ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ తెలుగుదేశం పార్టీ కొంతమంది అధికారులతో అడ్డదారులు తొక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. పోస్టల్ బ్యాలెట్‌లో అధికశాతం ఓట్లు తమకు అనుకూలంగా వచ్చేలా చూడాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తోంది. తాయిలాల ఎరకు తెరతీసింది. తమకు అనుకూలంగా వ్యవహరిస్తే మీకు మంచి భవిష్యత్ ఉంటుందంటూ భరోసా ఇస్తోంది. ఐదేళ్లపాటు అధికారపార్టీతో అంటకాగిన కొంతమంది అధికారులు ‘జీ హుజూర్’ అంటూ తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా పోస్టల్ బ్యాలెట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే టీడీపీ నేతలు ఎకంగా ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ తమచేతికివ్వాలంటూ తీవ్ర ఒత్తిడిలు తెస్తున్నారు.
సాక్షి, ఒంగోలు టౌన్: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై దృష్టిపెట్టిన అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలు తీవ్రం చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో ఎంతమంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో ఇప్పటికే లెక్కలను సేకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులను నిర్వర్తించే జాబితాలను దగ్గర పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించే పనిలో కొంతమంది అధికారులు నిమగ్నమయ్యారు.
భారీ ఆఫర్లు
కొత్త రాష్ట్రంలో రెండోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం అధిష్టానం అన్ని జిల్లాల నాయకత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో జిల్లా స్థాయి నాయకత్వం తమకు అనుకూలంగా ఉంటున్న అధికారులకు ఇప్పటికే రహస్యంగా దిశానిర్ధేశం చేసింది. ఐదేళ్లపాటు తెలుగుదేశం పాలనను తమకు అనుకూలంగా మలచుకున్న కొంతమంది అధికారులు ‘బాబు’పై భక్తిని చాటుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ మంచి అవకాశంగా భావిస్తూ టీడీపీ నాయకులకంటే రెండడుగులు ముందుకు వేస్తుండటం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంతమంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో జాబితా తీసుకొని ఆ ఉద్యోగుల్లో కూడా తెలుగుదేశంకు సానుభూతిపరులుగా ముద్రపడిన వారిద్వారా సహచర ఉద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టల్ బ్యాలెట్‌కు ఐదు నుంచి పదివేల రూపాయల వరకు ఇప్పిస్తామంటూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న ఉద్యోగులకు ఆశ చూపిస్తున్నారు.
బెదిరింపులు
పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ప్రలోభాలకు లొంగకుండా తటస్థంగా ఉంటూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వాసన ఉన్న ఉద్యోగులు ఎటూ ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తారు కాబట్టి, తటస్థంగా ఉండే వారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగుల వివరాలను సేకరించి వారిని బెదిరింపులకు గురిచేస్తున్న ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశంకు అనుకూలంగా ఓట్లు వేయకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారంటూ ‘పసుపు’రంగు పులుముకున్న సహచర ఉద్యోగులు హెచ్చరికలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. దీంతో ఉద్యోగులు ప్రశాంతంగా ఎన్నికల విధులు నిర్వర్తించే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని పోస్టల్ బ్యాలెట్లను ఏదోఒకరకంగా తెలుగుదేశం ఖాతాలో వేయించేందుకు కొంతమంది అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. రోజులన్నీ ఒకేలా ఉండవని వారి అత్యుత్సాహాన్ని చూసిన అధికారులు, సిబ్బంది వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
ప్రత్యేక దృష్టి పెట్టాలి
పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు తటస్థ అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. ‘పసుపు’మయమైన అధికారులు, ఉద్యోగులను నియంత్రించి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు ప్రశాంతంగా, స్వేచ్ఛగా తమకు నచ్చిన వారికి ఓట్లు వేసుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు, బెదిరింపులకు పోస్టల్ బ్యాలెట్ సరండర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పోస్టల్ బ్యాలెట్లను తమకివ్వాలని టీడీపీ నాయకుల ఒత్తిడి
కందుకూరు: ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు అధికం అవుతున్నాయి. ప్రజా క్షేత్రంలో ఎన్నిక నెగ్గలేమని తేలాక పలు రకాల ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రధానంగా డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు ఆర్‌పీలు (రీసోర్స్ పర్సన్స్)కు అధికారులు ఎన్నికల విధులు కేటాయించారు. వీరికి పోస్టల్ బ్యాలెట్లను ఇవ్వనున్నారు. అయితే వారి పోస్టల్ బ్యాలెట్ ఓటును తమకు తెచ్చి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సమైఖ్య అధ్యక్షురాలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ తరుపున మొత్తం పెత్తనం తీసుకుని డ్వాక్రా మహిళలు, ఆర్‌పీలపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల పోస్టల్ బ్యాలెట్లను సైతం తమకే తెచ్చి ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై పలువురు ఉద్యోగులు తాము స్వేచ్ఛగా విధులెలా నిర్వహించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమె నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలు అంతా టీడీపీకే ఓటు వేయాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్న విషయం బహిరంగ రహస్యం. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్‌ను ఇతరుల చేతికి ఇవ్వడానికి అవకాశం లేదు. ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. వారు తమ ఓటు వేసిన బ్యాలెట్‌ను స్వయంగా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో గాని, లేదా పోస్టు ద్వారా గాని పంపాలి.
భారీగా తాయిలాల ఎర
కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 1900 పోస్టల్ బ్యాలెట్‌లున్నాయి. వీటిని తమకు వేయించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల స్థానిక పాలటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే మకాం వేసిన టీడీపీ నేతలు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్‌ను చేతికి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్న వారిని గుర్తించి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment