
లోకేశ్ ..జగన్‌కు సవాల్ విసరడమా?
హైదరాబాద్ : చెప్పిన అబద్ధం చెప్పకుండా టీడీపీ మహానాడులో అబద్ధాలు చెప్పారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మహానాడులో ప్రజా సమస్యలపై చర్చించలేదని, ఓ దశాదిశ నిర్దేశించింది ఎక్కడా లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
42 వంటకాలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని, తినడానికి అందరూ ఉన్నా.. వినడానికి ఎవరూ లేరని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, నాడు వెన్నుపోటు పొడిచి నేడు మహానాడులో కీర్తించమా అని అన్నారు. తెలుగు ప్రజల కోసం టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ పంచ ఊడదీసి చెప్పులు వేశారని అన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ గురించి గతంలో ఎన్టీఆరే చెప్పారని, అల్లుడి మానసిక క్షోభతో ఆయన చనిపోయారని అంబటి వ్యాఖ్యానించారు.
టీడీపీ అవినీతిపై సీబీఐ విచారణ అడిగితే పారిపోతునఆనరని, చర్చలతో సమస్యలు తేలవని, విచారణ చేయించాలని చెప్పి 24 గంటలు గడిచినా సవాల్‌ను స్వీకరించే నాథుడే లేడని అంబటి అన్నారు. దమ్ము,ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రిగా ప్రమోట్ అయిన లోకేశ్ మైక్ పట్టుకుంటే చంద్రబాబు వణికిపోతున్నారని, సూట్‌కేసులు మోయడానికి మాత్రమే లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారని అంబటి ఆరోపించారు.
మహానాడులో లోకేశ్ మాట్లాడుతున్నప్పడు చంద్రబాబు మొహంలో టెన్షన్ కనిపించిందన్నారు. ఇక మాట్లాడటమే సరిగా రాని లోకేశ్... వైఎస్ జగన్‌కు సవాల్ విసరడమా అని ప్రశ్నించారు. అభివృద్ధికి వైఎస్ జగన్ ఎలా అడ్డుపడుతున్నారో చెప్పాలని అన్నారు. టీడీపీ అవినీతి, అన్యాయాలు, అక్రమాలకు అడ్డుపడుతున్నది జగన్ మాత్రమే అని అన్నారు.