పదవుల కోసం ఆరాటం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, ఆ పార్టీ నాయకులు పదవుల కోసం అర్రులు జాస్తున్నారు. జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కోరుతుండగా, ఓడిన వారు ఎమ్మెల్సీ పదవి కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో ఏదో విధంగా లబ్ధి పొందాలనే ఆతృతతో తెలుగు తమ్ముళ్లున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుండగా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. పదేళ్లలో తొలిసారిగా ఐదునియోజకవర్గాల్లో విజయం సాధించామని అంటున్నారు.
ముఖ్యంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా పని చేసిన దామచర్ల జనార్దన్, తాను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై భారీ మెజారిటీలో గెలిచానని తనకు మంత్రి పదవి ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు తాను బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడనని, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తనకు లోకేష్ సన్నిహితుడని వారితో సిఫారసు చేయించుకుని మంత్రి పదవి దక్కించుకుంటామని అంటున్నారు. దాదాపు అందరూ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు కావాలని కోరుతుండగా, ఓడిన వారు కూడా తమకు నామినేటెడ్ పదవులో, ఎమ్మెల్సీలనో కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన దివి శివరాం తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోరుకున్నట్లు తెలిసింది. అయితే ఆ పదవిని తిరుపతి టీడీపీ నాయకుడు చదలవాడ కృష్ణమూర్తికి కేటాయించినట్లు, ఆయనకే ఆ పదవిని ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో మాగుంట కినుక వహించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత, తనకు న్యాయం జరగలేదని తన సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పొందిన బీఎన్ విజయకుమార్ కూడా తనకు నామినేటెడ్ పదవి ఇప్పించాలని సుజనా చౌదరి ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రి పదవి ఖరారయినట్లు భావిస్తున్న శిద్దా రాఘవరావు తన సన్నిహితులకు నామినేటెడ్ పదవులు కోరుతున్నట్లు సమాచారం. టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరాం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని, లేనిపక్షంలో తన కుమారుడు కరణం వెంకటేష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు వద్ద గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలిసింది. ఇదేవిధంగా ప్రతీ నాయకుడు తనకు పదవి కావాలని కోరుతున్నారు. సామాన్య కార్యకర్త కూడా తనకు రేషన్ దుకాణం లెసైన్సు ఇప్పించాలని డిమాండు చేస్తున్నట్లు తెలిసింది.