంచీ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఇకపై పింఛను రాదంటూ బెదిరిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పింఛనుదారుల నుంచి రాజధాని నిర్మాణానికి విరాళం పేరుతో పింఛను మొత్తంలో రూ.100 కోత విధించే కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం రోజుల నుంచే జన్మభూమి కమిటీలు తీర్మానం చేశామంటూ హడావుడి చేసి ఈ నెల రెండో తేదీ నుంచి ఈ వసూళ్లు మొదలుపెట్టాయి. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఫించనుదారులు అక్రమ వసూళ్ల పర్వాన్ని నిలదీయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
గ్రామాల్లో అలజడి...
ప్రతి ఇంటికి పెద్ద కొడుకై వెయ్యి రూపాయల పింఛను నెలనెలా ఇస్తున్నాడు. అందులో రూ.100 విరాళం రాజధాని నిర్మాణం కోసం పెద్ద కొడుక్కి ఇవ్వలేరా.. అంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వసూళ్ల బాధ్యత పంచాయతీ సర్పంచ్, స్థానిక జన్మభూమి కమిటీలపై పెట్టడంతో గ్రామాల్లో అలజడి మొదలైంది. రెండు జిల్లాల్లో కలిపి 7.01 లక్షల మంది అన్ని కేటగిరీల పింఛనుదారులు ఉన్నారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రూ.67.89 కోట్లు నెలనెలా బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నాయి. మరో వారం వ్యవధిలోనే రెండు జిల్లాల్లో కలిపి రూ.7 కోట్లు వసూలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు.
ఇచ్చే సొమ్ములో ముందే కోత...
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, తోడు కోల్పోయి అనాథలుగా మారిన వితంతువులు, అంగవైకల్యంతో ఉన్న వికలాంగులపై జాలి చూపాల్సింది పోయి.. వారికి ఇచ్చే అరకొర సొమ్ములోనే విరాళాల పేరుతో అడ్డగోలు వసూళ్లకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలే బహిరంగంగా ప్రకటనలు చేసి మరీ రూ.100 విరాళం ఇవ్వాలని కోరుతుండగా, ఇక్కడ మాత్రం జన్మభూమి కమిటీల పేరుతో వసూళ్లు సాగిస్తున్నారు. బ్యాంకర్లతో ముందే మాట్లాడుకుని ఇచ్చే పింఛను మొత్తంలో నుంచి రూ.100 ముందే కోత విధించి మిగిలిన సొమ్ము లబ్ధిదారులకు ఇచ్చేలా ప్లాన్ చేయటం గమనార్హం. మంగళవారం కౌతవరం ఆంధ్రాబ్యాంకు ప్రాంగణంలోనే టీడీపీ నేతలు ఈ వసూళ్లకు తెగబడటం వివాదాస్పదమైంది. తమకు ఏ గతీ లేక పింఛను తీసుకొని బతుకుతున్నామని, అందులోనూ కోత విధిస్తే ఎలా అని ప్రశ్నించారు.
రాజధానికి ఎందుకివ్వాలి
రాజధాని నిర్మాణానికి పింఛనుదారుల నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే డబ్బుల్లో ముందే కోత విధించి పింఛను ఇవ్వటం విడ్డూరంగా ఉంది. అసలు రాజధాని నిర్మాణానికి చందాలు పింఛనుదారులే ఎందుకు ఇవ్వాలి. ఇష్టమైతే చందా ఇస్తారు గాని బలవంతంగా లాక్కుంటారా?
- దాసి రాధాకృష్ణ,
కౌతవరం శివారు బలరామపురం కమిటీ నిర్ణయిస్తే దందా చేస్తారా?
గ్రామంలో చంద్రబాబు చెబితే కమిటీ వేసుకున్నారట. ఆ కమిటీ చెప్పిన మేరకు ఈ వసూళ్లు చేస్తుంటే మేము చూస్తా ఊరుకోవాలా? వందేసి రూపాయలు బలవంతంగా వసూలు చేయటం దారుణంగా ఉంది. దానికి రాజధాని నిర్మాణం పేరు పెట్టి ఏదో బాకీలాగా బలవంతంగా వసూలు చేస్తున్నారు.
- బోలపాటి నిర్మల,
కౌతవరం శివారు బలరామపురం