అధికారం ఉంది కదా... తాము సిఫార్సు చేస్తే ఏమైనా జరిగిపోవాలనుకుంటున్నారు పాలకపక్ష నేతలు.
అధికారం ఉంది కదా... తాము సిఫార్సు చేస్తే ఏమైనా జరిగిపోవాలనుకుంటున్నారు పాలకపక్ష నేతలు. పారదర్శకతకోసం తమ ప్రభుత్వంలోనే నిబంధనలు నిర్దేశించినా... అవన్నీ తూచ్ అంటున్నారు. తాము చెప్పినవారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వీరి ఒత్తిడి చూసి అధికారులే తల్లడిల్లిపోతున్నారు. ఇదేం పద్ధతని ఛీదరించుకుంటున్నారు. అయినా అవేమీ పట్టని నేతలు మాత్రం తమ పట్టు వీడటంలేదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మొన్నటి వరకు ఏ నియామకాలకైనా ఇంటర్వ్యూలు జరిగేవి. ఇంటర్వ్యూ చేసేది అధికారులే అయినా... నేతల సిఫార్సుల మేరకే ఫలితాలు ఉండేవి. అంగన్‌వాడీ, విద్యుత్ సబ్‌స్టేషన్ షిప్ట్ ఆపరేటర్ల పోస్టుల నియామకాలు దాదాపు ఇదే రీతిలో జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గతంలో మాదిరిగా ఇంటర్వ్యూలు లేవు. మార్కులు, విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఆన్‌లైన్‌లో నియామకాలు జరగాలి. కానీ పాలకపక్ష నేతలు అదేమీ పట్టించుకోవడం లేదు. అంగన్‌వాడీ, విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల మాదిరిగా మాకిన్ని ఇచ్చేయాలంటూ వైద్య ఆరోగ్యశాఖాధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే కొందరు జాబితాలిచ్చేసినట్టు తెలిసింది. అటు ఉన్నతాధికారుల సూచనలు.. ఇటు నేతల ఒత్తిళ్ల మధ్య అధికారులు నలిగిపోతున్నారు.
వైద్యులు... ఏఎన్‌ఎం పోస్టులపై ఒత్తిడి
రాష్ట్రీయ బాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య ఉద్యోగులను నియమిస్తున్నారు. వీరంతా మొబైల్ టీమ్‌లుగా ఏర్పడి, బాలల ఆరోగ్య రక్షణ కోసం వైద్య సేవలందిస్తారు. జిల్లాలో 36 వైద్యులు, 12 ఆయుష్ వైద్యులు, 24 ఫార్మాసిస్ట్‌లు, 24 ఏఎన్‌ఎమ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గత నియామకాల అవకతవకలు, ఆరోపణల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య అప్రమత్తమై సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సారి ఇంటర్వ్యూలు ఉండవని, మార్కులు, విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే భర్తీ చేయాలని, అంతా ఆన్‌లైన్‌లోనే జరగాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
సిఫార్సుల జోరు
నియామకాల విషయం తెలుసుకున్న నేతలు మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఎప్పటిమాదిరిగానే సిఫార్సులు చేయడం ప్రారంభించారు. వైద్య పోస్టుల్ని మినహాయించి మిగతా ఏఎన్‌ఎం, ఫార్మాసిస్ట్ పోస్టులపై ప్రధానంగా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా ఆ పోస్టులను వేసుకున్నట్టుగా తమకిన్ని ఇవ్వాలంటూ ఏకంగా వైద్యాధికారులకు టార్గెట్ పెడుతున్నారు. ఒకరు ఎనిమిది, మరో నలుగురు ఐదేసి చొప్పున, ఇంకొకరు నాలుగు పోస్టులను తమ కోటా కింద ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడిది అధికారులకు ఇబ్బందికరంగా ఉంది. ఒకవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడేమో ఒక్కొక్కరు సిఫార్సులు చేస్తున్నారు. ఇప్పుడేం చేస్తారో చూడాలి.
ఇదే విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అమె అందుబాటులో రాలేదు. రాష్ట్రీయ బాల స్వచ్ఛత కార్యక్రమం కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సుబ్రహ్మణ్యం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమకేమీ లేఖలు, సిఫార్సులు రాలేదన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆన్‌లైన్‌లో మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయనున్నట్టు చెప్పారు.