సాక్షి ప్రతినిధి, ఏలూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చట్టాలు వర్తించవా? వరుసగా ప్రజలు, అధికారులు, విపక్ష నేతలు, అధికార పార్టీ నేతలపై దాడులు చేస్తున్నా మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం తప్ప వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో చింతమనేని ప్రభాకర్ పెట్రేగిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మూడు నెలల క్రితం దెందులూరుకు చెందిన దివ్యాంగుడు, అతని తల్లితండ్రులపై దాడి చేయగా కేసు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదు. రెండున్నర నెలల క్రితం దళిత కార్మికుడు జాన్‌పై దాడి చేయగా, కేసు నమోదుచేయడానికి కూడా పోలీసు అధికారులు మీనమేషాలు లెక్కపెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినా ఇప్పటివరకూ ఆ కేసు ముందుకు కదలడం లేదు.
ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఉన్నా కేసు అతనికి అప్పగించకపోవడంపై అఖిలపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడం, దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి, డీజీపీ నుంచి సీఐ స్థాయి వరకూ అందరికీ నోటీసులు జారీ చేసింది. అయినా పోలీసుల్లో కదలిక రాలేదు. తాజాగా రెండురోజుల క్రితం వైఎస్సార్ సీపీకి చెందిన గార్లమడుగు మాజీ సర్పంచ్ మేడికొండ కృష్ణారావుపై కిడ్నాప్, హత్యాయత్నం కేసుల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏ–2గా పెట్టారు. నమోదు అయిన సెక్షన్లు నాన్‌బెయిలబుల్ అయినా ఇప్పటివరకూ చింతమనేని ప్రభాకర్ జోలికి వెళ్లలేదు. ఏకంగా నాన్‌బెయిలబుల్ సెక్షన్లు నమోదు అయినా ఆయన ఎస్పీ ఆఫీసుకు వచ్చి దర్జాగా వెళ్లిపోయారు. కనీసం చింతమనేని అనుచరులను కూడా అరెస్టు చేయలేదు. ఈ కేసులో చింతమనేని గన్‌మేన్ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇప్పటివరకూ అతడిని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు.
తొత్తులుగా ఇరిగేషన్ అధికారులు
చాలాకాలం నుంచి పోలవరం కుడికాలువను యథేచ్ఛగా చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులు తవ్వుకు పోతున్నా, దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినా ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావా ల్సిన వేల కోట్ల రూపాయల ఆదాయం రాకుండా పోయింది. లక్ష్మీపురం వద్ద పోలవరం మట్టిని తవ్వుకుంటున్నారని గార్లమడుగు మాజీ సర్పంచ్ కృష్ణారావు స్వయంగా పోలవరం కుడికాలువ సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు ఫిర్యాదు చేస్తే మట్టితవ్వుకుపోతున్న వారిపై చర్యలు తీసుకోకపోగా, ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి ఎమ్మెల్యేకు సమాచారం అందించడం విమర్శలకు దారితీసింది. ఇరిగేషన్ అధికారుల సమాచారంతో అక్కడికి వచ్చిన చింతమనేని అనుచరులు కృష్ణారావును కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకువెళ్లి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ అబ్బయ్యచౌదరి ఎస్‌ఈని కలిసి బాధితునికి రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు.
సీఎం అక్షింతలు?
వరుస వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే చింతమనేని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఎల్లోమీడియాలో లీకులు ఇచ్చారు. గార్లమడుగు మాజీ సర్పంచ్ మీద దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని చింతమనేనిపై మండిపడ్డట్టుగా వార్తలు వచ్చాయి. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పునకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్ ఉంటుందని, ఆ విషయం చింతమనేనికి చెప్పాలని, ఒకటి రెండు రోజుల్లో చింతమనేనిని అమరావతికి పిలిపించి మాట్లాడతానని చంద్రబాబు అన్నట్టు సమాచారం. చట్టంలోని నిబంధల ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికైనా పోలీసులు చింతమనేనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment