‘పట్టు’జారని విక్రమార్కుడు | 'Pattujarani Vikrama | Sakshi
Sakshi News home page

‘పట్టు’జారని విక్రమార్కుడు

Published Sun, Aug 3 2014 12:47 AM | Last Updated on Wed, Sep 5 2018 4:19 PM

‘పట్టు’జారని విక్రమార్కుడు - Sakshi

‘పట్టు’జారని విక్రమార్కుడు

  •      అడ్డురాని వైకల్యం
  •      కరెంటు స్తంభాన్ని అవలీలగా ఎక్కేసిన లోవరెడ్డి  
  •      ఉత్కంఠగా జూనియర్ లైన్‌మన్ ఎంపికలు
  • విశాఖపట్నం : చెట్టులెక్క గలవా...ఓ నరహరి పుట్టలెక్కగలవా...అని ఏ అమ్మడూ ఆట పట్టించకుం డానే అతడు చకచకా స్తంభాలెక్కేశాడు. స్తంభాలెక్కడం ఏం విడ్డూరమా అనుకోవద్దు. లోవరాజు స్తంభాలెక్కడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక మానరు. ఎందుకంటే అతనికి ఓ కాలు లే దు. ఒంటికాలితో స్తంభాలెక్కడం ఎందుకంటారా...
     
    జూనియర్ లైన్‌మన్‌గా ఎంపిక కావడం కోసం...!..ఇవీ వివరాలు.

    రెండు కాళ్లూ చేతులూ బాగా పని చేసినా తాటి చెట్టంత స్తంభం ఎక్కడానికి అందరూ సాహసించలేరు. కానీ ఆ యువకుడు విధి వెక్కిరించి ప్రమాదంలో కాలు కోల్పోయినా సాహసంతో రెండు స్తంభాలెక్కేశాడు. విశాఖలోని గోపాలపట్నం ఏపీఈపీడీసీఎల్ క్వార్టర్స్ గ్రౌండ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న జూనియర్ లైన్‌మన్ ఎంపిక లు శనివారం ఉత్కంఠ భరితంగా సాగాయి.

    ఈ పోటీలకు యన్నమరెడ్డి లోవరెడ్డి అనే వికలాంగుడు హాజరవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అతన్ని చూసి తొలుత అధికారులు అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత తాను విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడినని చెప్పడంతో వెసులుబాటు ఇచ్చారు.  అతనికి పరీక్ష పెట్టారు. తన కాలికి తగిలించుకున్న కృత్రిమ అవయవం తీసి లోవరెడ్డి చకచకా రెండు సార్లు రెండు రకాల స్తంభాలెక్కి దిగాడు. దీనిని చూసి అబ్బురపడిన చీఫ్ జనరల్ మేనేజర్ విజయలలిత, జీఎం వైఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు అభినందించారు.
     
    పోల్ ఎక్కి..కాలు కోల్పోయాడు...
     
    లోవరెడ్డి స్వస్థలం పాయకరావుపేట వద్ద కందిపూడి గ్రామం. ఇతని తండ్రి మంగిరెడ్డి నిరుపేద కూలీ. లోవరెడ్డి ఐటీఐ చదివాడు. ఐదేళ్ల క్రితం ఏపీఈపీడీసీఎల్‌లో పాయకరావుపేట రూరల్ సబ్‌స్టేషన్ పరిధి శ్రీరామపురం విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్టు కార్మికునిగా చేరాడు. రెండేళ్ల క్రితం అతను పోలెక్కి పని చేస్తుండగా, హఠాత్తుగా మంటలు చెలరేగి పోల్‌పైనే కాలు కోల్పోయాడు.

    ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కోలుకొన్నాక విద్యుత్ అధికారులు అతనికి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చారు. లోవరెడ్డి మాత్రం ఎప్పటికైనా తాను శాశ్వత ఉద్యోగం సంపాదించాలని ఆరాటపడ్డాడు. శనివారం అందరి కంటే తక్కువ సమయంలో స్తంభాలెక్కి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement