తాండవ నదిలో పొక్లైనర్‌తో చేపట్టిన ఇసుక అక్రమ తవ్వకాలపై రైతులిచ్చిన ఫిర్యాదు మేరకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వెళ్లి అడ్డుకోగా స్థానిక టీడీపీ నేతలు ప్రోత్సహించి కేసులు పెట్టించారు. దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదు చేయించారు. అక్రమాన్ని అడ్డుకున్నందుకు తప్పుడు కేసు పెట్టించారు. దీనిపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా న్యాయస్థానానికి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
పెదపూడి మండలం చాపరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు చింపేశారని ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేస్తే అటువైపు (టీడీపీ నాయకుల) నుంచి కూడా ఫిర్యాదు తీసుకుని ఇటు వైపు వారిని కూడా అరెస్టు చేసిన ఘటన చోటుచేసుకుంది.
కాకినాడలోని తారకరామనగర్‌లో ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు బలవంతంగా పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చేస్తుంటే బాధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి, వెనక్కి తగ్గాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
పెదపూడి మండలం శహపురం గ్రామంలో 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని టీడీపీ నాయకులు ర్యాలీ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న వైఎస్సార్‌పార్టీ నాయకుల మోటార్ బైక్‌లను ధ్వంసం చేశారు. దీనిపై అధికార టీడీపీ నాయకులు బైక్‌లు పాడైన వైఎస్సార్ పార్టీ నాయకులపైనే అక్రమంగా కేసులు బనాయించి అరెస్టులు చేశారు.
కాపు ఐక్య గర్జన దాడి ఘటనలో సంబంధంలేని ఎస్సీ, బీసీలు, ఇతర కులాల నాయకులపై బలవంతంగా కేసులు పెట్టారు. వీరంతా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో అరెస్టులను తప్పించుకున్నా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోటనందూరు మండలం భీమవరపుకోట సర్పంచి జిగటాల వీరబాబు (వికలాంగుడు, ఎస్సీ)పై కేసు పెట్టారు. కోటనందూరు మాజీ జెడ్పీటీసీ పెదపాటి అమ్మాజీ (ఎస్సీ) అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారన్న వాదనలు ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా కేసులుండవు. ఒకవేళ పెట్టినా బెయిలబుల్ కేసులతో సరిపెట్టేస్తున్నారు. పోలీసులు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినా ఫర్వాలేదు గానీ టీడీపీ నాయకులపై మాత్రం ఈగ వాలకూడదన్నట్టుగా అధికారులు కాపాడుతూ వారి అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తున్నారు. తటస్థులు, ప్రతిపక్ష నేతలపై మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా నాన్ బెయిల్‌బుల్ కేసులు బనాయించి, అరెస్టులు చేసేవరకు వదలడం లేదు. ఇప్పుడిది జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా నడుస్తున్న రెండు విధ్వంస ఘటనలే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
ధ్వంసం ఘటనపై కేసులేవీ..?
ప్రభుత్వ నిధులతో వేసిన రహదారిని ధ్వంసం చేసిన కేసును గాలికొదిలేశారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని కలెక్టర్ చేసిన ప్రకటన ఉత్తిదేనని తేలిపోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు అధికార యంత్రాంగం దాసోహమైపోయిందని స్పష్టమైంది. కాకినాడ మహలక్ష్మీనగర్‌లో రహదారి ధ్వంసం చేసిన వివాదం నెల రోజులు దాటుతున్నా చర్యల్లేవు.
ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) సోదరుడు సత్యనారాయణ, కార్పొరేటర్ వనమాడి ఉమాశంకర్‌తోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలు రహదారిని ధ్వంసం చేశారు. రహదారి వేసిన ప్రాంతమంతా తమదని రౌడీయిజం చేసి, పొక్లెన్ల సాయంతో విధ్వంసం సృష్టించారు.
ఈ వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమవడంతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పథక రచన చేశారు. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని, సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ట్రైనీ కలెక్టర్‌తో విచారణ చేపడుతున్నామని, నిందితులెవరైనా విడిచిపెట్టేది లేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా లీకులు ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతకుముందు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ, సోదరుడు కుమారుడు ఉమాశంకర్ సహా ఏడుగురిపై హడావుడిగా కేసు నమోదు చేసి, బెయిలబుల్ సెక్షన్ నమోదు చేసి ‘మమ’ అనిపించేశారు. దీనికంతటికీ టీడీపీ పాలక పెద్దల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది.
వెలుగుబంటి విధ్వంసంపైనా...
కడియం మండలం వేమగిరిలో ప్రభుత్వానికి చెందిన కంకర గుట్టను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరుడు వెలుగుబంటి వెంకటాచలం అక్రమంగా తవ్వేశారు. సుమారు 80 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా తవ్వేశారు. తవ్వకాలకు అడ్డొచ్చిన విద్యుత్తు స్తంభాలను కూల్చేశారు. అక్కడున్న ఇళ్లకు రక్షణగా నిలిచిన గోడను తొలిచేశారు. ఇళ్లకు ముప్పు వాటిల్లే విధంగా తవ్వకాలు జరిపేశారు. ఫలితంగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా తనకు అడ్డొచ్చిన మహిళపై అనుచితంగా వ్యవహరించారు. వీటిన్నింటిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.8.61 కోట్లమేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు గుర్తించారు.
ఆమేరకు రికవరీ నోటీసులు కూడా ఇచ్చారు. కానీ అరెస్టులు జరగలేదు. రికవరీ నోటీసుల వివరణ గడువు పూర్తయి వారాలు గడుస్తున్నా అధికారుల్లో చలనం లేదు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైనా అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనిపై ఇప్పుడు దళిత సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. తవ్వకాలు జరిపిన ప్రదేశంలో నిరసన దీక్షలు కూడా చేస్తున్నారు. ఇలా చెప్పుకుపోతే జిల్లాలో అనేకం ఉన్నాయి. కానీ చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నేతలు ఏం చేసినా ఫర్వాలేదన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment