తాడేపల్లిగూడెంలోని ఓ వార్డులో డ్వాక్రా మహిళల వివరాలు నమోదు చేసుకుంటున్న దృశ్యం
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): పసుపు–కుంకుమ పేరుతో టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ తాడేపల్లిగూడెం పట్టణంలో చురుగ్గా సాగుతోంది. టీడీపీ సభ్యత్వ నమోదు అంటే డ్వాక్రా మహిళలు స్పందించరనే ఉద్దేశంతో పసుపు–కుంకుమ పేరుతో ఎరవేసినట్టు తెలుస్తోంది. డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేస్తున్న తంతు పట్టణంలోని అన్ని వార్డుల్లో కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ అంటూ మహిళలను మోసగించి అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో మూడు విడతలుగా రూ.10 వేలు మాత్రమే అందించారు. మరలా సాధారణ ఎన్నికల రానుండటంతో డ్వాక్రా మహిళలను మభ్యపెట్టేందుకు మరో రూ.10 వేలు, సెల్‌ఫోన్ ఇస్తామంటూ మాయోపాయానికి తెరదీశారు. దీంతో డ్వాక్రా మహిళలు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులతో వార్డుల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో పేర్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు.
ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. నమోదు చేస్తున్న నిర్వాహకులు ఆన్‌లైన్ పద్ధతి కాకుండా స్లిప్ ఇచ్చే పద్ధతిని అవలంబిస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. 10 మంది గ్రూపునకు రూ.1,000 వసూలు చేస్తున్నారు. రూ.100 చెల్లించిన వారికి పసుపు రంగు స్లిప్ (సభ్యత్వ నమోదు రసీదు) ఇస్తున్నారు. పసుపు–కుంకుమలో భాగంగా రూ.10 వేలు, సెల్‌ఫోన్ వస్తుందనే ఉద్దేశంతో రూ.100 చెల్లించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. అయితే ఈ వ్యవహారం జరిగే ప్రాంతాల్లో టీడీపీ వార్డు ప్రతినిధులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment