మా విధేయుడే అధికారిగా రావాలి..
- కాకినాడ డీఎస్పీ పోస్టుపై
- టీడీపీ ఎమ్మెల్యేల పరస్పర పంతం
- ఒక్కో వర్గానికీ ఒక్కో మంత్రి వత్తాసు
- రాష్ట్రంలో రెండు విడతల బదిలీల్లో భర్తీకాని స్థానం
- నేతలు వెనక్కి తగ్గకపోతే విషయం సీఎం ముందుకే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : విధ్యుక్తధర్మ నిర్వహణలో ఎలా ఉన్నా.. తమకు విధేయంగా పని చేసే పోలీస్ అధికారి ఉంటే తిమ్మిని బమ్మిని చేయవచ్చు. తప్పులు చేసే తమ వారిని కాపాడుకోవచ్చు. ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఓ అస్త్రంగా ప్రయోగించొచ్చు. కానివారిపై ఇష్టారీతిన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టొచ్చు. ఇప్పుడలా చెప్పుచేతల్లో ఉండే పోలీసు అధికారిని కాకినాడ డీఎస్పీగా తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలు తెగపాట్లు పడుతున్నారు. అయితే.. ఇందులోనూ అంతర్గత పోరుకు తలపడుతున్న ఆ పార్టీ నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు తమకు కావలసిన అధికారినే ఆ స్థానంలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఒక్కో వర్గానికి ఒక్కో మంత్రి వత్తాసు పలుకుతున్నారు.
కాకినాడ డీఎస్పీగా పనిచేసిన ఎస్.వెంకటేశ్వరరావు ఇక్కడ సుదీర్ఘ కాలం పనిచేయడంతో బదిలీ తప్పనిసరైంది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన బదిలీల్లో ఆయనకు కొవ్వూరు బదిలీ కాగా ఆ స్థానంలో ఇంకా ఎవర్నీ నియమించలేదు. దీనికి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే కారణం. కాకినాడ డీఎస్పీగా తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకునేందుకు ఒక మంత్రి అండతో జిల్లా కేంద్రానికి సమీప నియోజకవర్గ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, తనకు అనుకూల అధికారిని తీసుకొచ్చేందుకు మరో మంత్రి అండదండలతో స్థానిక ఎమ్మెల్యే అంతే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఓ పోలీసు విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీలలో అస్మదీయులను ఇక్కడికి రప్పించేందుకు రెండు వర్గాలూ తమ తమ స్థాయిలలో ప్రయత్నిస్తున్నాయి. ఇరువర్గాల నుంచీ పోటీ తీవ్రంగా ఉండటంతో కాకినాడ డీఎస్పీ పోస్టుపై సందిగ్ధత చోటు చేసుకుంది.
మరో రెండు పోస్టులు భర్తీ
జిల్లాలో తాజాగా మరో రెండు పోలీసు అధికారుల పోస్టులు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీగా వై.వి.రమణకుమార్‌ను నియమించారు. అలాగే, రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ సెల్ –డీఎస్పీగా పి.సోమశేఖర్‌ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నిస్సహాయస్థితిలో ఉన్నతాధికారులు
ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకపోవడం, ఇద్దరు మంత్రులు జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఖాళీ భర్తీపై నిర్ణయం తీసుకోలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 4న 17 మందిని బదిలీలు చేసి, పోస్టింగ్స్ ఇచ్చినా కాకినాడలో మాత్రం ఎవర్నీ నియమించలేదు. అలాగే, ఈనెల 11న మరో 12 మందిని బదిలీ చేసి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇందులోనూ కాకినాడ పోస్టు భర్తీ కాలేదు.
ఇరువర్గాల ఒత్తిడితో అధికారులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఎవరో ఒకరిని మాత్రమే సంతృప్తి పరచగలమని, ఈ క్రమంలో ఇంకొకర్ని నుంచి ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుందన్న భయంతోనే పోలీసు ఉన్నతాధికారులు ఈ పోస్టు భర్తీ జోలికి పోలేదు. ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోతే సీఎం స్థాయిలోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి అధికార పార్టీ నేతల స్వప్రయోజనాల కోసం డిఎస్పీ పోస్టు పెండింగ్‌లో పడిపోయింది.