ఇంత దోపిడీ.. ‘అనిత’రసాధ్యం | TDP Mla Anitha Corruption Special Story | Sakshi
Sakshi News home page

ఇంత దోపిడీ.. ‘అనిత’రసాధ్యం

Published Sat, Jan 19 2019 7:24 AM | Last Updated on Sat, Jan 19 2019 8:58 AM

TDP Mla Anitha Corruption Special Story - Sakshi

పనులు చేయకుండానే బిల్లులు పెట్టేసుకోవడం.. రికార్డులు మార్చేసి యజమానులకు అందాల్సిన భూ పరిహారాన్ని కాజేయడం.. షిఫ్ట్‌ ఆపరేటర్, డీలర్‌ తదితర పోస్టులు అమ్ముకోవడం.. దళితుల అనుభవంలో ఉన్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించడం.. రోడ్డు నిర్మాణాలు, అక్రమ ఇసుక తవ్వకాలు.. ఇలా ఒకటేమిటి.. సొమ్ము దండుకునే అవకాశమున్న ఏ ఒక్కదాన్నీ వదలకుండా సర్వం స్వాహాపర్వం అన్నట్లు తయారైంది పాయకరావుపేట నియోజకవర్గంలో పరిస్థితి.

నాలుగున్నరేళ్ల క్రితం అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన వంగలపూడి అనిత.. ఆమె అనుచరులుగా చెలామణీ అవుతున్న కొందరు టీడీపీ నేతల ఆగడాలు, అక్రమాలు అంతూపొంతూ లేకుండా సాగుతున్నాయి. కాదేదీ అవినీతికి అనర్హమన్నట్లు సర్కారు చేపట్టే ప్రతి పనినీ, సంక్షేమ కార్యక్రమాలనూ అవినీతి సంపాదనకు వనరులుగా మలచుకుంటున్నారు. ఖాళీగా ఉన్న భూములన్నింటినీ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తూ అభాసుపాలవుతున్నారు. ఇప్పటికే వందల ఎకరాల భూములు వీరి చెరలో చిక్కుకున్నాయి. పారిశ్రామిక కారిడార్‌లో కలిసే భూములకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా దోచుకోవడానికి తెగిస్తున్నారు. అసలు భూ యజమానులను కాదని తమ బినామీల పేర్లను రికార్డుల్లో చేర్పించి పరిహారం కొట్టేస్తున్నారు.

విద్యుత్‌ శాఖకు చెందిన షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు, డీలర్‌ పోస్టులకు రేటు కట్టి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు.నీరు–చెట్టు, ఉపాధి హామీ పనులను తమ అనుచరులకు కట్టబెట్టి పనులు చేయకుండానే బిల్లులు దండేసుకున్నారు. చివరికి చెరువుల్లో పూడికతీసిన మట్టిని సైతం రైతుల పొలాలలకు ఉచితంగా తరలించకుండా అమ్మేసుకొని కాసులు దండేసుకున్న టీడీపీ ప్రజాప్రతినిధి,  ఆ పార్టీ నేతల అక్రమాలపై క్షేత్రస్థాయి  పరిశీలనాత్మక కథనం..

విశాఖపట్నం: పాయకరావుపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంత అవినీతి ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి వెన్నంటి తిరుగుతున్న నలుగురైదుగురు నాయకులే ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నీరు చెట్టు పథకంలో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేయడం, డబుల్‌ ధమాకాలా చెరువు తవ్వకాల్లో వచ్చిన మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయించడం, తాండవ, వరాహ నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వి జరిపి కంపెనీలకు విక్రయించడం, భూరికార్డులు ట్యాంపరింగ్‌ చేయడం, ప్రభుత్వ భూములకు పట్టాలు లేకుండానే నకిలీ పట్టాలు పుట్టించి పాసుపుస్తకాల్లో నమోదు చేయించుకోవడం, ఈ భూములకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల పరిహారం పొందేందుకు స్కెచ్‌ వేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. మరుగుదొడ్లు, పక్కా గృహాలు, పింఛన్ల మంజూరు వంటి పథకాల అమలులో కూడా లబ్ధిదారుల నుంచి వేలాది రూపాయలు గుంజేశారు. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు చేసిన అక్రమాలపై సాక్షి ఫోకస్‌..

 సీసీ రోడ్లలోరూ.50 కోట్ల అవినీతి
నియోజకవర్గంలో కొత్తగా 300 కిలోమీటర్లమేర సీసీ రోడ్ల నిర్మాణాన్ని టీడీపీకి చెందిన సర్పంచ్‌లు, ముఖ్య నాయకులే చేపట్టారు. ఈ పనులకు సుమారు రూ.300 కోట్లు మంజూరయ్యాయి. నాణ్యతాలోపంతో పనులు చేసి నిధులు స్వాహా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఉపాది నిధులతో చేపట్టిన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక భవనాల పరిస్థితి కూడా అంతే. నియోజకవర్గానికి 25 వేల మరుగుదొడ్లు మంజూరు కాగా నిర్మించే బాధ్యతను తెలుగుతమ్ముళ్లే తీసుకున్నారు. మరుగుదొడ్లలో సుమారు రూ.15 కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి ఈ ఏడాది 32 రైతు రథాలు మంజూరయ్యాయి. ఇవన్నీ టీడీపీ నాయకులకే దక్కాయి. ట్రాక్టర్లు సరఫరా చేసే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఒక్కొక్క ట్రాక్టర్‌ నుంచి రూ.50 వేలు కమీషన్లు దండుకున్నట్లు ప్రచారం జరిగింది.

600 ఎకరాలుహాంఫట్‌భోంచేసిన భూముల విలువ రూ.200 కోట్లు...
నియోజకవర్గంలో ఉన్న భూకుంభకోణాల్లో తెలుగు తమ్ముళ్లది అందెవేసిన చేయి. నక్కపల్లి మండలం పెద దొడ్డిగల్లు సర్వేనెం1లో సుమారు రూ.70 కోట్లు విలువైన 334 ఎకరాల భూమిని అప్పనంగా కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎకరం విలువ సుమారు రూ.15 లక్షల నుంచి 20 లక్షలు విలువ చేసే ఈ  భూములను  స్థానిక ప్రజాప్రతినిధి సమీప బంధువొకరు ఎకరం రూ.3 లక్షలకు కొనుగోలు చేసేందుకు సాగు రైతులతో ఒప్పందం కుదుర్చుకుని, ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అడ్వాన్సు చెల్లించారు. తాజాగా ఇదే భూములను చినబాబుతోపాటు, జిల్లాకు చెందిన మరో మంత్రి కుమారుడు ఎకరాకు రూ.8 లక్షల చొప్పున కొనుగోలు చేసేందుకు స్థానిక టీడీపీ నాయకులతో కలసి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులతో చర్చలు జరుపుతున్నారు. రూ.70 కోట్ల విలువైన ఈ భూములను రూ.20 కోట్లకు కొనుగోలు చేసి పవర్‌ప్లాంటు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవిగాక  మరో 300 ఎకరాల్లో రికార్డులను తారుమారు చేశారు.

నీరు చెట్టు.. అవినీతికి మెట్టు
నీరు చెట్టు పథకం కింద నియోజకవర్గంలో నాలుగేళ్లలో సుమారు రూ.12 కోట్ల విలువైన పనులు జరిగాయి. వీటిలో సగానికి సగం నిధులు స్వాహా చేశారు. పనులు తూతూమంత్రంగా చేపట్టడం, గతంలో చేసిన పనులనే ఈ ఏడాది కూడా చేసినట్లు ఎంబుక్‌లు నమోదు చేయించి నిధులు బొక్కేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎస్‌.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లో ఇలా నిధులు కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. కాంట్రాక్ట్‌ పనులను టీడీపీ నాయకులు హైమావతి, అశోక్‌రాజు, పి.చంద్రరావు, పి బంగార్రాజు,  కె.శ్రీనివాస్, ఎల్‌కేఎస్‌ నాయుడు తదితరులు చేపట్టారు. కోటవురట్లలో ఊరచెరువు, జల్లూరులో నాగన్న చెరువు, ఎస్‌.రాయవరం మండలం రామయ్య పట్నంలో జగ్గరాజు చెరువు పెదగుమ్ములూరులో రాతి చెరువు పెద ఉప్పలం చెరువు అప్పలరాజు చెరువులలో పనులు తూతూమంత్రంగా జరిగాయి. లక్షలాది క్యూబిక్‌ మీటర్ల మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మేసుకున్నారు.

ఇసుక నుంచి రూ.కోట్లు పిండేశారు..
తాండవ, వరాహ నదుల్లో దార్లపూడి, పందూరు, గొట్టివాడ, గుమ్ములూరు, పెదఉప్పలం, పెనుగొల్లు, ధర్మవరం, సోముదేవుపల్లి సత్యవరం, పెంటకోట, మాసయ్యపేట, అరట్లకోట తదితర ప్రాంతాల నుంచి లక్షలాది క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అక్రమంగా తవ్వేశారు. నిత్యం రేయింబవళ్లు పొక్లెయిన్‌లు ఏర్పాటు చేసుకుని లారీల్లో వేలాది ట్రిప్పులు తరలించారు. ఇసుకను పోలవరం కాలువ పనులకు, హెటెరో, డక్కన్‌ కంపెనీలకు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు విక్రయించి కోట్లు గడించారు. సుమారు రూ.50 కోట్లు విలువైన ఇసుకను కొల్లగొట్టడం ద్వారా నాలుగు మండలాల ముఖ్య నాయకులు సుమారు రూ.20 కోట్ల మేర లాభాలు ఆర్జించినట్లు అంచనా. ఇక తీరప్రాంతం వెంబడి ఉన్న అమలాపురం, రాజయ్యపేట, బోయపాడు, రేవుపోలవరం, బంగారమ్మపాలెం, పెంటకోట, రాజవరం, వెంకటనగరం, పాల్మన్‌పేట, డిఎల్‌పురం గ్రామాల్లో ఉన్న సముద్రపు ఇసుకను కూడా అక్రమంగా తవ్వేసి తరలించేస్తున్నారు.

బహిరంగమార్కెట్లోఔట్‌సోర్సింగ్‌ఉద్యోగాలు
నియోజకవర్గానికి కొత్తగా నాలుగు సబ్‌స్టేషన్‌లు మంజూరయ్యాయి. ఒక్కొక్క సబ్‌స్టేషన్‌లో నాలుగు షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు నియమించాల్సి ఉంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ పోస్టులు ఒక్కొక్కటి రూ.4 లక్షల నుంచి 5 లక్షల చొప్పున విక్రయించి సుమారు రూ.60 లక్షలు స్వాహా చేశారు. ఇలా షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుకు రూ.3 లక్షల చెల్లించి ఉద్యోగం రాకపోవడంతో గొడిచర్లకు చెందిన నిరుద్యోగి బొడ్డపు నానాజీ పాదయాత్రలో స్దానిక ఎమ్మెల్యే అనితను అడ్డుకుని నిరసన తెలిపాడు. గ్రామస్తులంతా ఇతనికి అండగా నిలిచి రోడ్డుపై బైఠాయించారు. కొత్తగా 14 డీలర్‌ పోస్టులు మంజూరు కాగా ఒక్కొక్కదానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసి తమ అస్మదీయులనే ఎంపిక చేశారు. ఈ విషయంపై తనకు అన్యాయం జరిగిందంటూ పాయకరావుపేటకు చెందిన టీడీపీ నాయకుడొకరు కోర్టును ఆశ్రయించడం గమనార్హం. నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులు భర్తీ చేశారు. ఒక్కొక్కరినుంచి రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేసినట్లు చెప్పుకుంటున్నారు.

ల్యాండ్‌ సీలింగ్‌ భూములకు ఎసరు
ఎస్‌.రాయవరం మండలం గుర్రాజు పేటలోసాగి సావిత్రమ్మ  9 ఎకరాల  మిగులు భూమిని ప్రభుత్వానికి స్వాదీనం చేయగా ప్రభుత్వం గుర్రాజు పేటకు చెందిన  ఆరుగురు దళితులకు డీఫారం పట్టాల కింద పంపిణీ చేసింది.  ఈభూమిని గుర్రాజుపేట గ్రామానికిచెందిన టీడీపీ సర్పంచ్‌ కురందాసు శ్రీనివాసరావు కబ్జాచేసి యధేచ్చగా వరి సాగుచేస్తున్నాడు. దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుంది.ఈబాగోతం పత్రికల్లో రావడంతో అధికారులు స్పందించి భూములు స్వాదీనం చేసుకుని బాదితులకు అప్పగించారు. నక్కపల్లి మండలం అమలాపురం (వేంపాడు2) రెవెన్యూ పరిదిలో సర్వేనెం 375 ఎకరాలు ప్రభుత్వ భూమి( కొండప్రాంతం) ఉంది.2005లో దివంగత నేత వైఎస్‌ హయాంలో 250 ఎకరాలు  పేదలకు పంపిణీ చేసారు.మిగిలి ఉన్న ప్రభుత్వభూమిపై కన్ను పడింది. గ్రామానికి చెందిన మాజీసర్పంచ్‌ కీలక పాత్ర పోషించి వీఆర్వో సహయాంతో సుమారు 39 మందిటీడీపీ కార్యకర్తల పేరున 53 ఎకరాలకు  రికార్డులు తారు మారు చేసారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement