Line man
-
దక్షిణ డిస్కంలో తొలి లైన్‌ఉమెన్‌గా శిరీష
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చరిత్రలోనే తొలి జూనియర్ లైన్‌ఉమెన్‌గా సిద్దిపేట వాసి బబ్బూరి శిరీష ఘనత సాధించారు. హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నుంచి బుధవారం ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆమెను మేడ్చల్ సర్కిల్ పరిధిలో జేఎల్ఎంగా నియమించారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా మహిళలను జూనియర్ లైన్ఉమెన్లుగా నియమించినట్టు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళలను ఈ పోస్టుల్లో నియమించిన ఘనత రాష్ట్రానికే దక్కుతుందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని శిరీష ఈ సందర్భంగా పేర్కొన్నారు. లైన్ ఉమెన్ పోస్టుకు ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: Hyderabad: రూ.45 లక్షల మోసం.. ప్రేమగా మాట్లాడే ఇందుష ఎన్నిసార్లు కోరినా రాదే! -
తీగలే.. మృత్యుపాశాలై..
సాక్షి,శ్రీకాకుళం: మండల కేంద్రం ఎల్.ఎన్.పేటలో గురువారం విద్యుత్ స్తంభంపై వైర్లు సరిచేస్తున్న సమయంలో షాక్‌కు గురై గ్రామ సచివాలయ గ్రేడ్–2 జేఎల్ఎం (జూనియర్ లైన్‌మేన్) సాహుకారి వెంకటరమణ(36) మృతి చెందాడు. విద్యుత్ సిబ్బంది, మృతుని కుటుంబ సభ్యులు, సరుబుజ్జిలి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎల్.ఎన్.పేట మండలం బొత్తాడసింగి గ్రామానికి చెందిన వెంకటరమణ తన ఊరిలోనే గ్రామ సచివాలయంలో గ్రేడ్–2 జేఎల్ఎంగా పనిచేస్తున్నాడు. ఎల్.ఎన్.పేటలోని ఓ వీధిలో కొన్ని ఇళ్లకు విద్యుత్ సరఫ రా హెచ్చుతగ్గులు జరుగుతుండటంతో వైర్లు సరిచేసేందుకు స్థానిక లైన్‌మేన్ రమేశ్, మరికొందరు జేఎల్‌ఎంలతో కలిసి వెంకటరమణ కూడా వెళ్లాడు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ విద్యుత్ సమస్య వచ్చినా వీరంతా కలిసి పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే విద్యుత్ స్తంభం ఎక్కిన వెంకటరమణ వైర్లు సరిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వాస్తవానికి, ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశామని, సమీప ప్రాంతంలోని బ్యాంకు ఇన్వర్టర్ల నుంచి రిటన్ విద్యుత్ సరఫరా కావటంతో ఈ ఘట న జరిగినట్లు భావిస్తున్నామని లైన్‌మేన్ రమేష్ తెలిపారు. వెంకటరమణకు భార్య రాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే రెండో కుమారుడికి బారసాల చేశారు. ఇంతలోనే విషాదం జరగడంతో కుటు కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస ట్రాన్స్‌కో ఏడీఈ ఆర్.శ్రీనివాసరా వు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సరుబుజ్జిలి ఎస్సై పి.నర్సింహామూర్తి చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించామని తెలిపారు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో లైన్‌మన్
చిత్తూరు, మదనపల్లె అర్బన్ : మదనపల్లెలో సోమవారం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న ట్రాన్స్‌కో అసిస్టెంట్ లైన్‌మన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీలు దీపికా పాటిల్, తిరుమలేశ్వర్‌రెడ్డి కథనం మేరకు.. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీకి చెందిన రైతు ఈశ్వర్ రెడ్డికి కోళ్లబైలులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సేద్యం చేసుకునేందుకు అప్పులు చేసి బోరు వేయించాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెల రోజుల క్రితం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరైంది. కనెక్షన్ ఇచ్చేందుకు అసిస్టెంట్ లైన్మెన్ వెంకట్రామయ్య రూ.6 వేలు లంచం అడిగాడు. బోరు వేసేందుకు తన వద్ద ఉన్న సొమ్మంతా ఖర్చయిపోయిందని చెప్పినా అతను వినలేదు. డబ్బు ఇవ్వకపోతే కనెక్షన్ ఇవ్వడం కుదరదని అసిస్టెంట్ లైన్‌మన్ వెంకట్రామయ్య తేల్చిచెప్పాడు. దీంతో విసిగిపోయిన రైతు ఈశ్వర్‌రెడ్డి న్యాయం చేయాలంటూ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రైతు లైన్‌మన్ వెంకట్రామయ్యకు ఫోన్ చేసి రూ.5 వేలకు బేరం కుదుర్చుకుని డబ్బులు తీసుకునేందుకు రావాలని కోరాడు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సీటీఎం రోడ్డులోని డివిజనల్ కార్యాలయం ఎదుట రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితుడు లైన్‌మన్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు అడిషనల్ ఎస్పీలు దీపికా పాటిల్, తిరుమలేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి ప్రజలు 9440446190 కు ఫోన్ చేసి తెలిపితే సత్వరమే చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలియజేశారు. -
కాటేస్తున్న కరెంటు
రాయచోటి రూరల్ : ఈ మధ్య కాలంలో జనాలను, విద్యుత్ వర్కర్లను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య విద్యుత్ ప్రమాదాలు. ఒక వైపు ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం, మరో వైపు జాగ్రత్తలు పాటించని ప్రజలు రెండూ కలిసి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. అందుకు పెట్టింది పేరుగా రాయచోటి డివిజన్ మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు 32 విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుని 20 మంది, 8 పశువులు ప్రాణాలు కోల్పోయారు. మరమ్మతులు చేస్తూ.. ట్రాన్స్‌కో కార్యాలయాల పరిధిలోని వివిధ మండలాల్లో పని చేస్తున్న వర్కర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అందులో భాగంగా ఎల్సీ తీసుకుని విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ సరఫరా రావడంతోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఈ మధ్య కనిపిస్తున్నాయి. సరైన విధి విధానాలు లేకపోవడంతో పాటు కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఆవేదన మాత్రమే మిగులుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. ప్రమాదాలను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మూడు రోజుల్లో ముగ్గురు మృతి రాయచోటి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఇటీవల రోజుకో ప్రమాదం చొప్పున మూడు విద్యుత్ ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందడం గమనార్హం. సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తున్న సబ్‌స్టేషన్ ఆపరేటర్ ప్రసాద్ ప్రమాదంలో మృతి చెందగా, ఆ మరుసటి రోజు రాయచోటి పట్టణం కొత్తపేటలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో విద్యుత్ షాక్‌కు గురైన బీటెక్ విద్యార్థి ప్రేమ్‌కుమార్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే చిన్నమండెం మండలం చిన్నర్సుపల్లెలో కొండమ్మ అనే మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. వరుస విద్యుత్ ప్రమాదాలు ∙2018 మే నెలలో గాలివీడు మండలం గోరాంచెరువు వద్ద విద్యుత్ క్రాంట్రాక్టు కార్మికుడు శరత్‌కుమార్ మరమ్మతు పనులు చేస్తుండా విద్యుత్ సరఫరా అయ్యి మృతి చెందాడు. ∙2018 జూలైలో చిన్నమండెం మండలం చాకిబండ వద్ద విద్యుత్ లైన్ మీద మరమ్మతులు చేస్తున్న లైన్మెన్ సాంబ అనుకోకుండా విద్యుత్‌సరఫరా అయ్యి షాక్ గురై తీవ్రంగా గాయపడ్డాడు. ∙2018 సెప్టెంబర్‌లో సంబేపల్లె మండలంలో విద్యుత్ లైన్ మీద మరమ్మతులు చేస్తున్న ప్రసాద్ అనే ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ ఆపరేటర్ అనుకోకుండా విద్యుత్ సరఫరా రావడంతో షాక్‌కు గురై విద్యుత్ సంభం మీదనే మృతి చెందాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉండటం బాధాకరం. జాగ్రత్తలు పాటిస్తున్నాం వీలైనంత వరకు సబ్స్టేషన్ల పరిధిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాలు జరగడం బాధాకరం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజలు విద్యుత్ వాడుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. – టి.శేషాద్రి, డీఈ, రాయచోటి -
కరెంట్‌తో ఆటలు!
గట్టుపల్లి రఘుమారెడ్డి(29). విద్యుత్ పంపిణీ సంస్థలో అనధికార ఉద్యోగి. నల్లగొండ జిల్లా తానేదార్పల్లిలోని కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజుకు మరమ్మతులు చేస్తూ కొద్దిరోజుల క్రితం మరణించాడు. పాల్వయి సబ్‌స్టేషన్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్కు ఎల్సీని తిరిగి అప్పగించాల్సి ఉండగా, లైన్‌మన్‌కు అవగాహన లేక మరో ఫీడర్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేయించాడు. మరమ్మతు కోసం ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన రఘుమారెడ్డి విద్యుదాఘాతానికి గురై కన్నుమూశాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి ఇలాంటి ఎందరో అమాయక నిరుద్యోగుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సాంకేతిక శిక్షణ, నైపుణ్యం లేని ప్రైవేటు వ్యక్తులతో డిస్కంలు అనధికారికంగా పనులు చేయించుకుంటూ వారి మరణాలకు కారణమవుతున్నాయి. లైన్మన్లు క్షేత్రస్థాయిలో సొంతంగా సహాయకులను నియమించుకుని వారికి తమ పనులు అప్పగిస్తున్నారు. అయితే సరైన నైపుణ్యం లేకపోవడంతో వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికు(ఆర్టిజన్)ల సమ్మె ఈ నెల 21న ప్రారంభం కాగా, వారం రోజుల్లో ఇద్దరు ప్రైవేటు సహాయకులు మరమ్మతు పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. సొంతంగా సహాయకుల నియామకం క్షేత్రస్థాయిలో జూనియర్ లైన్మన్లు, అసిస్టెంట్ లైన్మన్లు, లైన్మన్లు సొంతంగా ప్రైవేటు వ్యక్తులను తమ సహాయకులుగా నియమించుకుని తాము చేయాల్సిన ‘ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓఅండ్ఎం)’పనుల బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. వీరే అన్ని పనులు చేస్తుండటంతో చాలామంది రెగ్యులర్ లైన్మెన్లు విద్యుత్ స్తంభాలను ఎక్కడం కూడా మానేశారు. పల్లెల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే క్షేత్ర స్థాయికి వెళ్లి మరమ్మతులు చేయడం ఇష్టం లేక ఎక్కడికక్కడ గ్రామాల్లో స్థానిక నిరుద్యోగ యువకులను సహాయకులుగా నియమించుకుంటున్నారు. నిపుణత, అత్యంత అప్రమత్తతో చేయాల్సిన విద్యుత్ సరఫరా వ్యవస్థల నిర్వహణ, మరమ్మతు పనులు చేస్తూ ఏటా పదుల సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులు విద్యుదాఘాతాలకు గురై మృత్యువాతపడుతున్నారు. ఆర్టిజన్ల సమ్మె ప్రభావం.. ఈ నెల 21 నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ వారం రోజుల్లో ఇద్దరు ప్రైవేటు సహాయకులు మరమ్మతు పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై మరణించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ప్రకటించిన సేఫ్టీ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై మార్గదర్శకాల ప్రకారం ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లో కనీసం రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతతో పాటు వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసిన వ్యక్తులనే డిస్కంలు మరమ్మతు, నిర్వహణ పనులకు నియమించుకోవాలి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో 5,149 మంది, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్)లో 4,625 మంది ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ సిబ్బంది పని చేస్తుండగా, వీరిలో చాలా మంది కనీసం ఇద్దరు, ముగ్గురిని ప్రైవేటు సహాయకులుగా నియమించుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో 10 వేల మంది ప్రైవేటు వ్యక్తులు డిస్కంలలో అనధికారికంగా పనిచేస్తున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రైవేటు నియామకాల విషయం డిస్కంల యాజమాన్యాలకు తెలిసినా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు చనిపోతే అనధికారికంగా పనిచేస్తూ చనిపోయారని పేర్కొంటూ సంస్థ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. ఎల్సీపై ఆర్టిజన్లకే అవగాహన సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిస్కంలలో పనిచేస్తున్న పోల్ టూ పోల్ వర్కర్లు, సబ్‌స్టేషన్ ఆపరేటర్లు, బ్రేక్ డైన్ గ్యాంగ్‌లు, రూట్ రైడర్లు, ఎంఆర్టీ వర్కర్లతో పాటు ట్రాన్స్‌కోలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్ ఆపరేటర్లుగా పని చేస్తున్న ఆర్టిజన్లు విధులను బహిష్కరించారు. ఏ ఫీడర్ పరిధిలో ఎన్ని లైన్లు ఉన్నాయి.. మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసేందుకు ఎక్కడ లైన్ క్లీయర్(ఎల్సీ) తీసుకోవాలన్న విషయం ఆర్టిజన్లకు తెలిసినంతగా క్షేత్ర స్థాయి ఇంజనీర్లు, రెగ్యులర్ లైన్మెన్లకు తెలియని పరిస్థితి. సాధారణంగా లైన్మెన్లు ఎల్సీ తీసుకుని, ఆర్టిజన్లు/ప్రైవేటు సహాయకులతో మరమ్మతులు చేయిస్తుంటారు. కార్యాలయాలకే పరిమితమై పనిచేసే సబ్ ఇంజనీర్, ఏఈ, ఆపై స్థాయి అధికారులు అరుదుగా క్షేత్ర స్థాయిల్లో పర్యటిస్తుంటారు. ఎక్కడ ‘ఎల్సీ’తీసుకోవాలో తెలీదు! సాంకేతిక పరిభాషలో ఓ ఫీడర్‌కు ఎల్సీ తీసుకుంటే.. సంబంధిత ప్రాంతానికి విద్యుత్ సరఫరా అందిస్తారు. ఎల్సీని తిరిగి అప్పగిస్తున్నట్లు స్థానిక లైన్మెన్ సబ్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే సంబంధిత ఫీడర్‌కు సరఫరాను నిలుపుదల చేస్తారు. అయితే, ఎల్సీ తీసుకోవడంలో లైన్మెన్లు చేస్తున్న పొరపాట్లతో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టిజన్ల సమ్మె ప్రభావం కనిపించకుండా చూసుకోవాలని, సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలిగితే అప్పటికప్పుడు మరమ్మతులు జరిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని డిస్కంల యాజమాన్యాలు క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించాయి. దీంతో క్షేత్ర స్థాయిలో వందలాది మంది ప్రైవేటు సహాయకులను కొత్తగా నియమించుకుని పనులు చేయించుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లో ప్రైవేటు వ్యక్తిగా చేరినా భవిష్యత్తులో కాంట్రాక్టు లైన్మెన్లుగా అవకాశం లభించవచ్చనే ఆశతో ముందుకొస్తున్న నిరుద్యోగ యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. -
లైన్మన్లు.. స్తంభం ఎక్కాల్సిందే!
ఒంగోలు సెంట్రల్: విద్యుత్ సంస్థలో పనిచేసే జూనియర్ లైన్మన్లు, సహాయ లైన్మన్లు, లైన్మన్లు ఇక నుంచి విద్యుత్ స్తంభం ఎక్కాల్సిందేనని సదరన్ డిస్కం ముఖ్య ఇంజినీరు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత డివిజినల్ ఇంజినీరు వారానికి ఒక సెక్షన్‌కు వెళ్లి ప్రతి ఉద్యోగి స్తంభం ఎక్కగల సామర్థ్యం ఉందో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ, క్షేత్రస్థాయిలో ఎక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు మార్చాలన్నా, గడువులోపు బిల్లులు చెల్లించని వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపేయడం, పునురుద్ధరణ తదితర పనుల్లో స్తంభాలు ఎక్కేందుకు కొందరు శాశ్వత ఉద్యోగులు ఇష్టపడటం లేదని, మరికొందరికి స్తంభాలు ఎక్కే నైపుణ్యం లేదని తిరుపతిలోని సదరన్ డిస్కిం ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులతో ఆ పనులు చేయిస్తున్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందింది. నైపుణ్యం లేనందున పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు జాప్యం జరుగుతోందని గుర్తించారు. పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా నివారించేందుకు సిబ్బందిలో జవాదుదారీతనం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించకుండా శాశ్వత ఉద్యోగులే అన్ని పనులు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని తక్షణం అమలు చేయాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం విద్యుత్ స్తంభాలు ఎక్కలేని వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. 50 ఏళ్లు దాటిన లైన్మన్లు చాలామంది ప్రస్తుతం స్తంభాలు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయో ఆదేశాల్లో స్పష్టం చేయలేదు. జిల్లాలో జూనియర్ లైన్మన్లు–305 మంది. అసిస్టెంట్ లైన్మన్లు–380 మంది, లైన్మన్లు–365 మంది వరకు ఉన్నట్లు ఆ శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో లైన్‌మన్ మృతి
వేమనపల్లి(బెల్లంపల్లి) : పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సిరోంచ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నీల్వాయికి చెందిన లైన్‌మన్ వెమునూరి రమేశ్‌రెడ్డి(44) మృత్యువాతపడ్డాడు. చెన్నూర్‌లో ఉంటూ విద్యుత్‌శాఖలో లైన్మెన్గా మంచిర్యాల సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం మహారాష్ట్రలోని రామాంజపురంలో శుభకార్యానికి భార్య శారదతో కలిసి వెళ్లాడు. విందు పూర్తయినా తర్వాత బైక్‌పై చెన్నూర్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. సిరోంచ పెట్రోల్‌బంక్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అతని భార్యకు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటిన హన్మకొండ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాయక్క, లచ్చిరెడ్డి, తమ్ముడు మహేశ్ కుటుంబ సభ్యులు, మిత్రులు సిరోంచకు వెళ్లారు. సిరోంచ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహానికి సిరోంచ ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడికి కుమారుడు లడ్డు, కూతురు ఉన్నారు. రమేశ్‌రెడ్డి మృతితో నీల్వాయిలో విషాదఛాయలు అలుముకున్నాయి. రమేశ్‌రెడ్డి(ఫైల్), రమేశ్‌రెడ్డి మృతదేహం -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
- గొడిగెనూరు గ్రామంలో ఘటన –మృతికి విద్యుత్‌శాఖ అధికారులే కారణమని బంధువుల ఆరోపణ గొడిగెనూరు(చాగలమర్రి): చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనకు ట్రాన్స్‌కో అధికారుల తీరే కారణమని గ్రామస్తులు, మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (30) విద్యుత్ లైన్మెన్ సుధాకర్, ఏఎల్ఎం నాగశేషులతో గ్రామంలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి వెలుతుండే వాడు. లైన్మెన్ సెలవు పెట్టడంతో ఏఎల్ఎం ఆదివారం గొడిగెనూరు 11కేవీ రిపేరీ కోసం సుబ్రమణ్యంను స్తంభం ఎక్కించారు. అయితే, మరమ్మతు చేస్తున్న విద్యుత్ స్తంభం పక్కనే 765 పవర్‌గ్రిడ్ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఈ విద్యుత్ తీగల ఇండెక్షన్ సుబ్రమణ్యంకు తగలడంతో షార్ట్‌సర్య్యూట్ అయి స్తంభంపైనే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. సబ్ ఇంజినీర్ షాజహాన్, విద్యుత్ సిబ్బంది రామకృష్ణారెడ్డి లతో వాగా్వదానికి దిగారు. ఏమి తెలియని సుబ్రమణ్యంను ఏఎల్ఎం నాగశేషు విద్యుత్ స్తంభాన్ని ఎక్కించి నిండు ప్రాణం తీశాడని ఆరోపించారు. ఈ దుఃఖంలో మృతుడి బంధువులు విద్యుత్‌సిబ్బందిని పట్టుకొని చితకబాదారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపటా్టరు. -
వీధి రౌడీని మరిపించిన టీడీపీ ఎంపీ
-
లైన్‌మన్‌ను కొట్టిన ఎంపీ
- వీధి రౌడీని మరిపించిన టీడీపీ ఎంపీ రమేష్ - ఉద్యోగి వీరశేఖర్ ముఖంపై ముష్టిఘాతం ప్రొద్దుటూరు టౌన్/ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి అసిస్టెంట్ లైన్‌మన్ దండు వీరశేఖర్‌పై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వీధి రౌడీని మరిపిస్తూ ఆదివారం మధ్యాహ్నం దాడి చేసి గాయపరిచారు. బాధితుని కథనం మేరకు... పోట్లదుర్తిలోని సత్యనారాయణ కాలనీలో విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మలు తగులుతుండటంతో సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్‌మన్ దండు వీరశేఖర్, సబ్‌స్టేషన్ వాచ్‌మన్ నాగయ్య, అంజి, భాస్కర్ కొమ్మలు తొలగించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ఎంపీ రమేష్ దండు వీరశేఖర్‌ను పిలిచి ‘ఎవడ్రా చెట్లకొమ్మలను తొలగించింది, మీరు డబ్బులు తీసుకుని చెట్లు కొడతారా ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మలను తొలగించిన వారిని పిలిపించు అని మండిపడ్డారు. వారిని పిలిస్తే ఎక్కడ కొడతాడోనని వీరశేఖర్ మరోసారి సమస్యను వివరిస్తుండగా పిడికిలి బిగించి మొహంపై గుద్దాడు. దీంతో ముక్కుపై గాయమై రక్తం వచ్చింది. ‘నీ ఉద్యోగం తీయిస్తా, నిన్ను సస్పెండ్ చేయిస్తా’నని ఎంపీ బెదిరించారు. గన్‌మ్యాన్ వీరశేఖర్‌ను పక్కకు లాక్కెళ్లగానే కళ్లు తిరిగి పడిపోయాడు. అక్కడే ఉన్న వాచ్‌మన్ నాగయ్య ఈ విషయాన్ని సిబ్బందికి చెప్పడం తో అతన్ని ప్రొద్దుటూరు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న ఏఈ ఎం.కృష్ణకుమార్, ఎర్రగుంట్ల మండలం విద్యుత్ సిబ్బంది వీరశేఖర్‌ను పరామర్శించారు. డీఈ విజయన్, ఏడీఈ చక్రపాణి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ రమేష్ దాడిచేసిన విషయాన్ని ఆసుపత్రిలోని ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేశారు. దళితుడిని కాబట్టే తనను ఎంపీ కొట్టాడని వీరశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
లైన్‌మన్‌పై దాడి , బైక్‌ను ధ్వంసం
విద్యుత్ బకాయి చెల్లించాలని అడిగిందుకు మహిళ వీరంగం కావలి : ఇంటి విద్యుత్ బకాయి కట్టలేదని సర్వీస్ కనెక్షన్ తొలగించేందుకు వచ్చిన సంబంధిత శాఖ లైన్‌మన్‌పై ఓ మహిళ దాడికి పాల్పడింది. అతని ద్విచక్రవాహనాన్ని సైతం ధ్వంసం చేసి వీరంగం సృష్టించింది. ఈ సంఘటన పట్టణంలోని వెంగళరావునగర్‌లో మంగళవారం జరిగింది. స్థానికులు, లైన్‌మన్ యు.రాజశేఖర్ కథనం మేరకు... వెంగళరావు నగర్ బైరాగుల కాలనీ ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో షేక్ హసీనా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె గత ఏడాది జూలై నుంచి సర్వీస్ కనెక్షన్‌కు సంబంధించి విద్యుత్ బిల్లు బకాయి ఉంది. గత నెలలో సంబంధిత సిబ్బంది వచ్చి ఫ్యూజ్ లింక్‌లు తీసుకెళ్లారు. అయితే ఆమె మరో ఫ్యూజ్‌లు తెచ్చి విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం లైన్‌మన్ ఆమె ఇంటికి వెళ్లి విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడిగారు. ఆమె దురుసుగా సమాధానం చెప్పడంతో స్తంభం ఇంటికి ఉన్న విద్యుత్ సర్వీస్ కనెక్షన్‌ను తొలింగించే ప్రయత్నంలో చేశాడు. దీంతో ఆమె నిచ్చెన లాగేయడంతో లైన్‌మన్ కింద పడిపోయాడు. ఆమె ఇనుప రాడ్డుతో లైన్‌మన్‌పై దాడికి పాల్పడింది. అతని ద్విచక్ర వాహనాన్ని పడేసి అదే రాడ్‌తో ధ్వంసం చేసింది. ఈ ఘటనతో బిత్తరపోయిన లైన్‌మన్ తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాన్స్‌కో ఇంజినీరింగ్ అధికారులు, లైన్మన్తో కలసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదును అందజేశారు. విద్యుత్ బకాయిలు కోసం వినియోగదారుల ఇళ్లకు వెళితే తమపై ఇలా దాడులు చేయడం ఏమిటని విద్యుత్ శాఖ అధికారులు, లైన్మన్లు ఖండించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో లైన్‌మన్ మృతి
హైదరాబాద్ : సరూర్‌నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో కమలానగర్లో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం (38) ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. కాలనీలోని ఓ ట్రాన్స్ఫార్మర్ మీద ఫీజు సరి చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీవాసులు వెంటనే స్పందించి... పోలీసులతోపాటు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే కాలనీకి చేరుకుని... శ్రీశైలం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం స్వగ్రామం హయత్‌నగర్ మండలం కుంట్లూరు అని పోలీసులు వెల్లడించారు. శ్రీశైలం మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
కరెంట్ షాక్: లైన్ మెన్‌కు తీవ్ర గాయాలు
విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీపురం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద విద్యుదాఘాతానికి గురై బీఎస్ఎన్ఎల్ లైన్ మ్యాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సబ్ స్టేషన్ వద్ద ఫోన్ పని చేయకపోతే సరి చేసేందుకు బీఎస్ఎన్ఎల్ లైన్‌మ్యాన్ ఎం.ఆదినారాయణ (45) శనివారం అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న విద్యుత్ తీగలను అతడు తాకడంతో షాక్‌కు గురై కింద పడిపోయాడు. దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో స్థానికులు వెంటనే స్పందించి.... అతడిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కరెంటుషాక్ తో లైన్మెన్ దుర్మరణం
బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపురం గ్రామంలో గురువారం ఉదయం ఓ జూనియర్ లైన్మెన్ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. పట్టణంలోని వెంకటాయనగర్కు చెందిన తలపాటి మల్లికార్జున (27) నందిపల్లె గ్రామ ఫీడర్లో పని చేస్తున్నాడు. గురువారం లక్ష్మీపాలెం గ్రామ ఫీడర్‌కు సంబంధించి రెగ్యులర్ లైన్‌మ్యాన్ రాకపోవడంతో మల్లికార్జునను అక్కడకు పంపించారు. ఓ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రసారం కావడంతో అతడు మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని మల్లికార్జున బంధువులు ఆగ్రహంతో మృతదేహాన్ని తీసుకెళ్లి బద్వేలు లోని 33కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. -
‘పట్టు’జారని విక్రమార్కుడు
అడ్డురాని వైకల్యం కరెంటు స్తంభాన్ని అవలీలగా ఎక్కేసిన లోవరెడ్డి ఉత్కంఠగా జూనియర్ లైన్‌మన్ ఎంపికలు విశాఖపట్నం : చెట్టులెక్క గలవా...ఓ నరహరి పుట్టలెక్కగలవా...అని ఏ అమ్మడూ ఆట పట్టించకుం డానే అతడు చకచకా స్తంభాలెక్కేశాడు. స్తంభాలెక్కడం ఏం విడ్డూరమా అనుకోవద్దు. లోవరాజు స్తంభాలెక్కడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక మానరు. ఎందుకంటే అతనికి ఓ కాలు లే దు. ఒంటికాలితో స్తంభాలెక్కడం ఎందుకంటారా... జూనియర్ లైన్‌మన్‌గా ఎంపిక కావడం కోసం...!..ఇవీ వివరాలు. రెండు కాళ్లూ చేతులూ బాగా పని చేసినా తాటి చెట్టంత స్తంభం ఎక్కడానికి అందరూ సాహసించలేరు. కానీ ఆ యువకుడు విధి వెక్కిరించి ప్రమాదంలో కాలు కోల్పోయినా సాహసంతో రెండు స్తంభాలెక్కేశాడు. విశాఖలోని గోపాలపట్నం ఏపీఈపీడీసీఎల్ క్వార్టర్స్ గ్రౌండ్లో మూడు రోజులుగా జరుగుతున్న జూనియర్ లైన్‌మన్ ఎంపిక లు శనివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీలకు యన్నమరెడ్డి లోవరెడ్డి అనే వికలాంగుడు హాజరవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అతన్ని చూసి తొలుత అధికారులు అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత తాను విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడినని చెప్పడంతో వెసులుబాటు ఇచ్చారు. అతనికి పరీక్ష పెట్టారు. తన కాలికి తగిలించుకున్న కృత్రిమ అవయవం తీసి లోవరెడ్డి చకచకా రెండు సార్లు రెండు రకాల స్తంభాలెక్కి దిగాడు. దీనిని చూసి అబ్బురపడిన చీఫ్ జనరల్ మేనేజర్ విజయలలిత, జీఎం వైఎస్ఎన్ ప్రసాద్ తదితరులు అభినందించారు. పోల్ ఎక్కి..కాలు కోల్పోయాడు... లోవరెడ్డి స్వస్థలం పాయకరావుపేట వద్ద కందిపూడి గ్రామం. ఇతని తండ్రి మంగిరెడ్డి నిరుపేద కూలీ. లోవరెడ్డి ఐటీఐ చదివాడు. ఐదేళ్ల క్రితం ఏపీఈపీడీసీఎల్‌లో పాయకరావుపేట రూరల్ సబ్‌స్టేషన్ పరిధి శ్రీరామపురం విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్టు కార్మికునిగా చేరాడు. రెండేళ్ల క్రితం అతను పోలెక్కి పని చేస్తుండగా, హఠాత్తుగా మంటలు చెలరేగి పోల్‌పైనే కాలు కోల్పోయాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కోలుకొన్నాక విద్యుత్ అధికారులు అతనికి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చారు. లోవరెడ్డి మాత్రం ఎప్పటికైనా తాను శాశ్వత ఉద్యోగం సంపాదించాలని ఆరాటపడ్డాడు. శనివారం అందరి కంటే తక్కువ సమయంలో స్తంభాలెక్కి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు. -
మెరుపు సమ్మె
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : సమస్యల పరిష్కారం కోసం ట్రాన్స్‌కో ఉద్యోగులు ఆదివారం నుంచి మెరుపు సమ్మె చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె తీవ్రత తొలిరోజు స్వల్పంగా ఉన్నా..ఇప్పటి నుంచి తీవ్రమయ్యే అవకాశం ముందని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ట్రాన్స్‌కో ఉద్యోగులు జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. నిర్ణీత వేళల్లో వ్యవసాయానికి, గ్రామీణ,పట్టణ, నగర ప్రాంతాలకు కరెంటు సరఫరా చేస్తున్నారు. అయితే... ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు. లైన్మెన్ స్థాయి నుంచి డీఈ వరకూ సమ్మెలో పాల్గొంటున్నారు. ఆదివారం అనంతపురం నగరంలో అనేక ప్రాంతాలకు కరెంట్ సరఫరా కాలేదు. ఉద్యోగులంతా ఒకేసారి సమ్మెలోకి పోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు కూడా వీలులేకుండా పోయిందని ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు వివరించారు. నేడు, రేపు ఉద్యోగులతో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుపుతారని, సాధ్యమైనంత వరకూ ఫలిస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. సమ్మె కాలంలో కరెంట్ కష్టాలు ఎదురైతే తమ చేతిలో లేదని, సాధ్యమైనంత వరకూ ప్రజలకు కష్టాలు రానీయకుండా చూస్తామని అన్నారు. -
కరెంటోళ్ల తీరు గిట్ల!
ఎల్కతుర్తి, న్యూస్‌లైన్: ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ శివారులో ఉన్న ఎస్ఎస్-2 ట్రాన్స్ఫార్మర్కు 16 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 30 ఎకరాల భూములు సాగవుతున్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ గోపాల్పూర్ ఫీడర్ పరిధిలోకి వస్తుంది. ఫీడర్లో కొంతమంది రైతులు వ్యవసాయ విద్యుత్ సర్‌చార్జీలు బకాయిపడడంతో సంబంధిత అధికారులు ఫీడర్ మొత్తానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో సర్‌చార్జీలు చెల్లించిన చింతలపల్లి రైతులకు సైతం మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే కొందరు మొక్కజొన్న వేయగా, మరికొందరు విత్తనాలు పెడుతున్నారు. కొందరు రైతులు కూ రగాయలు సాగు చేస్తున్నారు. పంటలకు నీరు అవసరమైన సమయంలో కరెంటు నిలిపివేయడంతో వేసిన పంటలు మట్టిపాలయ్యే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఇప్పుడు వస్తుందోనని రైతులంతా బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్క ఫీడర్ కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పరిధిలో కొంతమంది బిల్లులు చెల్లించకుంటే వారి స్టార్టర్లు తొలగించాలి, లేదా పోల్ వద్ద నుంచి కనెక్షన్ తొలగించాలని గానీ.. మొత్తం ఫీడర్‌ను నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఏఈ రాములుకు ఫోన్ చేస్తే స్పందించడం లేదేని, లైన్‌మన్ నా యక్‌ను అడిగితే తనకు తెలియదంటున్నాడని రైతులు భుజంగరావు, కుతాడి రాములు, చిరంజీవి తదితరులు వాపోయారు. నీళ్లు పెట్టకుంటే వేసిన పంటలు ఎండిపోక తప్పదని, దీనికి వి ద్యుత్ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇక స్పందించాల్సింది అధికారులే. దుక్కులు ఎండుతున్నయ్ చిగురుమామిడి : చిగురుమామిడి మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం మళ్లీ త్రీఫేస్ కరెంటు సరఫరాను నిలిపివేశారు. శుక్రవారం నుంచి మూడు రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో దుక్కులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 16 గ్రామాల్లో 100, 63, 25, 16,15 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 2,160 ఉన్నాయి. చిగురుమామిడి, రేకొండ, ఇందుర్తి, ముల్కనూర్ గ్రామాల్లో సబ్‌స్టేషన్ల్ ఉన్నాయి. వీటి పరిధిలో 5,300 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, సుమారు రూ.70లక్షల బకాయిలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మూడు రోజులుగా అధికారుల నిర్భంద వసూళ్ల వల్ల రూ.20 లక్షలు వసూలయ్యాయని చెబుతున్నారు. బిల్లులు కట్టిన వారిని, కట్టని వారిని ఒకే గాటన కట్టి త్రీఫేస్ విద్యుత్ సరపరా నిలిపివేయడం దారుణమని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. విద్యుత్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మేల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడం దారుణమని సీపీఐ మండల కార్యదర్శి అందెస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గీకురు రవీందర్ ఆరోపించారు. అన్ని గ్రామాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.