తాడికొండ: స్థానిక తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అవినీతి భారీగా చేసి జేబులు నింపుకున్నారంటూ మహిళా ఎంపీపీ విలేఖరుల సాక్షిగా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు ఔరా అనిపిస్తున్నాయి. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం వేదికగా ఎంపీపీ రిజ్వానా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ తాడికొండ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమ వసూళ్లు,
అవినీతి దందాలో గ్రామ నాయకుడు యెడ్డూరి హనుమంతరావుకు భారీగా ముడుపులు అందుతున్నాయని, సర్పంచ్‌ను అడ్డు పెట్టి దోచుకుంటున్నారని గ్రామ పార్టీ అధ్యక్షుడు కంతేటి నాగేశ్వరరావు వ్యాఖ్యానించాడని, ఆ వ్యాఖ్యలకు ప్రత్యక్ష సాక్షిని తానేనని గ్రామ ఉప సర్పంచ్ ఉమ్మనేని రామ్మెహనరావు అన్నారు. ఎంపీపీ రిజ్వానా మాట్లాడుతూ దోపిడీదారులే అవినీతి గురించి మాట్లాడడం డ్రామా కంపెనీ నడిపినట్లు ఉందన్నారు. ముస్లిం శ్మశాన వాటిక వివాదంలో తన పాత్ర ఉందని తప్పుడు వ్యాఖ్యలు చేశారని, నిరూపిస్తే ఏ సవాల్‌కైనా సిద్ధమేనని రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి బండ్ల కోటేశ్వరరావు అన్నారు. అవినీతికి అడ్డుపడుతున్నామనే ఈ వ్యాఖ్యలకు దిగారన్నారు.
పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ విషయంలో అక్రమంగా రూ.6 లక్షలు వసూలు చేశారని, నిబంధనలు ఉల్లంఘించినందుకు ఉన్నతాధికారులు బిల్లులు నిలిపేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో అక్రమంగా మట్టిని తవ్వి సర్పంచ్‌తోపాటు షాడో సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న యెడ్డూరి హనుమంతరావు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీసీ సెల్ నాయకుడిని ఎన్టీఆర్ విగ్రహానికి దండ వేయకుండా అడ్డుకొని ఆవేదనకు గురి చేశారని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బండ్ల కోటేశ్వరరావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పందేటి వెంకటేశ్వర్లు, భూస్మాన్ గోపి, ఉండవల్లి రాజేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment