వైఎస్సార్‌సీపీ నేత హత్యకు కుట్ర? | TDP Leaders Murder Sketch On YSRCP Leader Anantapur | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత హత్యకు కుట్ర?

Published Thu, Nov 1 2018 1:03 PM | Last Updated on Thu, Nov 1 2018 1:03 PM

TDP Leaders Murder Sketch On YSRCP Leader Anantapur - Sakshi

అనంతపురం సెంట్రల్‌: కనగానపల్లి మండలం సింగిల్‌ విండో మాజీ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముత్యాలు అలియాస్‌ పైలెట్‌ ముత్యాలు హత్య కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజ్ఞాత వ్యక్తి అప్రమత్తం చేయడంతో ముప్పు తప్పింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాప్తాడు నియోజకవర్గంలో అలజడి సృష్టిం చేందుకు మంత్రి పరిటాల వర్గం హత్యా రాజకీయాలకు తెరలేపుతోందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడి హత్యకు కుట్ర జరిగినవిషయం కలకలం రేపుతోంది. కనగానపల్లి మండలం సింగిల్‌విండో మాజీ ఉపాధ్యక్షుడు, కోనాపురం గ్రామానికి చెందిన ముత్యాలు హత్యకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి దుండగులను ఉసిగొల్పారు. దీని వెనుక మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, ఆమె సోదరుడు బాలాజీతో పాటు టీడీపీ నాయకులు రవీంద్ర, లవకుమార్‌లు ఉన్నట్లు ముత్యాలు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామంలో రెండు వారాల క్రితం టీడీపీ నాయకుని కుమార్తె అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుని కుమారునితో వెళ్లిపోయింది. ఇతర ప్రాంతాలకు వెళ్లి రిజిష్టర్‌ వివాహం చేసుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. పరువు హత్య చేయడానికి పథకం రచించారు. రెండు వారాల నుంచి గాలిస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి సునీత సోదరుడు బాలాజీని ఆశ్రయించినట్లు సమాచారం. సదరు ప్రేమజంటకు వైఎస్సార్‌సీపీ నాయకుడు ముత్యాలు ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానించారు. దీంతో తొలుత ముత్యాలను హత్య చేస్తే వారే బయటకు వస్తారని భావించి అదే మండలానికి చెందిన పాత నేరస్తుడు, టీడీపీ నాయకునికి రూ.10 లక్షలు సుపారీ ఇచ్చినట్లు ముత్యాలుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అప్రమత్తం చేసిన అజ్ఞాత వ్యక్తి
హత్యకు జరుగుతున్న కుట్రను ఓ అజ్ఞాత వ్యక్తి ముత్యాలుకు చేరవేశాడు. నిన్ను హత్య చేయాలనే కుట్ర జరుగుతోందని, బయటకు రావద్దని సూచించాడు. మరికొంత సమాచారం కూడా బాధితునికి చేరవేశాడు. అయితే సదరు అజ్ఞాత వ్యక్తి చెప్పిన విధంగానే ఈ నెల 27న కొంతమంది మారణాయుధాలతో పోలీసులకు పట్టుపబడినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు అనంతపురం పోలీసులే నిందితులను కస్టడీలో ఉంచుకొని విచారించినట్లు సమాచారం. అనంతరం కేసు బయటకు పొక్కకుండా ధర్మవరం పోలీసులకు అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. కేసును తప్పుదోవ పట్టించడానికి నేరుగా ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పోలీసులు ఈ హత్య కుట్ర సమాచారాన్ని బయటకు చెప్పడం లేదని సమాచారం.

రక్షణ కల్పించండి
నా హత్యకు కుట్ర జరిగింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్, బాలాజీ, టీడీపీ నాయకులు రవీంద్ర, లవకుమార్‌లు ఉన్నట్లు తెలిసింది. నాకు సంబంధం లేని కేసులోకి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా. కుట్ర ఉదంతాన్ని వివరించడంతో పాటు రక్షణ కల్పించాలని మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించా.
– ముత్యాలు, వైఎస్సార్‌సీపీ నాయకుడు, కోనాపురం, కనగానపల్లి మండలం

నేను సెలవులో ఉన్నా
హత్యకు కుట్రపై నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను సెలవులో ఉన్నా. దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు కానీ, అనంతపురం నుంచి ఇక్కడికి తరలించినట్లు కానీ తెలియదు.
– వెంకటరమణ, డీఎస్పీ, ధర్మవరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement