సిండి‘కేట్లు’ | TDP Liquor Mafia Reduces Government Revenue | Sakshi
Sakshi News home page

సిండి‘కేట్లు’

Published Sat, Sep 7 2019 11:20 AM | Last Updated on Sat, Sep 7 2019 11:21 AM

TDP Liquor Mafia Reduces Government Revenue - Sakshi

కలెక్టరేట్‌లో మద్యం దుకాణాల అద్దె టెండర్లు ప్రక్రియ(ఫైల్)

ఇక్కడా వారు రంగప్రవేశం చేశారు. ఎప్పటి మాదిరిగానే రింగయ్యారు. మద్యం దుకాణాల అద్దెలపేరుతో చక్రం తిప్పారు. కొందరు అధికారులను ప్రసన్నం చేసుకున్నారు. ఇష్టానుసారం అద్దెలు పెంచేసి ఆమోదింపజేసుకున్నారు. ఓ వైపు సర్కారు ఒక లక్ష్యంతో ఆదాయమార్గమైన మద్యాన్ని దశలవారీగా నిషేధించాలని చూస్తుంటే... ప్రభుత్వ ఖజానాకు మరింతగా కన్నం పెట్టాలని చూస్తున్నారు. జిల్లాలో సాగిన ఈ సిండికేట్‌ వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో బాధ్యులైన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహిళల బతుకులను బాగుచేయాలని, మద్యం రక్కసి నుంచి కుటుంబాలను చక్కదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గమైనప్పటికీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇందులో తొలివిడతలో ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేపడుతోంది. దీని కోసం జిల్లాలో అవసరమైన 168 దుకాణాలను అద్దెకు తీసుకునేందుకు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. అయితే ఇక్కడే మద్యం సిండికేట్‌లు చక్రం తిప్పారు. ఎక్సైజ్‌ అధికారులతో కలిసి షాపుల అద్దెలు పెంచేశారు. ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల చెంతకు చేరింది. దీంతో విషయం బయటపడుతుందనే భయంతో ఆ శాఖలోని కొందరు అధికారులు సెలవుపై వెళ్లిపోయారు.

అక్టోబర్‌ 1 నుంచి జిల్లాలో నూతన ఎక్సైజ్‌ విధానం అమలు చేసేందుకు టెండర్ల ఖరారు ప్రక్రియకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి గత నెల 23న నిర్వహించారు. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్‌న్లలోని 13 ఎక్సైజ్‌స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న 210 దుకాణాలను 80 శాతానికి కుదిస్తూ జిల్లాలో 168 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాంగణాలను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు 312 టెండర్లు, ఫర్నిచర్‌ లేని మద్యం దుకాణాల్లో ఫర్నిచర్‌ సరఫరాకు 33 టెండర్లు, మద్యం దుకాణాలకు సరుకు రవాణా చేసేందుకు 43 టెండర్లు వచ్చాయి.

సిండికేట్ల టెండరింగ్‌.. 
ఈ టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్‌ అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 210 షాపులకు తొలివిడత 20 శాతం షాపులను తగ్గిస్తూ 168 షాపులకు టెండర్లు పిలిచారు. ఇందులో సింగిల్‌ టెండర్లకు ప్రాధాన్యమిచ్చారు. జిల్లాలోని సింగిల్‌ షాపుల యజమానులు కూడా టెండర్లు దాఖలు చేశారు. ఈ షాపుల్లో తక్కువ అద్దెకు, తక్కువగా విక్రయించే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ఎక్కువ అద్దెకు ప్రతిపాదించిన టెండర్లను ఖరారు చేశారు.

చక్రం తిప్పిన మద్యం మాఫియా..
జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌లో టీడీపీకి చెందిన మద్యం మాఫియా చక్రం తిప్పింది. ఇక్కడ షాపులను టెండర్లు వేసిన సమయంలో ఇతరులను రానీయకుండా ఓ మద్యం వ్యాపా రి తన అనుచరులు, కుటుంబ సభ్యుల పేరునే అధికంగా అద్దెల ధరలు పెంచుకుంటూ టెండ ర్లు దాఖలు చేశారు. ఈ సమయంలో స్థానిక అధికారులతో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించుకున్నారు. ఇలా ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులకు దాదాపు 20కి పైగా షాపులు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

తక్కువ అద్దెకిస్తామన్నా...
ప్రభుత్వం కోరిన నూతన మద్యం పాలసీ ప్రకారం అద్దెల ప్రాతిపదికన షాపులు, ఫర్నిచర్, కంప్యూటర్, ఫ్రిజ్, సీసీ కెమెరాల వంటి అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లున్న బాడంగి మండలం డొంకినవలస(ఆర్‌ఎస్‌)లోని ఓ మద్యం వ్యాపా రి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.12,000కు టెండరు దాఖలు చేశారు. అయితే ఇదే మండలంలోని మల్లంపేటలోని (టీడీపీ ప్రభుత్వ హ యాంలో తరలించేసిన) మద్యం దుకాణానికి అధికంగా నెలకు రూ.32,000కు పైగా టీడీపీ నాయకుడు వేసిన టెండర్‌ను ఎక్సైజ్‌ అధికారులు ఖరారు చేసినట్టు ఆ వ్యాపారి ఆరోపిస్తున్నా రు. మల్లంపేటలోని మద్యం దుకాణం (గెజిట్‌ నెంబర్‌169) జీకేఆర్‌ పురానికి చెందినది. దీనిని టీడీపీ మాజీ మంత్రి ఆర్‌వి సుజయ కృష్ణ రంగా రావు పైరవీలతో,  ఇతర టీడీపీ నాయకుల ప్రో ద్బ లంతో మల్లంపేటకు గతంలో తరలించారు. గతంలో ఆ షాపు నుంచే అధికంగా బెల్ట్‌ షాపులను ప్రోత్సహించేవారని చెబుతున్నారు.

ఆ ప్రాంతాల్లో అధికంగా సింగిల్‌ టెండర్లు:
జిల్లాలోని బొబ్బిలి, తెర్లాం ఎక్సైజ్‌ సర్కిళ్ల ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపుల అద్దె టెండర్లకు అధికంగా సింగిల్‌ టెండర్లు నమోదయ్యేందుకు ఎక్సైజ్‌ అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముద్రపడిన ఓ మద్యం దుకాణాల నాయకుడు జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 22 మద్యం దుకాణాలను సింగిల్‌ టెండర్ల ద్వారా షాపులను చేజిక్కించుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో కంటే పల్లెల్లో అద్దెలు తక్కువగా ఉండాలి. కానీ మద్యం దుకాణాల అద్దెల్లో మాత్రం రివర్స్‌ జరిగింది. అర్బన్‌ ప్రాంతాల్లో లేని అద్దెలను గ్రామీణ ప్రాంతాల్లో వేసుకుని టెండర్లు చేజిక్కించుకున్నారు. మల్లంపేట, తెర్లాం, బాడంగి, బొబ్బిలి రూరల్‌ ప్రాంతాల్లోని షాపుల అద్దెలు మున్సి పాలిటీల్లోని షాపుల అద్దెలతో సమానంగా ఉన్నాయి. ఇవే మద్యం దుకాణాలు గ్రామీణ ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు వేల రూపాయలకు (ఫర్నిచర్‌తో సహా) లభిస్తున్నా అటు అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.

ఉన్నతాధికారులకు చేరిన ఫిర్యాదులు: 
అద్దెల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనీ వీటిని సవరించి ఇతరులకు న్యా యం చేయాలని డీపీసీ చైర్మన్‌ అయిన జాయిం ట్‌ కలెక్టర్, ఎక్సైజ్‌ డీసీలతో పాటు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌కు కొందరు వ్యాపారులు ఫిర్యాదులు చేశారు. షాపులకు సంబంధించి పలువురు వ్యాపారులు ఎక్సైజ్‌ అధికారుల చుట్టూ తిరుగుతుండటంతో వారు ఏమీ చెప్పలేకపోతున్నా రు. ఇటీవల తెర్లాం తదితర సీఐలతో పాటు ఎక్సైజ్‌ డీసీ సైతం సెలవులోకి వెళ్లిపోయారు. 

కమిటీదే నిర్ణయం..
మద్యం దుకాణాల అద్దెలపై జిల్లాలో జేసీ, డీసీ తదితరులతో కూడిన కమిటీ అంతా కలసి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయంలో నాకు స్పష్టత లేదు. షాపుల అద్దెల విషయంలో ఉన్నతాధికారులదే నిర్ణయం.
– సుధీర్, డిపో మేనేజర్,  బెవరేజెస్‌ కార్పొరేషన్, నెల్లిమర్ల 

ఫిర్యాదు చేశాం..
ఎక్సైజ్‌ శాఖ అధికారులు కొందరు బడా మద్యం వ్యాపారులకు సహకరిం చారు. అధిక అద్దెలున్న షాపులను ఎంపిక చేసి ఖజానాకు గండి కొడుతున్నారు. అధిక అద్దెల వల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు నెలకు కోటిన్నర పైనే ఖజానాకు భారం కానుంది. అలాగే ఎక్కువగా బెల్ట్‌షాపులకు నడిపించే ప్రాంతాల్లోనే ఎక్కువ షాపులను ఎంపిక చేస్తున్నారు. దీనిపై జేసీ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం.        – బార్నాల మహేశ్వరరావు,  మద్యం వ్యాపారి, బొబ్బిలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement