బాబు విధానాలపై ‘దేశం’నాయకుల్లో వ్యతిరేకత
Published Thu, Sep 26 2013 2:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన కొంతకాలంగా అనుస రిస్తున్న విధానాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయనే భావనలో నాయకులు ఉన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయం వారిని వెన్నాడుతోంది. చెబితే వినడు...తెలుసుకోడని సీనియర్లు మధనపడుతున్నారు. ప్రధానంగా మూడు విషయాల్లో అధినేత అనుసరించిన విధానాలు పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు, బీజేపీతో పొత్తుకు య త్నిస్తున్నారనే భావన అందరిలో కలిగే విధంగా వ్యవహరించడం, విభజనపై రెండు కళ్ల విధానం అంటూ సీమాంధ్ర అంతా పర్యటిస్తానని చెప్పి రెండు జిల్లాలతో ఆత్మగౌరవ యాత్ర సరిపెట్టుకోవడంతో పార్టీపై విశ్వసనీయత లేకుండా పోతుందనే భావనకు వస్తున్నారు. సొంత పార్టీ పటిష్టత కంటే ఇతర పార్టీలపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం వల్ల ‘బాబు’ నిజాలు చెప్పినా ప్రజలు నమ్మె స్థితిని దాటిపోయారని నేతలంటున్నారు.
పరువు గంగపాలు...
వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చే స్థితిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ బాబు రాసిన లేఖలో ‘జగన్ కేసుల గురించి చెప్పేందుకని’ పేర్కొన్న అంశం బయటకు రావడంతో అధినేత పరువు గంగలో కలిసిందంటున్నారు. జగన్ బెయిల్ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాన్ని ప్రభావితం చేసేలా రాష్ట్రపతిని కలవడం అనేక విమర్శలకు దారితీసింది. జగన్‌కు బెయిల్ రాకుండా గతంలో బాబు అనేక ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఈ పర్యటన కారణంగా నిజమనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం సీమాంధ్రలో పరిస్థితిని వివరించేందుకు ఢిల్లీ వెళ్లానని పేర్కొన్న బాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్టు వెల్లడైంది.
గతంలో బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించిన బాబు, భవిష్యత్‌లో ఆ పార్టీతో పొత్తు ఉండదని కచ్చితంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా ఆలోచన చేస్తుండటంతో నాయకులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయనే అభిప్రాయ సేకరణలో కొందరు ముఖ్యనేతలున్నారు. ఇది తెలిసిన టీడీపీ నాయకులు బాబు వైఖరి అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
రెండు జిల్లాలతో ఆత్మగౌరవ యాత్ర సరి..
పులిని చూసి...నక్క వాతపెట్టుకున్నట్టు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బస్‌యాత్ర ప్రారంభిస్తే, బాబు కూడా తెలుగు ఆత్మగౌరవ యాత్ర అంటూ సీమాంధ్రలో పర్యటిస్తానని ప్రకటించారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై పూర్తి వ్యతి రేకతతో ఉన్న సీమాంధ్రులు బాబు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మకపోవడంతో గుంటూరు. కృష్ణా జిల్లాల్లో యాత్ర పేలవంగా సాగింది. దీంతో ఆత్మగౌరవ యాత్ర పేరును బాబు ప్రస్తావించడం లేదు. బాబు విధానాలతో తల బొప్పికట్టిన నేతలు ‘ఆయన అంతే ఇక మారరు’ అంటూ మధనపడుతున్నారు.
Advertisement