లైన్‌మన్‌ను కొట్టిన ఎంపీ
- వీధి రౌడీని మరిపించిన టీడీపీ ఎంపీ రమేష్
- ఉద్యోగి వీరశేఖర్ ముఖంపై ముష్టిఘాతం
ప్రొద్దుటూరు టౌన్/ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి అసిస్టెంట్ లైన్‌మన్ దండు వీరశేఖర్‌పై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వీధి రౌడీని మరిపిస్తూ ఆదివారం మధ్యాహ్నం దాడి చేసి గాయపరిచారు. బాధితుని కథనం మేరకు... పోట్లదుర్తిలోని సత్యనారాయణ కాలనీలో విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మలు తగులుతుండటంతో సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్‌మన్ దండు వీరశేఖర్, సబ్‌స్టేషన్ వాచ్‌మన్ నాగయ్య, అంజి, భాస్కర్ కొమ్మలు తొలగించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ఎంపీ రమేష్ దండు వీరశేఖర్‌ను పిలిచి ‘ఎవడ్రా చెట్లకొమ్మలను తొలగించింది, మీరు డబ్బులు తీసుకుని చెట్లు కొడతారా ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మలను తొలగించిన వారిని పిలిపించు అని మండిపడ్డారు.
వారిని పిలిస్తే ఎక్కడ కొడతాడోనని వీరశేఖర్ మరోసారి సమస్యను వివరిస్తుండగా పిడికిలి బిగించి మొహంపై గుద్దాడు. దీంతో ముక్కుపై గాయమై రక్తం వచ్చింది. ‘నీ ఉద్యోగం తీయిస్తా, నిన్ను సస్పెండ్ చేయిస్తా’నని ఎంపీ బెదిరించారు. గన్‌మ్యాన్ వీరశేఖర్‌ను పక్కకు లాక్కెళ్లగానే కళ్లు తిరిగి పడిపోయాడు. అక్కడే ఉన్న వాచ్‌మన్ నాగయ్య ఈ విషయాన్ని సిబ్బందికి చెప్పడం తో అతన్ని ప్రొద్దుటూరు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న ఏఈ ఎం.కృష్ణకుమార్, ఎర్రగుంట్ల మండలం విద్యుత్ సిబ్బంది వీరశేఖర్‌ను పరామర్శించారు. డీఈ విజయన్, ఏడీఈ చక్రపాణి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ రమేష్ దాడిచేసిన విషయాన్ని ఆసుపత్రిలోని ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేశారు. దళితుడిని కాబట్టే తనను ఎంపీ కొట్టాడని వీరశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.