2015 ఆగçస్టు 17న సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించిన ఫైలాన్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు పదే పదే చెబుతున్నా ..వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో మూడేళ్లు గడిచినా ఎలాంటి మౌలిక వసతులు కల్పించడలేదు. పైగా పరిశ్రమల స్థాపన కోసం వచ్చే యాజమాన్యాలపై స్థానిక టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతుండడంతో వచ్చినవి కూడా వెనక్కి పోతున్నాయి. గుజరాత్ అంబుజా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
లక్ష్యమిదీ..
కర్నూలు జల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తానని 2014 ఆగస్టు స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అందులో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు, మిడ్తూరు మండలాల్లోని 13 వేల ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ పార్కు, జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో 833 ఎకరాల్లో అల్ట్రా మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటు బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కు అప్పగించారు. అనుకన్నదే తడువుగా 2015 ఆగస్టు 17వ తేదీన ఓర్వకల్లు సమీపంలో మెగా ఇండస్ట్రీయల్ పార్కుకు, తంగడంచెలో అల్ట్రా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అప్పటికప్పుడు గుజరాత్ అంబుజా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు 200 ఎకరాల భూమిని కేటాయించి ఆరు నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యం నిర్ణయించారు. ఎకరం రూ.5 లక్షల ప్రకారం కొనుగోలుకు కంపెనీ, ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. జిల్లాలో అధిక సంఖ్యలో రైతులు మొక్కజొన్న సాగు చేస్తారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రోత్సహించేందుకు గుజరాత్ అంబుజా కంపెనీ ముందుకు వచ్చింది. తరువాత తంగడంచెలోనే జైన్ ఇరిగేషన్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్‌కు సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
అడ్డంకులు ఇవీ..
తంగడంచెలోని అల్ట్రా మెగా ఫుడ్ పార్కులో మౌలిక వసతుల కల్పన ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ విఫలమైంది. దాదాపు మూడేళ్లు గడిచినా అక్కడ ఒక్క రహదారి వేయలేదు. మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేదు. కరెంట్ వసతిని కల్పించలేదు. రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. అనుసంధాన రహదారుల మాటే ఎత్తడంలేదు. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనపై గుజరాత్ అంబుజా పరిశ్రమ నోరు మొదిపినట్లు చెబుతున్నారు. మౌలిక వసతుల కల్పనపై అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అంతేకాక స్థానికంగా కొందరు టీడీపీ నాయకులు కంపెనీపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ స్థాపించిన అనుకున్న లాభంలేదని యాజమాన్యం భావించింది. అన్నీ వసతులు ఉన్న తెలంగాణలో యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
నాలుగేళ్లు గడిచినా..
ఓర్వకల్లు, మిడ్తూరు మండలాల్లో 13 వేల ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ హబ్‌లో మౌలిక వసతుల కల్పనే పెద్ద సమస్యగా మారింది. నాలుగేళ్లు గడుస్తున్నా మాస్టర్ ప్లాన్ పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క జైరాజ్ ఇస్పాత్ స్టీలు ప్రైవేట్ లిమిటెడ్‌కు మాత్రమే 415 ఎకరాలను కేటాయించారు. తరువాత ఒక్కరూ కూడా పరిశ్రమల నెలకొల్పేందుకు ముందుకు రావడంలేదు.
ప్రభుత్వ వాదన ఇదీ..
గుజరాత్ అంబుజా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. యూనిట్‌కు కేటాయించిన 200 ఎకరాల భూమికి సంబంధించిన డబ్బులను చెల్లించడంలో(ఎకరం రూ.5 లక్షలు) విధించిన గడువు ముగియడంతో వెనక్కి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ కార్యదర్శి సోల్‌మన్ అరోక్య రాజ్ భూముల ఒప్పందాన్ని రద్దుచేస్తూ జీవో నంబర్ 31ని రెండు రోజుల క్రితం విడుదల చేశారు. అయితే కంపెనీ అడిగిన మౌలిక వసతులు, స్థానిక టీడీపీ నాయకుల బెదిరింపులపై మాత్రం మౌనం వహించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment