వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం...
దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్ : వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... దేవరకద్ర మండలం గద్దెగూడేనికి చెందిన సత్యన్న (28) కు సమీపంలోఎకరా పొలం ఉంది. అందులో ప్రస్తుతం వరి సాగు చేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం నీరు పారపెట్టడానికి అక్కడికి వెళ్లి బోరుమోటార్ స్టార్ట్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే అతడిని గ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య అనసూయతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
సిర్సవాడ (తాడూరు) : మండలంలోని సిర్సవాడకు చెందిన బింగి జంగిలయ్య (32) కు సమీపంలో రెండెకరాల పొలం ఉంది. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు దుందుబీ వాగు ప్రవహించడంతో వ్యవసాయ బోర్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లిన ఈయన ఇసుకలో మునిగిన మోటార్‌ను తేల్చే క్రమంలో చేతికి తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రైతు తాళ్ల విష్ణు అపస్మారక స్థితిలో చేరుకోగా కొద్దిసేపటికి తేరుకున్నాడు. అనంతరం అటువైపు వెళ్లిన పాపగల్ వాసి శేఖర్‌రెడ్డి గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య బాలమ్మతోపాటు ఓ కూతురు ఉంది. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు.