
దళితుల భూముల్లో సర్కారు దౌర్జన్యం
♦ 70 ఏళ్లుగా పేదలు సాగు చేస్తున్న భూములు లాక్కుని చెరువు తవ్వకం ∙
♦ ప్రకాశం జిల్లా దేవరపల్లిలో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు బరితెగింపు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తమకు ఓట్లేయలేదనే అక్కసుతో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పోలీసుల అండతో దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఈసారి ప్రకాశం జిల్లాలో 70 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములపై టీడీపీ నేతల కన్నుపడింది. ఇప్పటికే గ్రామంలో రెండు చెరువులు అందుబాటులో ఉన్నా అవి చాలవంటూ దళితులు పండిస్తున్న పొల్లాల్లో యంత్రాలు మోహరించి మరో చెరువు తవ్వేందుకు సిద్ధపడ్డారు. నిండా 600 కుటుంబాలు కూడా లేని ఓ గ్రామంలో.. అదీ పేదలు దశాబ్దాలుగా నమ్ముకున్న భూముల్లో చెరువుల తవ్వకం పేరుతో వికృత రాజకీయాలకు పాల్పడటంపై ప్రజలు నివ్వెరపోతున్నారు!
దళితవాడపై విరుచుకుపడ్డ ఖాకీలు
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో సర్వే నం.159/1లోని 22 ఎకరాల భూములు గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాల స్వాధీనంలో ఉన్నాయి. 70 ఏళ్లుగా వారు వాటిని సాగు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తూనే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో స్థానిక అధికార పార్టీ నేతలు ఆ భూములను లాక్కునేందుకు పలుమార్లు ప్రయ త్నించారు. గురువారం తెల్లవారుజామున దళితుల భూముల్లో జేసీబీలు, ఇటాచీలు మోహరించి పోలీస్ బలగాల పహరాలో కుంట తవ్వకం ప్రారంభించారు. మరోవైపు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దేవరపల్లి దళితవాడపై పోలీస్ బలగాలు విరుచుకుపడ్డాయి.
పడుకున్న వారిని పడుకున్నట్లే అరెస్ట్ చేసి లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్లలో పడేశారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో యంత్రాలను తరలించి దౌర్జన్యంగా ‘నీరు–చెట్టు’ పథకం కింద కుంట తవ్వకం ప్రారంభించారు. సాయంత్రం వరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు దళితులకు మద్దతుగా దేవరపల్లికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మీడియాను సైతం చెరువు తవ్వకం వద్దకు అనుమతించలేదు. పర్చూరు నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 100 మందికిపైగా నేతలను వివిధ పోలీస్‌స్టేషన్లలో నిర్భంధించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పర్చూరు చేరుకున్న సీపీఎం నేత మధును సైతం అదుపులోకి తీసుకున్నారు.
చెరువుల అభివృద్ధికి దళితుల భూములు
పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గత ఎన్నికల్లో దళితులు తమకు ఓట్లేయలేదన్న అక్కసుతో 70 ఏళ్లుగా వారు సాగు చేసుకుంటున్న భూములు లాక్కునేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో ఇప్పటికే రెండు చెరువులున్నాయి. 600 కుటుంబాల్లోపు ఉన్న దేవరపల్లి వాసుల అవసరాలకు ఈ రెండు చెరువుల్లో నీరు నింపితే సరిపోతుంది. దళితుల భూములు లాక్కోవాల్సిన అవసరమే లేదు. గ్రామంలో 12 ఎకరాల పరిధిలో ఓ చెరువు ఉంది. 5 ఎకరాల 37 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న చెరువు నీటిని గ్రామంలోని అన్ని వర్గాల వారు గృహాలు, ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు.
టీడీపీ నేతల కబ్జా జోలికెళ్లని అధికారులు
దేవరపల్లి పరిధిలోనే అధికార పార్టీకి చెందిన నేతలు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నా వాటి జోలికి వెళ్లని అధికారులు... 70 ఏళ్లుగా దళితులు నమ్ముకున్న పొలాన్ని లాక్కున్ని కుంట తవ్వాలనుకోవడం కక్షపూరిత రాజకీయా లకు నిదర్శనం. అక్కసుతోనే ఈ చర్యలకు దిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
దళితులకు అండగా నిలబడదాం పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:ప్రకాశం జిల్లా లో అధికార పార్టీ నేతలు దళితుల భూములను ఆక్రమించి దౌర్జన్యంగా కుంట తవ్వకాలకు దిగటాన్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించా రు. దేవరపల్లి దళితులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. దేవరపల్లిలో అధికార పార్టీ నేతలు దళితుల భూములను ఆక్రమించిన విషయం తెలుసుకున్న జగన్ దళితులకు పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. శుక్రవారం బాలినేనితో పాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జునలతో పాటు ఇతర నేతలు దేవరపల్లిని సందర్శించా లని ఆదేశించారు. అవసరమైతే తానూ దేవరపల్లి సందర్శిస్తానని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంపై హోం శాఖకు, ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఎంపీ వైవీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూములను ప్రభుత్వం లాక్కోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ రామ్‌శంకర్ కటేరియాను కలిసి విడిగా వినతిపత్రాలు సమర్పించారు.