యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ | Tdp Leaders Mining In Blackpond | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌

Published Tue, Apr 17 2018 8:30 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Tdp Leaders Mining In Blackpond - Sakshi

గోరంట్లలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన నల్లచెరువు

ప్రభుత్వం మాది, ప్రభుత్వ స్థలాలు కూడా మావే అన్నట్లుంది గుంటూరు రూరల్‌ మండలంలో అధికార పార్టీ నేతల పరిస్థితి. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయటమో లేక ఏదోక విధంగా తవ్వుకుని సొమ్ము చేసుకోవటమో లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాదాయానికి గండికొట్టి కోట్ల రూపాయలు తమ జేబుల్లో నింపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే...

గుంటూరు రూరల్‌: మండలం గోరంట్ల గ్రామంలో సర్వేనంబర్‌ 196/1లో 41.52 ఎకరాల నల్లచెరువు (రాళ్ళకుంట)ను అధికార పార్టీకి చెందిన నేతలు ఓ సంస్థకు చెందిన డైరెక్టర్, టీడీపీ మండలస్థాయి నేతలు, ఓ ప్రజాప్రతినిధి అక్రమంగా రాత్రి సమయాల్లో తవ్వకాలు సాగించి ప్రభుత్వ భూమిలో మట్టిని అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. సుమారు నెల రోజులుగా రాత్రి సమయాల్లో తవ్వకాలు చేస్తూ రోజుకు వందల సంఖ్యలో లారీలతో మట్టిని తరలించారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. లారీ మట్టిని రూ.3000 నుంచి రూ4000 వరకూ విక్రయించి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో నింపుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నామినేటెడ్‌ పదవిలో ఉన్న వ్యక్తులే ఈ అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న ప్రదేశానికి వెళ్ళి కూడా చూసీచూడనట్లు వెళ్ళారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సొత్తును, ప్ర«జాధనాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ అక్రమాలకు వత్తాసుపలుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్లచెరువులో సుమారు 20 ఎకరాలకు పైగా ఎటువంటి బిల్లులు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా సుమారు 6 అడుగుల లోతు వరకూ తవ్వి కోట్లాదిరూపాయల విలువ చేసే మట్టిని తరలించారు.

దేవాలయ భూమి స్వాహా
గోరంట్ల గ్రామ శివారుల్లోని రవినగర్‌నందున్న సర్వే నంబర్‌ 508, 513, 514, 515లలో ఉన్న 1000 గజాల స్థలంలో విఘ్నేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం శిధిలావస్తకు చేరటంతో పూజాదికార్యక్రమాలు నిర్వహించటంలేదు. దీంతో ఇదే అదనుగా భావించిన స్థానిక అధికారపార్టీ నేతలు రాత్రికి రాత్రి పొక్లెయిన్‌లతో వెయ్యి గజాల స్థలంను సుమారు 6 అడుగుల లోతు వరకూ తవ్వి సొమ్ముచేసుకున్నారు. దేవాలయానికి చెందిన భూమిని తవ్వుకుని జేబులు నింపుకున్నా కనీసం ఏ అధికారి పట్టించుకోలేదని స్థానిక ప్రజలు వాపోయారు. గోరంట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సర్వేనంబర్‌ 456, 457, 458, 55 స్మశానం ఉంది. ఈ శ్మశానం సైతం తవ్వుకుని మట్టిని విక్రయించి సొమ్ము చేసుకున్నారని స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ప్రభుత్వ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ తవ్వుకుని సొమ్ము చేసుకోవటమే విధిగా స్థానిక టీడీపీ నేతలు పనిచేస్తున్నారని వారి ఆగడాలకు హద్దేలేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామంలోని టీడీపీ నేతల అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ భూములను ప్రజాధనాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement