* ఐక్యవేదికగా ఏర్పడితే సమస్యలు పరిష్కారమవుతాయూ అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే శివాజీ
* వంతపాడిన ప్రభుత్వ విప్ కూనరవికుమార్
* ఐక్యవేదిక సభ్యులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసిన వైనం
* నివ్వెరబోయిన సభ్యులు
* నేతల తీరుపై ఆందోళన
చిన్నకర్రివానిపాలెం(కవిటి): మత్స్యకార ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది... దాని వయసు ఎంత... వారు చెబితేనే పనులు చేస్తున్నామా.. 1983లో ఎన్టీఆర్ గద్దెనెక్కినప్పుడు ఈ మత్స్యకార ఐక్యవేదిక ఉందా? ఈ ఐక్యవేదిక కోరితేనే అప్పుడు ఈ నియోజకవర్గంలో మత్స్యకారులకు కరెంట్,రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించారా?, సభలో దివంగత నేత ఎన్టీఆర్ చిత్రప టం కూడా ఏర్పాటుచేయకపోవడం ఏమిటంటూ మత్స్యకార ఐక్యవేదిక సభ్యులపై ఎమ్మెల్యే శివాజీ మాటల తూటాలు పేల్చారు. ఆగ్రహం, అసహనంతో ఊగిపోయూరు.
ప్రపంచమత్స్యకార దినోత్సవంలో భా గంగా మండలంలోని చిన్నకర్రివానిపాలెంలో మత్స్యకారుల సభ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ ఐక్యవేదిక ఏర్పాటే ఒక అనిర్వచనీయమైనదిగా పేర్కొన్నారు. సోంపేట థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఏర్పడిన మత్స్యకార ఐక్యవేదికకు వయసెంతంటూ నిలదీశారు. అనంతరం మాట్లాడిన ప్రభుత్వ చీఫ్‌విప్ కూన రవికుమార్ సైతం శివాజీ బాటలోనే తన ప్రసంగం కొనసాగించడంతో మత్స్యకార నేతల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. సముద్రపు ఇసుక తరలించడం వల్ల అనర్ధాలు తలెత్తుతాయన్నది ఎక్కడా చదవలేదన్నారు.
ఇసుకమైనింగ్‌లో కేవలం 16 శాతం ముడిఖనిజాలు సేకరించిన తర్వాత మిగిలిన 84 శాతం ఇసుకను మళ్లీ ఎక్కడ సేకరించారో అక్కడే సంస్థ విడిచిపెడుతుందంటూ సెలవిచ్చారు. ముందుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అనంతరం మత్స్యకార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మడ్డు రాజారావు మాట్లాడుతూ తరతరాలుగా సముద్రమే ఆధారంగా బతుకుతున్న మత్స్యకారులకు సముద్రంపై హక్కును కల్పించకపోవడం విచారకరమన్నారు. తీరంపై మత్స్యకారుల హక్కులను హరిస్తూ, ఇసుకను అమ్మేస్తూ మత్స్యకారుల బతుకుల్లో చిచ్చురేపుతున్న పరిశ్రమలను రద్దుచేసి రక్షణ కల్పించాలని కోరారు.
సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యే డాక్టర్ బి.అశోక్‌లు మాట్లాడుతూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వానికి నివేదికలు పంపించామని వెల్లడించారు. ఈ సమావేశంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎకువూరుకు చెందిన శాస్త్రవేత్త గంటా వెంకటరావు స్వీయరచనలో రూపుదిద్దుకున్న ‘ఫిషర్‌మెన్ లైవ్‌లీ హుడ్’ అనే పుస్తకాన్ని నేతలు, అధికారులు ఆవిష్కరించారు. సభకు ముందు మత్స్యకార యువకులు చేసిన సాంప్రదాయ నృత్యం చూపరులను అలరించింది.
ఈ సమావేశంలో కవిటి, సోంపేట జెడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్, సూరాడ చంద్రమోహన్, ఎంపీపీలు బెందాళం కిరణకుమారి, చిత్రాడ శ్రీనివాసరావు, కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్ర, బి.ప్రకాష్, సర్పంచ్ గంతి దాశరథి, కర్రి పండయ్య, మాదా సోమయ్య, ఫిషరీస్ డెప్యూటీ డెరైక్టర్ యూకూబ్ బాషా, మత్స్యకార ఐక్యవేదిక సభ్యులు గంతి శ్రీను, మాదా సోమయ్య, కర్రి పండయ్య, వాసుపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకార ఐక్యవేదికపై టీడీపీ నేతల మాటల తూటాలు
Published Sat, Nov 22 2014 4:31 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement