సాక్షి, గుంటూరు: టీడీపీలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నామంటూ ఆ పార్టీ నేతలు ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధులు, టీడీపీ మహిళా నేతలపై జరుగుతున్న వేధింపుల పర్వం పరిశీలిస్తే అందులో నిజం ఏ కోశానా లేదని అర్థమవుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సొంత పార్టీలోనే మహిళ ప్రజాప్రతినిధుల పట్ల ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు తీవ్ర చులకన భావంతో వ్యవహరిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు తమ చెప్పుచేతల్లో ఉండాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. తమ మాట వినని వారిపై వేధింపులకు దిగుతున్నారు.
వారిని ఏ కార్యక్రమాలకూ ఆహ్వానించవద్దని, ఏ పని చెప్పినా చేయవద్దంటూ నేరుగా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రత్తిపాడు, బాపట్ల, మాచర్ల, తాడికొండ, మంగళగిరి, సత్తెనపల్లి వంటి నియోజకవర్గాల్లో మహిళా ప్రజాప్రతినిధులు తీవ్ర వివక్షతకు గురవుతున్నారు. చివరకు మండల, జిల్లా స్థాయి మహిళా ప్రజాప్రతినిధులు సైతం సొంత పార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మంగళగిరిలో దళిత తేజం పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమంలోనే దళిత మహిళా నేతపై అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నేత దాడికి దిగటం కలకలం రేపిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నేతలపై జరిగిన వేధింపుల పర్వాన్ని పరిశీలిస్తే...
మంగళగిరిలో ఇటీవల టీడీపీ దళిత మహిళా నేత వనరాణిపై ఆ పార్టీ నేత పోలవరపు హరిబాబు దాడిచేసి కొట్టిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత తేజం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలోనే దళిత మహిళా నేతపై దాడికి దిగటం సర్వత్రా కలకలం రేపింది. ఈ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ అధిష్టానం హరిబాబును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకొంది. విశేషమేమంటే.. హరిబాబుకు పార్టీ నుంచి సస్పెండ్ కావడం కొత్తేమీ కాదు. గతంలో సైతం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నగదు వసూలు చేసిన కేసులో ముద్దాయిగా ఉండటంతో అప్పట్లో టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు.
సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం.. విషయం సమసిపోయాక మళ్లీ చేర్చుకోవడం పరిపాటిగా మారింది.lజిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉన్న షేక్ జానీమూన్‌కి సైతం సొంత పార్టీ నేతల వేధింపులు తప్పలేదు. ఆమె సొంత మండలమైన కాకుమానులోనే కనీసం గౌరవం ఇవ్వకుండా అధికారులు సైతం ఆమె మాట వినకుండా అప్పటి మంత్రి రావెల కిషోర్‌బాబు వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఆమె ఇంటిపై దాడులకు సైతం తెగబడడంతో తట్టుకోలేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తనకు మంత్రి రావెలతో ప్రాణహాని ఉందని చెప్పి ఆమె భోరున విలపించిన విషయం తెలిసిందే.
∙గుంటూరు రూరల్ ఎంపీపీ లక్ష్మీకుమారి సైతం ఎమ్మెల్యే రావెల వేధింపులకు తట్టుకోలేక కనీస గౌరవం ఇవ్వటం లేదంటూ నిరాహారదీక్షకు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ పార్టీ జిల్లా నేతలు వారితో చర్చలు జరిపి వివాదం సద్దుమణిగేలా చూశారు. అయితే ఇప్పటికీ ఆమెకు ఎవరూ సహకరించని పరిస్థితి నెలకొంది.
మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గోపవరపు శ్రీదేవిని సైతం పదవిలో ఉండగానే తీవ్ర వేధింపులకు గురిచేయడం, ఆమెను పదవి నుంచి దిగిపోవాలంటూ తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. వారి ఒత్తిళ్లు తట్టుకోలేక శ్రీదేవి భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతిచెందారు. అయినా తీరుమార్చుకోని టీడీపీ నేతలు ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఈ సంఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీదేవి ఆత్మహత్య చేసుకుని మృతిచెందారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు టీడీపీ నేతల దుష్ట రాజకీయాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారాడు.
బాపట్ల ఎంపీపీ మానం విజేత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒత్తిడి, బెదిరింపులు తట్టుకోలేక తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోవాలంటూ నియోజకవర్గ బాధ్యుడు ఆమెపై ఒత్తిడి తేవడం వల్లే ఆమె ప్రాణాల మీదకు వచ్చిందని భర్త, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం అమినాబాద్ సర్పంచ్ బి.గోవిందుభాయి తనకు తెలియకుండా గ్రామ జన్మభూమి కమిటీని మార్చారంటూ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా, ఆయన దూషణలకు దిగారంటూ విలేకరుల సమక్షంలో వాపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో అధికార పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే.. ఇతర పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment