టీడీపీ నేతలే సామాజిక కార్యకర్తలా? | TDP leaders or social workers? | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలే సామాజిక కార్యకర్తలా?

Published Sun, Dec 7 2014 1:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

టీడీపీ నేతలే సామాజిక కార్యకర్తలా? - Sakshi

టీడీపీ నేతలే సామాజిక కార్యకర్తలా?

కైకలూరు మండల ఎస్సీ
రుణ మంజూరు కమిటీలపై ప్రజాగ్రహం
అధికారులను నిలదీసిన బీజేపీ, బీఎస్పీ నాయకులు
నిరసన తెలిపి వెళ్లిపోయిన ఎంపీపీ

 
కైకలూరు : ‘సామాజిక కార్యకర్తలంటే టీడీపీ నాయకులా? ఏం అర్హత ఉందని వారిని కమిటీ సభ్యులుగా తీసుకున్నారు? సామాజిక కార్యకర్తలైతే గుర్తింపు కార్డులు చూపండి?’ అంటూ బీజేపీ, బీఎస్పీ నాయకులు అధికారులను నిల దీశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎస్సీ రుణ మంజూరు మండల కమిటీల్లో సామాజిక కార్యకర్తలుగా టీడీపీ నాయకులనే నియమించారు. ఈ నేపథ్యంలో కైకలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ రుణాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఎస్సీ రుణ మంజూరు మండల కమిటీ సభ్యులు శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి రమేష్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్తలంటే టీడీపీ నాయకులా అని ప్రశ్నించారు. ఏం అర్హత ఉందని వారిని కమిటీ సభ్యులుగా తీసుకున్నారని నిలదీశారు. సామాజిక కార్యకర్తలైతే గుర్తింపు కార్డులు చూపండంటూ టీడీపీ నాయకులను డిమాండ్ చేశారు. అయితే టీడీపీ నాయకులు సమాధానం చెప్పలేకపోయారు. టీడీపీ నాయకులు కమిటీల్లో ఉండటం వల్ల ఆ పార్టీ కార్యకర్తలకే రుణాలు మంజూరవుతాయనే అపనమ్మకం కలుగుతోందన్నారు. ఎంపీడీవో నిమ్మగడ్డ బాలాజీ మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. కమిటీల విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటూ నాయకులు వెనుతిరిగారు.
 
గౌరవం లేదంటూ వెళ్లిపోయిన ఎంపీపీ

రుణాల మంజూరు కమిటీల్లో ఎంపీపీకి గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఎంపీపీ బండి సత్యవతి ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో ఎంపీపీ భర్త శ్రీనివాసరావు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కమిటీలో ఎస్సీ సామాజిక వర్గం వారికి ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులను కమిటీ సభ్యులుగా తీసుకోపోవడం వారిని అగౌరపర్చినట్లేనని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన ఎంపీపీ బండి సత్యవతి ఆలపాడు ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచి పన్నాస లక్ష్మీకుమారి ఆమెపై పోటీ చేసి ఓటమి చెందారు. రుణ మంజూరు కమిటీలో లక్ష్మీకుమారిని సభ్యురాలిగా నియమించడంతో వివాదం మరింత ముదిరింది. అయితే నాయకులు వెళ్లిపోయిన తరువాత కమిటీ సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement