పాదయాత్రను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే వర్గీయులను పక్కకు తోస్తున్న జెడ్పీ వైస్ చైర్మన్, పూర్ణచంద్రరావు ఆయన అనుచరులు
వెంకటపాలెం(తుళ్లూరురూరల్): రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గంలో టీడీపీలో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంగళవారం తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామం నుంచి మళ్లీ నువ్వే రావాలి బాబు అంటూ జెడ్పీ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు పూర్ణచంద్రరావు తన అనుచరులతో గ్రామంలోకి ప్రవేశిస్తుండగా ఒక్కసారిగా ‘పూర్ణచంద్రరావు డౌన్ డౌన్’ అంటూ మరో వర్గం సభ్యులు దూసుకువచ్చారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఇష్టారీతిన కార్యక్రమాలు ఎలా చేస్తారంటూ పూర్ణచంద్రరావు వ్యతిరేక వర్గం నిలదీసింది. వెంకటపాలెం మాజీ సర్పంచ్ సోదరునిపై అసమ్మతి వర్గం నాయకులు దాడి చేయడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తుళ్లూరు ట్రాఫిక్ సీఐ ఆనంద్, సివిల్ ఎస్‌ఐ కే శ్రీనివాసరావు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన గడ్డం మార్టిన్ మాట్లాడుతూ కేవలం దళిత ఎమ్మెల్యే కావడంతోనే అగ్ర వర్ణాల వారు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
అధికార పార్టీ కార్యక్రమాలకు30 యాక్ట్ అమలు కాదా?
రాజధాని ప్రాంతంలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వెంటనే పోలీసులు వాళ్ల ఇంటి ముందు వాలిపోతారు. అదే ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులను అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుంటారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలకు చట్టాలతో పని లేదు. నాయకులకు యాక్ట్‌లు వర్తించవు. వారం రోజులుగా రాజధాని భూములిచ్చిన నాలుగు గ్రామాల రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే సెక్షన్‌ల పేరుతో దీక్షను భగ్నం చేశారు. కాని మంగళవారం విజయవాడ నుంచి సచివాలయానికి మార్గం అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మాత్రం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment