కాకినాడ టీడీపీలో 'డిప్యూటీ' చిచ్చు
► అలకవహించిన మత్స్యకార వర్గాలు
► ఎమ్మెల్యే తీరుపై పార్టీలో అసహనం
కాకినాడ: కాకినాడ సిటీ నియోజకవర్గంలో కీలక ఓటర్లుగా ఉన్న మత్స్యకార వర్గాలను పార్టీ నేతలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ మండిపడుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మత్స్యకార వర్గాలైన వాడబలిజ అగ్నికుల క్షత్రియులకు 12 మందికి కార్పొరేటర్ సీట్లు కేటాయించగా 11 మంది విజయం సాధిస్తే కనీసం గుర్తింపు కూడా లేకపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు. 48 డివిజన్లకు గాను కాకినాడలో 43, రూరల్‌లో 5 డివిజన్లు ఉండగా, మెజార్టీ వర్గాన్ని ఎలా విస్మరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తాను ప్రాతినిధ్యం వహించే మత్స్యకార వర్గానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. రెండుమూడు రోజుల్లో మత్స్యకార కార్పొరేటర్లు, ముఖ్య నేతలు సమావేశమై తమ అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించే అవకాశం ఉందని ఆ వర్గానికి చెందిన కొందరు కార్పొటరేటర్లు చెబుతున్నారు.
ఎమ్మెల్యేపై అసహనం
ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుపై మత్స్యకార వర్గాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాను ప్రతిపాదించిన అభ్యర్థికి మేయర్ స్థానాన్ని దక్కించుకోలేకపోయిన కొండబాబు కనీసం సొంత సామాజికవర్గానికి డెప్యూటీ మేయర్‌ను కూడా ఇప్పించలేకపోయారంటూ మండిపడుతున్నారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన అన్న కుమారుడు వనమాడి ఉమాశంకర్‌తోపాటు సీనియర్ కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్, మల్లాడి గంగాధర్, చవ్వాకుల రాంబాబు ప్రధానంగా డిప్యూటీ మేయర్‌ను ఆశించారు. వాస్తవానికి మత్స్యకారుల్లో అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన వనమాడి ఉమాశంకర్ పేరు ప్రతిపాదనకు రాగా మరో వర్గమైన వాడబలిజలు తమకే ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో చోడిపల్లి, చవ్వాకుల రాంబాబు పేర్లు ప్రతిపాదనలకు వచ్చాయి. అయితే చివరి నిముషంలో వీరెవ్వరినీ కాదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థి డిప్యూటీ మేయర్ పోస్టును దక్కించుకున్నారంటూ గగ్గోలుపెడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గతంగా చిచ్చురేపుతోంది. మత్స్యకార వర్గాల ప్రాధాన్యతను ఎమ్మెల్యే వనమాడి పార్టీ ముఖ్యనేతల ఎదుట చెప్పడంలో విఫలమయ్యారని, అందువల్లే తమకు అన్యాయం జరిగిందంటూ వాపోతున్నారు. సొంత సామాజికవర్గం నుంచే తీవ్ర నిరసన వ్యక్తమవుతుండడంతో ఎమ్మెల్యేకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.
కాకినాడ టీడీపీలో డెప్యూటీ మేయర్ పదవి చిచ్చు రేపుతోంది. మేయర్ ఓసీ మహిళకు కేటాయించిన నేపథ్యంలో, డిప్యూటీ మేయర్ పదవిని మత్స్యకార వర్గానికి కేటాయిస్తారని ఆశించారు. అయితే పరిస్థితులు తారుమారై ఆ పదవిని కాకినాడ రూరల్ నియోజకవర్గానికి కేటాయించడంతో మత్స్యకార వర్గాలు పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.