ఎల్కతుర్తి, న్యూస్‌లైన్: ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ శివారులో ఉన్న ఎస్‌ఎస్-2 ట్రాన్స్‌ఫార్మర్‌కు 16 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 30 ఎకరాల భూములు సాగవుతున్నాయి. ఈ ట్రాన్స్‌ఫార్మర్ గోపాల్‌పూర్ ఫీడర్ పరిధిలోకి వస్తుంది. ఫీడర్‌లో కొంతమంది రైతులు వ్యవసాయ విద్యుత్ సర్‌చార్జీలు బకాయిపడడంతో సంబంధిత అధికారులు ఫీడర్ మొత్తానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో సర్‌చార్జీలు చెల్లించిన చింతలపల్లి రైతులకు సైతం మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే కొందరు మొక్కజొన్న వేయగా, మరికొందరు విత్తనాలు పెడుతున్నారు. కొందరు రైతులు కూ రగాయలు సాగు చేస్తున్నారు. పంటలకు నీరు అవసరమైన సమయంలో కరెంటు నిలిపివేయడంతో వేసిన పంటలు మట్టిపాలయ్యే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఇప్పుడు వస్తుందోనని రైతులంతా బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఒక్క ఫీడర్ కింద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో కొంతమంది బిల్లులు చెల్లించకుంటే వారి స్టార్టర్లు తొలగించాలి, లేదా పోల్ వద్ద నుంచి కనెక్షన్ తొలగించాలని గానీ.. మొత్తం ఫీడర్‌ను నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఏఈ రాములుకు ఫోన్ చేస్తే స్పందించడం లేదేని, లైన్‌మన్ నా యక్‌ను అడిగితే తనకు తెలియదంటున్నాడని రైతులు భుజంగరావు, కుతాడి రాములు, చిరంజీవి తదితరులు వాపోయారు. నీళ్లు పెట్టకుంటే వేసిన పంటలు ఎండిపోక తప్పదని, దీనికి వి ద్యుత్ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇక స్పందించాల్సింది అధికారులే.
దుక్కులు ఎండుతున్నయ్
చిగురుమామిడి : చిగురుమామిడి మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం మళ్లీ త్రీఫేస్ కరెంటు సరఫరాను నిలిపివేశారు. శుక్రవారం నుంచి మూడు రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో దుక్కులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 16 గ్రామాల్లో 100, 63, 25, 16,15 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లు 2,160 ఉన్నాయి. చిగురుమామిడి, రేకొండ, ఇందుర్తి, ముల్కనూర్ గ్రామాల్లో సబ్‌స్టేషన్ల్ ఉన్నాయి. వీటి పరిధిలో 5,300 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, సుమారు రూ.70లక్షల బకాయిలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మూడు రోజులుగా అధికారుల నిర్భంద వసూళ్ల వల్ల రూ.20 లక్షలు వసూలయ్యాయని చెబుతున్నారు. బిల్లులు కట్టిన వారిని, కట్టని వారిని ఒకే గాటన కట్టి త్రీఫేస్ విద్యుత్ సరపరా నిలిపివేయడం దారుణమని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. విద్యుత్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మేల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడం దారుణమని సీపీఐ మండల కార్యదర్శి అందెస్వామి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గీకురు రవీందర్ ఆరోపించారు. అన్ని గ్రామాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
కరెంటోళ్ల తీరు గిట్ల!
Published Mon, Dec 23 2013 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement