అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు
నగరిలో టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం
అంతర్మధనంలో పలువురు సీనియర్లు
కక్ష సాధింపుతోనే ఎమ్మెల్యే రోజా, మున్సిపల్ చైర్‌పర్సన్ కుటుంబంపై కేసులు
చిత్తూరు : నగరిలో ఏటా ఘనంగా నిర్వహించుకునే గంగ జాతరలోను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసి వర్గ వైషమ్యాలకు ఆజ్యం పోస్తోంది. పార్టీలకు అతీతంగా ఐదేళ్ల నుంచి జాతర నిర్వహిస్తున్న కమిటీని ఈ సారి పూర్తిగా టీడీపీ నేతలు హస్తగతం చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జాతర పేరుతో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు తెరతీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సంబంధిత అధికారి ఒకరు అక్రమ వసూళ్లకు పాల్పడరాదంటూ పత్రికా ప్రకటనలు చేసిన విషయం విదితమే.
గతేడాది జరిగిన జాతరలో ఎమ్మెల్యే రోజాపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడిన సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోజా ఎమ్మెల్యేకాక ముందు నుంచే ప్రతి ఏటా జాతరలో భాగంగా శుక్రవారం జరిగే అమ్మవారి హారతికి హాజరుకావడం తెలిసిందే. ఆమెకు అప్పట్లో జాతర నిర్వాహక కమిటీ సభ్యులంతా స్వాగతం పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి జరిగిన జాతర (గతేడాది)లో హారతి రోజున టీడీపీ నేతలు చేసిన దాడిలో గాయపడినా ఆమె సహనంతో ఉన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సహకరించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఓటమిని జీర్ణించుకోలేకనే టీడీపీ నేతలు అడ్డదారుల్లో ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్‌ను అడ్డం పెట్టుకుని పోలీసుల సహకారంతో చైర్‌పర్సన్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టడం తెలిసిందే. మరోవైపు ఈ నెల 15, 16,17,18 న నగరిలో జరిగే జాతరలో తమ ఆధిపత్యం చూపించుకోవాలనే వ్యూహంతో మున్సిపల్ చైర్‌పర్సన్ కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగానే జాతరకు దూరం చేశారు.
కేసుల్లో జైలుకెళ్లిన మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, మరో నలుగురికి బెయిల్ వస్తుందని తెలిసి వారు జాతరకు వారొస్తే గొడవలు జరుగుతాయంటూ పోలీసు అధికారులతో నివేదిక ఇప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఇందు కోసం పార్టీలోకి వలసొచ్చిన ఓ టీడీపీ నేత లక్షలాది రుపాయలు ఖర్చుపెట్టారన్న ప్రచారం ఉంది. అయితే టీడీపీ నేతలపై పలుకేసులు ఉన్నా పోలీసులు ఎటువంటి నివేదికలు ఇవ్వకపోవడం గమనార్హం.
జాతరపై టీడీపీ రాజకీయం
Published Tue, Sep 15 2015 4:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement