బావుల నిండా నీరున్నా కరెంట్ లేక వేసిన నాట్లు వేసినట్టే ఎండిపోతున్నాయి. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు సామర్థ్యానికి మించి కనెక్షన్లు ఉన్నాయి. దీంతో లోడ్ ఆగక తరచూ ఫీజు కొట్టేస్తోంది. లేకుంటే ట్రిప్ అవుతోంది. అదనపు సామర్థ్యం గల ట్రాన్స్‌ఫారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేదు. మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం ఇదే సమస్య.
- న్యూస్‌లైన్, హుస్నాబాద్
హుస్నాబాద్ మండలం అంతకపేట గ్రామంలో 100 హెచ్‌పీ సామర్థ్యం గల ఎస్‌ఎస్-1 ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీనికింద 45 వ్యవసాయ బావులు ఉన్నాయి. దీని ద్వారానే గ్రామానికీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సామర్థ్యానికి మించి కనెక్షన్లు కావడంతో ట్రాన్స్‌ఫార్మర్ ఇప్పటికే రెండుసార్లు కాలిపోయింది. మరో 100 హెచ్‌పీ అదనపు ట్రాన్స్‌ఫార్మర్ కోసం రైతులు చందాలు వేసుకుని డీడీ కట్టారు. పదిరోజులైనా అధికారుల్లో చలనం లేదు. దీంతో రైతులు వంతులవారీగా.. ఒకరోజు 20 మంది రైతులు.. మరోరోజు 25 మంది రైతులు పొలాలకు నీరు పెట్టుకుంటున్నారు. తరచూ లోవోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి. అయితే ట్రాన్స్‌ఫార్మర్.. లేకుంటే మోటార్.. వారంలో రెండుసార్లు కాలిపోతుండడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు.
నారుపోసి 25 రోజులు అయితంది
నారుపోసి 25 రోజులయితంది. గిప్పటివరకు ఇంకా పొలమే దున్నలేదు. దున్నదామంటే కరెంట్ సక్కగా ఉంటలేదు. వచ్చుడు..పోవుడు ఇదే పని. గిట్లయితే నాటేసుడెట్లయితది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కోసం సార్లకు చెప్పినం. అయినా ఇత్తలేరు.
- ఇర్రి వెంకటరెడ్డి, అంతకపేట
స్టార్టర్ వద్ద నుంచి కదిలితే ఒట్టు..
ఈయన హుస్నాబాద్ మండలం అంతకపేటకు చెందిన రైతు ఇర్రి వెంకటరెడ్డి. ఐదెకరాల్లో రెండున్నర ఎకరాలు మొక్కజొన్న, రెండెకరాల్లో నాటేశాడు. ఈయన వ్యవసాయ బావి ఎస్‌ఎస్-1 ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో ఉంది.
దానికి 45 కనెక్షన్లు ఉండడంతో విద్యుత్ కష్టాలు తీవ్రమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు కరెంట్ రాగానే మక్కకు నీళ్లు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా 1.42 గంటలకు ట్రిప్ అయ్యింది. మళ్లీ 1.47కు వచ్చింది. అయ్యో అనుకుంటూ స్టార్టర్ వద్దకు వెళ్లి ఆన్ చేయగానే.. తిరిగి 1.57గంటలకు ట్రిప్ అయ్యింది. మూడు నిమిషాలకే మళ్లీ వచ్చిం ది. స్టార్టర్ ఆన్ చేసిన రైతు చేనులోకి వెళ్లాడు. ఐదు నిమిషాలు అయ్యిందో లేదో మళ్లీ ట్రిప్.. రైతుకు కోపం వచ్చింది. ‘ఈ కరెంట్ గింతే.. పొలం పారనివ్వది.. నన్ను నిలువనీయది..’ అనుకుంటూ స్టార్టర్ వద్దే కూర్చుండిపోయాడు.
- న్యూస్‌లైన్, హుస్నాబాద్
నిర్వహణ లోపం..
సెస్ పరిధిలో 191 గ్రామాలు... 5680 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. సుమారు 60వేల వరకు వ్యవసా య నకనెక్షన్లు ఉన్నాయి. అయితే సంస్థ సిబ్బందిలేమితో ఇబ్బంది పడుతోంది. ఉన్న సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తుండడంతో సగటున రోజుకు పదిహేను ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపో యి మరమ్మతుకు వస్తున్నాయి. వీటి సెస్‌కు తీసుకురావడం.. మళ్లీ తీసుకెళ్లడం.. హెల్పర్ సహాయం తో బిగించడం ద్వారా ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ. మూడు వేల వరకు ఖర్చవుతోంది. ఇది రైతులే భ రించాలి. ఇది అనధికారికం. అధికారికంగా ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు రూ.18 వేలు ఖర్చవుతోంది.
ఇలా సెస్‌పై నిత్యం రూ.2.70 లక్షల భారం పడుతోంది. రబీలో కరెంట్ ఇబ్బందుల దృష్ట్యా అప్పటి సెస్ పర్సన్ ఇన్‌చార్జి అరుణ్‌కుమార్ రెండు నెలల క్రితమే 150 ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుకు రూ.1.25 కోట్లకు అనుమతించారు. అయితే సెస్ అధికారుల నిర్లక్ష్యంతో అవి ఇప్పటికీ చేరలేదు. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు అవసరంగా ఉండగా.. 65 కేవీవి సరఫరా అయ్యాయి. ముందుచూపుతో వ్యవహరించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతోంది. సామర్థ్యానికి మించి విద్యుత్ వినియోగం ఉండడంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి.
రిపేరులోనూ అలసత్వమే..
సెస్ సంస్థకు సొంత స్టోర్స్ ఉంది. కానీ.. మరమ్మతు మాత్రం చేయడం లేదు. మెకానిక్‌లను పిలిపించి రిపేరు చేయించి రైతులకు సత్వరమే ట్రాన్స్‌పార్మర్లు అందించాల్సి ఉన్నా.. డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు కావడంతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలో మూడు ప్రైవేటు మరమ్మతు కేంద్రాల్లో రోజుకు ఆరు వరకే బాగవుతున్నాయి. వచ్చేవి 15 అయితే రిపేరు మాత్రం ఆరుకు దాటడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కరెంట్ ఆగదు.. పొలం పారదు
Published Wed, Jan 29 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement