టీడీపీ కార్యాలయ ఆవరణలోనే ధర్నా చేస్తున్న 23వ వార్డు అ«ధ్యక్షుడు రామారెడ్డి వర్గీయులు
అర్బన్ టీడీపీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడిపైనే ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. పార్టీ కార్యాలయం వేదికగా నిరసనలు మిన్నంటాయి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఎందాకైనా వెళ్తామంటూ తేల్చిచెప్పారు. కులం పేరుతో దూషించిన అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు పెట్టబోతున్నట్టు వెల్లడించారు.
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. అవినీతికి పాల్పడుతూ పార్టీని భ్రష్టుపట్టించడమే కాకుండా దశాబ్దాలుగా జెండాలు మోసిన తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పార్టీ క్యాడర్ మండి పడుతోంది. పార్టీ 23వ వార్డు అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన పెనుమల్లు వెంకటరామారెడ్డిని తప్పించి రాత్రికి రాత్రే బంగారి రవిశంకర్‌ను నియమించడంపై రామారెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
తమకు జరిగిన అన్యాయంపై మొరపెట్టుకునేందుకు వెళ్తే కులం పేరుతో ఎమ్మెల్యే వాసుపల్లి నానా దుర్భాషలాడడంతో వారు రగిలిపోతున్నారు. ఈ చర్యలను నిరసిస్తూ రామారెడ్డితో సహా ఆయన అనుచరగణం బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆందోళనకు దిగింది. కార్యాలయం ఆవరణలోని దివంగత ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. వాసుపల్లి డౌన్‌డౌన్, కరప్షన్ కింగ్ వాసుపల్లి, ఎస్సీ, ఎస్టీలను దుర్భాషలాడిన వాసుపల్లి మాకొద్దు.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేవి ఒంటెద్దు పోకడలు
బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, క్యాడర్ మొత్తం రామారెడ్డి వెనుకే ఉందని, అలాంటప్పుడు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రాత్రికి రాత్రే అధ్యక్షుడి మార్పు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని, రౌడీషీటర్లను వెంట తిప్పుకుంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అన్నింటిలోనూ కమీషన్ల తీసు కుంటూ అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వాసుపల్లిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు.
రొటేషన్ పద్ధతిలో రవిశంకర్ ఎంపిక
23వ వార్డులో ఎస్సీ నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో బంగారి రవిశంకర్‌ను రొటేషన్ పద్ధతి ద్వారా ఎంపిక చేశామంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు సేవలందించిన రామారెడ్డిని పార్టీ అర్బన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించామని, అదే సామాజిక వర్గానికి చెందిన గేదల వెంకటరెడ్డిని డివిజన్ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు చెప్పుకొచ్చారు. దీనిపై రామారెడ్డి వర్గీయులు స్పందిస్తూ తమకు ఎలాంటి పదవులు అవసరం లేదని, తమ నాయకుడ్ని మళ్లీ వార్డు అధ్యక్షునిగా ప్రకటించి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. వాసుపల్లి తీరును జిల్లా ఇన్‌చార్జి మంత్రి చినరాజప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవసరమైతే పార్టీ అధినేతకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇటీవల పార్టీ సీనియర్ నాయకుడైన ఒదూరి శివయ్యను కులం పేరుతో దూషించిన ఎమ్మెల్యే వాసుపల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టబోతున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment