సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలుగుదేశానికి జిల్లాలో ఏదీ కలిసొచ్చేలా కనిపించడం లేదు. 2009 ఎన్నికల నాటి నుంచి మొన్నటి దాకా నియోజకవర్గా లకు కనీసం ఇన్‌చార్జులను కూడా నియమించుకోలేని దుస్థితిలో ఆ పార్టీ కొట్టుమిట్టాడింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాగోలా కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించింది. గతేడాది చివరి దాకా జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన వంగాల స్వామిగౌడ్‌ను హుజూర్‌నగర్ ఇన్‌చార్జిగా ప్రకటించారు. సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అధినేతపై ఒత్తిడి చేయడం వల్లే ఆయన పేరు ప్రకటించి, బలవంతంగా తమ నెత్తిన రుద్దారన్నది హుజూర్‌నగర్ దేశం నేతల బలమైన అభిప్రాయం.
ఇన్‌చార్జిగా నియమితుడయ్యాక కూడా స్వామిగౌడ్ పనితీరు మెరుగు పడలేదని, తమకు అందుబాటులో ఉండడం లేదని, ఏకపక్షంగా మండల అధ్యక్షులను నియమించుకుంటున్నారన్న ఆగ్రహం అక్కడి ద్వితీయశ్రేణి నేతల్లో ఉంది. దీని ప్రభావం సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. నియోజకవర్గంలో గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న పార్టీని అథమ స్థాయికి తీసుకువచ్చారని వీరు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా, స్వామిగౌడ్, అధికార కాంగ్రెస్ పార్టీ నేతతో అంటకాగుతున్నారన్నది ప్రధానమైన ఆరోపణ.
నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో మండలాల వారీగా మెజారిటీ గురించి కూడా ప్రస్తావిస్తున్నారని, తమ పార్టీ నేతలు లోపాయికారిగా ఒప్పందం చేసుకుని సహకరిస్తున్నందు వల్లే అంత ధీమాగా ప్రకటనలు ఇస్తున్నారని, దీనికి తగినట్టే స్వామిగౌడ్ పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఈ అంశాలన్నింటిపైనా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం హైదరాబాద్‌కు పలు వాహనాల్లో తరలి వెళ్లిన నియోజకవర్గ టీడీపీ నాయకులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. ఆయనను ఇన్‌చార్జిగా తొలగించి, కొత్తవారిని నియమించాలని, లేదంటే నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోలేమని మొరపెట్టుకున్నారు.
వైఎస్‌ఆర్ సీపీ గురించి... చర్చ
అధికార పార్టీకి ధీటుగా నిలవాల్సింది పోయి, పార్టీ నేతలు కోవర్టుగా మారడంతో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిందని అధినేతకు ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గురించి బాబు వద్ద చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. అధికార కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధీటుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైందని, ముందు నుంచీ ఉన్న టీడీపీ మాత్రం చతికిల పడేలా తయారైందని వీరు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మండలాల వారీగా, ఇటీవలి సహకార, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు, తెచ్చుకున్న ఓట్లు, తదితరాలపై కూడా వీరు వివరించారని సమాచారం.
ఇక, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తేరా చిన్నపురెడ్డిపైనా ఆ నియోజకవర్గ నాయకులు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తలకు చిన్నపురెడ్డి ఏ మాత్రం అందుబాటులో ఉండడం లేదని, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల ఊసు లేకుండా అయ్యిందని ఆ పార్టీ నాయకుడు కటారి అంజయ్య తేరాపై అధినేతకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో ఫిర్యాదుల ముసలం మొదలైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది.