మూడో కుంపటి!
జిల్లా టీడీపీలో మూడో కుంపటి రాజుకుంటోంది. సీఎం చంద్రబాబే ఎమ్మెల్యేల ద్వారా దీనిని రాజేస్తుండటం ఆసక్తికరంగా మారింది. జిల్లా మంత్రులు గంటా, అయ్యన్నలకు చెక్ పెట్టేందుకే చంద్రబాబు ఈ రాజకీయ వ్యూహానికి తెరతీశారు. వారిద్దరూ రాజకీయంగా బలంగా ఉంటే తనకు ఇబ్బందికరంగా మారుతారన్నది ఆయన ఉద్దేశం. అందుకే మంత్రుల వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలను వారి నుంచి దూరం చేసేందుకు ద్విముఖ వ్యూహానికి తెరతీశారు. ఓ వైపు ఎమ్మెల్యేలను నేరుగా తనతో సంబంధాలు పెట్టుకోమని కర్తవ్యబోధ చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా చేయించి న పనులను పట్టించుకోవద్దని అధికారులకు ఆదేశిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మంత్రులు గంటా, అయ్యన్నల వెంట ఉండొద్దు. వారి ద్వారా వస్తేనే పనులు అవుతాయనుకోవద్దు. మీకు ఏదైనా పని కావాలంటే నా వద్దకు రండి’అని సీఎం చంద్రబాబు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు ‘బ్రెయిన్‌వాష్’ చేసినట్లు తెలిసింది. మొదటగా మంత్రి గంటా వెన్నంటి ఓ ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం ఆయనకు కంటగింపుగా మారింది. దాంతో గంటా వర్గంలోని ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. మంత్రి అయ్యన్నకు వ్యతిరేకంగా ఉంటే ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తికి మంత్రి పదవి ఇప్పిస్తామని గంటా హామీ ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉంది. అందుకే మొదట ఎమ్మెల్యే బండారుతోనే చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది.
గంటా వెన్నంటి ఉంటే మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెట్టుకోవద్దని ఆయనతో తేల్చిచెప్పేశారు. ఎమ్మెల్యేలు గణబాబు, పీలా గోవింద్, అనితలకు కూడా అదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. అయ్యన్న వర్గంగా ఉంటున్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతోపాటు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. తాను చెప్పింది పాటిస్తే ‘ఊహించని’ అవకాశాలు వస్తాయనే ఆశను కూడా కలిగించారు. తాను బిజీగా ఉంటే కేంద్రమంత్రి సుజనా చౌదరిని సంప్రదించాలని కూడా సూచించారు. అదే విధంగా ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా సిఫార్సు చేయించే పనులను చేయొద్దని కూడా అధికార యంత్రాంగానికి సీఎం కార్యాలయం నుంచి మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. అలా చేస్తేనే ఎమ్మెల్యేలు మంత్రుల వర్గం నుంచి బయటకు వస్తారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
సొంత బాటపట్టిన ఎమ్మెల్యేలు
చంద్రబాబు పాచిక పారినట్లే కనిపిస్తోంది. బండారు మంత్రి గంటాకు దూరంగా జరుగుతున్నారు. పీల గోవింద్, అనిత కూడా సొంతంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో కూడా పరిస్థితిలో మార్పు వస్తోంది. వెలగపూడి ప్రస్తుతానికి గుంభనంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే గణబాబు పూర్తిగా సొంత పంథాలోకి వచ్చేశారు. ఫ్లెక్లీల్లో కూడా ఇద్దరు మంత్రుల ఫొటోలు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మరో అడుగు ముందుకు వేశారు. తన సామాజికవర్గ సమీకరణను అవకాశంగా మలచుకుని సొంత గుర్తింపు కోసం పావులు కదుపుతున్నారు.
ఈ విధంగా మంత్రులు గంటా, అయ్యన్నల నీడ నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఓ వర్గంగా రూపాంతరం చెందుతున్నారు. క్రమంగా ఈ వర్గం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై మంత్రులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతానికి బయటపడకుండా ఓ కంట కనిపెడుతున్నారు. మనుముందు రాజకీయాలు మరింత రంజుగా మారడం ఖాయమని టీడీపీవర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.