
ఉద్యోగిపై చేయిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే
వేమూరు, న్యూస్‌లైన్: ఓటర్ల నమోదు.. తొలగింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తహశీల్దార్ కార్యాలయ ముట్టడి సందర్భంగా ఓ ఉద్యోగిపై ఆ పార్టీ ఎమ్మెల్యే చేయిచేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా వేమూరులో శుక్రవారం జరిగింది. వేమూరు మండలంలో తమ పార్టీ సానుభూతిపరుల పేర్లను జాబితా నుంచి తొలగించారంటూ టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఫోర్జరీ సంతకాలు చేసి ఫిర్యాదు చేస్తే ఎలా తొలగిస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఓ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. అనంతరం ఆయన తహశీల్దార్‌ను కూడా ప్రశ్నించారు. వీటిపై విచారణ జరిపి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో చర్చించి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ చెప్పగా, తాను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతానంటూ ఎమ్మెల్యే విసురుగా వెళ్లిపోయారు.