► రాజీనామా చేస్తానంటూ బొండా ఉమా హడావుడి
► నీ చిట్టా నా వద్ద ఉందంటూ సీఎం సీరియస్
► రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా : కాగిత
రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చిచ్చురేపింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఏకంగా సీఎంపై విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. ఎంపీలు బుజ్జగించినా మెట్టు దిగలేదు. అయితే సీఎం సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. మరోవైపు జిల్లాలో సీనియర్ అయిన పెడన ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అనుచరులు బంటుమిల్లిలో ఆందోళన నిర్వహించారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాగితపై ఒత్తిడి చేస్తున్నారు.
కాపుల గొంతు కోశారు. రాజధానిలో ఉన్న నేను 13 జిల్లాల కాపు నాయకులకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను. ఏ సమస్య అయినా అన్ని జిల్లాల కాపు నాయకులు నా వద్దకే వస్తున్నారు. అందరికీ పనిచేసి పెడుతున్నా. పార్టీ పెద్దలు నన్ను, కాపులను వాడుకుని ఇప్పుడు వదిలేస్తున్నారు. కాపులను నాశనం చేస్తున్నారు. – బొండా ఉమా, సెంట్రల్ ఎమ్మెల్యే
మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగినట్టేనా..? మీ భూకబ్జాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చేసేవన్నీ నాకు తెలుసు. గన్‌మన్‌పై దాడిచేసినా కేసులు పెట్టలేదు. కాపు సామాజికవర్గ అంశాన్ని వివాదంచేస్తే సహించను. పదవులు దక్కలేదని అందరూ ఇలాగే చేస్తున్నారా.. జాగ్రత్త. – ఇదీ బొండా ఉమాకు సీఎం వార్నింగ్ (విశ్వసనీయ సమాచారం ప్రకారం)
శనివారం రాత్రి 9 గంటల వరకు జాబితాలో నా పేరు ఉంది. కొందరు కుట్రచేసి నా పేరును తొలగింపజేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని కొనసాగిస్తున్నారు. 30ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నా. ఇప్పటికీ మంత్రి పదవి రాకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. – కాగిత వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే
సాక్షి, విజయవాడ/మచిలీపట్నం: సీనియారిటీకి చోటు లేదు. అధినేత అనుగ్రహం కోసం నిగ్రహం కోల్పోయి ప్రతిపక్ష నాయకులపై బండ బూతులు తిట్టినా ప్రయోజనం లేదు. పదవి కోసం విలువలకు తిలోదకాలిచ్చి పార్టీ ఫిరాయించినా ఫలితం దక్కలేదు. మంత్రివర్గ పునర్‌వ్యస్థీకరణలో జిల్లా నుంచి కొత్తగా ఎవరికీ అవకాశం కల్పించలేదు. దీంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణస్వీకారం చేసినవారే 2019 ఎన్నికల టీమ్‌గా ప్రచారం జరగడంతో అసంతృప్త నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక తమకు ఇప్పట్లో మంత్రి అయ్యే అవకాశం ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఏకంగా సీఎం చంద్రబాబుపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనుచరులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు.
ఉమా ఇంటి వద్ద డ్రామా...
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటి వద్ద ఆదివారం ఉదయం పెద్ద హైడ్రామా నడిచింది. మంత్రి పదవి లభించకపోవడంతో మనస్తాపానికి గురైన బొండా ఉమా టీడీపీకి రాజీనామా చేస్తారని ఆయన వర్గం ప్రచారం చేసింది. ఉమాకు మద్దతుగా 18 మంది కార్పొరేటర్లు, పలు డివిజన్ల పార్టీ అధ్యక్షులు కూడా రాజీనామా చేస్తారని కొందరు హడావుడి చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కాపులంతా తన వద్దకే వస్తున్నారని, అందువల్ల రాజధానిలో ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తే తమ సామాజికవర్గానికి ఉపయుక్తంగా ఉంటుందని బొండా ఉమా వాదిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆయన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఒక కాల్‌కు బదులిస్తూ ‘రాష్ట్రంలో కాపుల గొంతు చంద్రబాబు కోశారు. కాపులను నాశనం చేశారు. కాపులను వాడుకుని వదిలేస్తున్నారు..’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. అప్పటికే ఉమా ఇంటికి వచ్చి బుజ్జగిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ వారించారు. కొద్దిసేపు వారు చర్చించుకున్న తర్వాత అందరూ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.
పెడన నియోజకవర్గంలో రగడ
పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు నాగేశ్వరరావుపేటలోని కాగిత నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కృత్తివెన్ను ఎంపీపీ వలవల సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు ఒడుగు తులసీరావు, బంటుమిల్లి జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కరుణజ్యోతి, కృత్తివెన్ను డీసీ చైర్మన్ నెక్కంటి భాస్కరరావు, కౌతవరం డీసీ చైర్మన్ శలపాటి ప్రసాద్, గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు చిలుకోటి గోపాలకృష్ణ గోఖలే, ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యకర్తలు, ఇతర టీడీపీ శ్రేణులు కాగితకు తమ పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు.
టీడీపీ గూడూరు మండల అధ్యక్షుడు పోతన స్వామి కార్యాలయంలో సమావేశమైన నాయకులు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటరులో టీడీపీ నాయకులు ఆందోళన చేసి నిరసన తెలిపారు. కాగితకు మంత్రి పదవి వచ్చిందని... మంత్రి ఉమా అడ్డుకున్నారని కొందరు నాయకులు నినాదాలు చేశారు. అయితే కొందరు నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుకు లేఖలు కూడా పంపినట్లు తెలిపారు.
నేరవేరని జలీల్‌ఖాన్ కల
ముస్లిం మైనారిటీ కోటాలో మంత్రి పదవిని ఆశించి పార్టీ ఫిరాయించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు నిరాశే మిగిలింది. తాను వైఎస్సార్ సీపీ తరఫున గెలిచినా... టీడీపీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఇప్పుడు షాక్ ఇచ్చారని జలీల్‌ఖాన్ మథనపడుతున్నట్లు తెలిసింది. ఆయన సోమవారం సీఎంను కలిసే అవకాశం ఉంది.
చంద్రబాబు సీరియస్
కాపుల గొంతు కోశారంటూ బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ‘మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగినట్లేనా..’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘మీ భూ కబ్జాల చిట్టా మొత్తం నా వద్ద ఉంది. మీరు చేసేవన్నీ నాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి. రవాణాశాఖ గన్‌మన్‌పై దాడికి ప్రయత్నించినా కేసు పెట్టనీయలేదు. కాపు అంశాన్ని వివాదం చేస్తే సహించబోను..’ అని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. సీనియర్లకు పదవులు దక్కలేదని, అందరూ ఇలాగే చేస్తున్నారా... అని బొండాను ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఉమా తోకముడిచి వెనక్కి వచ్చేశారని సమాచారం.
కొందరు అడ్డుకున్నారు : కాగిత
ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 9 గంటల వరకూ మంత్రివర్గ జాబితాలో తన పేరు ఉందని, కొందరు నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించి తొలగింపజేశారని చెప్పారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అయితే అవినీతి ఆరోపణలు ఉన్న వారిని మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారని తెలిపారు. తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే అప్పటికప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
గత 30 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పని చేస్తున్నానని, 2014లో మంత్రివర్గ కూర్పులోనూ తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నాయకులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. రెండు రోజుల్లో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని కాగిత ప్రకటించారు.
రాజకీయ, కుల సమీకరణల వల్లే బొండాకు అన్యాయం : కేశినేని
కొన్ని రాజకీయ, కుల సమీకరణల మూలంగానే ఎమ్మెల్యే బొండా ఉమాకు న్యాయం చేయలేకపోయామని సీఎం చంద్రబాబు చెప్పారని ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఒక ప్రకటనలో తెలిపారు. పది రోజుల్లో సరైన పదవితో బొండాకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.