నిధులపై తమ్ముళ్ల కన్ను
పనులన్నీ తమ వారికే ఇవ్వాలని ఒత్తిళ్లు
భయపెట్టి బలవంతంగా పనులు చేసుకుంటున్న వైనం
చెప్పినట్లు విననందుకు సీఈఓని టార్గెట్ చేసిన తమ్ముళ్లు
నెల్లూరు : టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది దాటినా అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు విడుదల చేయటంలో విఫలమైంది. జిల్లాకు చెందిన నారాయణ మంత్రిగా ఉన్నప్పటికీ నెల్లూరుతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో నిధుల్లేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ప్రభుత్వం నుంచి జిల్లాకు నిధులేవీ రాకపోయినా.. జెడ్పీ నుంచి విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో రోడ్లు, బోర్లు, వివిధ భవనాల నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఆకలి మీద ఉన్న తమ్ముళ్లు కొందరు జడ్పీ నిధులపై కన్నేశారు.
అందులో భాగంగా కొందరు టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు తమకు సంబంధంలేని మండలాల్లో చొరబడి బలవంతంగా పను లు చేసుకుంటూ... ప్రశాంతంగా సాగుతున్న జెడ్పీ పాలనను పక్కదారి పట్టిస్తున్నారు. అదేవిధంగా జెడ్పీ అధికారులపైనా పెత్తనం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. అందులో భాగంగా జెడ్పీ సీఈఓను టార్గెట్ చేశారు. మొదటగా జిల్లాలో కొన్ని మండలాల్లో జెడ్పీటీసీ ఎవరైనా..సరే పనులు తమకే అప్పగించాలని ఒత్తిళ్లు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా దొరవారిసత్రం మండలంలో స్థానిక జెడ్పీటీసీకి కాకుండా టీడీపీకి చెందిన ఫ్లోర్‌లీడర్ చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా గూడూరు, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో మరో ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు చేయాల్సిన పనులను టీడీపీ నేతలు బినామీ పేర్లతో చేస్తున్నట్లు తెలిసింది. వీటికోసం జెడ్పీ సీఈఓపై ఒత్తిళ్లు తెచ్చి పనులు చేజిక్కించుకున్నట్లు అధికారి ఒకరు వెళ్లడించారు. ఈ పరిణామాలతో జిల్లాలలోని కొందరు జెడ్పీటీసీ సభ్యులు టీడీపీ నేతల తీరుతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలపై మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిసింది.
ఫోన్‌చేస్తే జెడ్పీ మీటింగ్‌ను వాయిదా వేయాలట
జిల్లా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జెడ్పీ సమావేశం కంటే.. తమ అధినేత నిర్వహించే సభకే టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు ప్రాధాన్యమిచ్చారు. ఈనెల 8న జెడ్పీ సమావేశం ఉందని పది రోజులకు ముందే నిర్ణయించారు. ఆమేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే సీఎం గుంటూరు జిల్లాలో నిర్వహించే సమావేశానికి వెళ్లేందుకు జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, మిగిలిన నాయకులు సిద్ధమయ్యారు. అదేరోజు జెడ్పీ సమావేశం ఉండటంతో వాయిదా వేయాలని జెడ్పీ సీఈఓ, చైర్మన్‌కు ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిసింది. అందుకు చట్టం ఒప్పుకోదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
ప్రజా సమస్యల కంటే అధినేత సమావేశమే ముఖ్యమని టీడీపీ జెడ్పీటీసీలు సర్వసభ్య సమావేశానికి డుమ్మాకొట్టారు. ఈనెల 8న యధావిధిగా సమావేశం జరిగింది. తాము చెప్పినా సమావేశాన్ని వాయిదా వేయకపోవటంపై టీడీపీ నేతలు సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమ్ముళ్లు చెప్పారని ఊగిపోయిన సీఎం సీఈఓను మందలించారని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. సమావేశాన్ని వాయిదా వేయలేదనే కారణాన్ని బూచిగా చూపి సీఈఓను ఇక్కడి నుంచి పంపేందుకు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. ఆ మేరకు ఆయనను బదిలీ చేయించారు. జెడ్పీలో టీడీపీ నేతల తీరును చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కంటే టీడీపీ జెడ్పీటీసీ సభ్యులకు అధినేత సమావేశమే ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు.
జెడ్పీలో జగడం
Published Wed, Jun 17 2015 11:25 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement