
శ్రీకాకుళం జిల్లాకు అరకొరగా చేరిన ఉచిత సరుకులు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను వణికించిన ప్రకృతి విపత్తులోనూ ‘పచ్చ’దండు కాసులవేటలో నిమగ్నమైంది. తిత్లీ తుపాన్ బాధితులకు అందించాల్సిన బియ్యం, కందిపప్పు, పంచదార, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపల్లోనూ అధికార పార్టీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆలస్యంగా, అరకొరగా వచ్చే సాయాన్ని సైతం పక్కదారి పట్టిస్తుండటంపై బాధితుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
పంపిణీ చేయాల్సిన మండలాలు 28
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను వల్ల 11 మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. అనంతరం వరదల వల్ల 13 మండలాల్లో నష్టం ఏర్పడింది. మత్స్యకారులు ఉన్న ఎచ్చెర్ల, రణస్థలం మండలాలతో కలిపి మొత్తం 26 మండలాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. వరదలతో దెబ్బతిన్న మెళియాపుట్టి, సారవకోట మండలాలను ప్రభావిత ప్రాంతాల్లో చేర్చకపోవడంతో వైఎస్సార్ సీపీ ఆందోళన నిర్వహించడంతో వీటిని కూడా దెబ్బతిన్న మండలాల జాబితాలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో జిల్లాలోని మొత్తం 38 మండలాల్లో తుపాను బాధితులకు సరుకులు పంపిణీ చేయాల్సిన మండలాల సంఖ్య 28కి చేరింది.
అందాల్సిన సరుకులు ఇవీ...
శ్రీకాకుళం జిల్లాలో తుపాను, వరద ప్రభావిత మండలాల్లో 2,81,869 కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం, మిగతావారికి 25 కిలోల చొప్పున బియ్యం, కిలో పామాయిల్, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, అరకేజీ పంచదార ఇవ్వాలి. ఈ లెక్కన బియ్యం 6,720 మెట్రిక్ టన్నులు, పామాయిల్ 2,81,869 కిలోలు, 2,81,869 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో పాటు దాదాపు 1.45 లక్షల కిలోల పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. కానీ బుధవారం నాటికి బియ్యం 55 శాతం, పంచదార 13 శాతం, కందిపప్పు 9 శాతం, ఉల్లిపాయలు 6 శాతం, పామాయిల్ 5 శాతం, బంగాళాదుంపలు 5 శాతం మాత్రమే పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ప్రధానంగా వరద బాధిత మండలాలకు సరుకులు చేరలేదు. పంచదార ఇప్పటివరకూ గార, ఎల్‌ఎన్ పేట, నరసన్నపేట, పాతపట్నం, మెళియాపుట్టి, భామిని, కొత్తూరు మండలాల్లో ఒక్క కుటుంబానికీ పంపిణీ కాలేదు. కందిపప్పు శ్రీకాకుళం, గార, సరిబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, పాతపట్నం, మెళియాపుట్టి, భామిని, కొత్తూరు మండలాల్లో పంపిణీ కాలేదు. వంటనూనె, బంగాళాదుంపలు శ్రీకాకుళం, గార, సరిబుజ్జిలి, ఎల్‌ఎన్ పేట, నరసన్నపేట, పాతపట్నం, మెళియాపుట్టి, భామిని, హిరమండలం, కొత్తూరు మండలాల్లో పంపిణీ చేయలేదు. వీటితోపాటు ఆమదాలవలస మండలంలోనూ ఉల్లిపాయలు ఇప్పటివరకూ బాధితులకు పంపిణీ కాలేదు.
సగం మందికే సాయం
తుపాను సమయంలో వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పున ఐదు రోజులపాటు ప్రభుత్వం ఉచితంగా అందజేయాలి. తిత్లీ తుపానుతో సుమారు ఆరు రోజుల పాటు వేట కోల్పోయిన 11 మండలాల్లోని కుటుంబాలకు సరుకులు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, నూనె, బంగాళాదుంపలు సగంమందికే అందాయి.
ఉచితమే వారికి ఆయాచితం...
తుపాను సమయంలో ఇచ్చే ఉచిత సరుకులు టీడీపీ కార్యకర్తలకు ఆయాచిత వరంగా మారాయి. రేషన్ డీలర్లపై ఒత్తిడి తెచ్చి సరుకుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లొంగనివారిపై కేసులు బనాయించి దారికి తెచ్చుకుంటున్నారు. తూకంలోనూ తేడాలు ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అరకొరగా ఇస్తూ మిగిలిన సరుకులు తర్వాత తీసుకోవాలని జన్మభూమి కమిటీ సభ్యులు చెబుతుండటంతో బాధితులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. 25 కిలోలకుగానూ 21 కిలోలే బియ్యం ఉంటున్నాయి. ఈ–పాస్‌తో సంబంధం లేకుండా నేరుగా సరుకులు పంపిణీ చేస్తుండటంతో జన్మభూమి కమిటీలు ఆడింది ఆటగా మారింది.
సాయంలోనూ దోచుకుంటున్నారు....
తుపాను వల్ల పూర్తిగా నష్టపోయాం. ఉచిత సరుకుల పంపిణీలోనూ దోచుకుంటున్నారు. పాతిక కిలోలు బియ్యం ఇస్తామన్నా 21 కిలోలే ఇస్తున్నారు. మిగతా సరుకులు కూడా తక్కువగా ఉన్నాయి.
– ఎస్.సత్యనారాయణ, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
అర కిలో ఇచ్చారు...
తుపాను వల్ల గిరిజన గ్రామాల్లో అంతా నష్టపోయాం. బంగాళాదుంపలు, కందిపప్పు, ఉల్లిపాయలు కిలో చొప్పున ఇవ్వాల్సి ఉన్నా మాకు అరకిలో మాత్రమే ఇచ్చారు. అదేమని అడిగితే అంతే ఇస్తామని చెబుతున్నారు.
– గంటా ధర్మారావు, భీంపురం, టెక్కలి మండలం
కచ్చితంగా పంపిణీ అయ్యేలా చూస్తాం...
తుపాను, వరద బాధితులు, మత్స్యకారులకు నిర్దేశించిన ప్రకారం నిత్యావసర సరుకులు కచ్చితంగా అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పంపిణీ జరిగేలా చూస్తాం. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవు.
– కె.ధనంజయరెడ్డి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment