కరెంట్‌తో ఆటలు!  | Poor People Was Died For Electrical Officials Negligence | Sakshi
Sakshi News home page

కరెంట్‌తో ఆటలు! 

Published Sun, Jul 29 2018 3:37 AM | Last Updated on Sun, Jul 29 2018 3:38 AM

Poor People Was Died For Electrical Officials Negligence - Sakshi

గట్టుపల్లి రఘుమారెడ్డి(29). విద్యుత్‌ పంపిణీ సంస్థలో అనధికార ఉద్యోగి. నల్లగొండ జిల్లా తానేదార్‌పల్లిలోని కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ ఫ్యూజుకు మరమ్మతులు చేస్తూ కొద్దిరోజుల క్రితం మరణించాడు. పాల్వయి సబ్‌స్టేషన్‌ నుంచి ఈ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎల్‌సీని తిరిగి అప్పగించాల్సి ఉండగా, లైన్‌మన్‌కు అవగాహన లేక మరో ఫీడర్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయించాడు. మరమ్మతు కోసం  ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కిన రఘుమారెడ్డి విద్యుదాఘాతానికి గురై కన్నుమూశాడు. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి ఇలాంటి ఎందరో అమాయక నిరుద్యోగుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సాంకేతిక శిక్షణ, నైపుణ్యం లేని ప్రైవేటు వ్యక్తులతో డిస్కంలు అనధికారికంగా పనులు చేయించుకుంటూ వారి మరణాలకు కారణమవుతున్నాయి. లైన్‌మన్లు క్షేత్రస్థాయిలో సొంతంగా సహాయకులను నియమించుకుని వారికి తమ పనులు అప్పగిస్తున్నారు. అయితే సరైన నైపుణ్యం లేకపోవడంతో వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికు(ఆర్టిజన్‌)ల సమ్మె ఈ నెల 21న ప్రారంభం కాగా, వారం రోజుల్లో ఇద్దరు ప్రైవేటు సహాయకులు మరమ్మతు పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.  

సొంతంగా సహాయకుల నియామకం 
క్షేత్రస్థాయిలో జూనియర్‌ లైన్‌మన్లు, అసిస్టెంట్‌ లైన్‌మన్లు, లైన్‌మన్లు సొంతంగా ప్రైవేటు వ్యక్తులను తమ సహాయకులుగా నియమించుకుని తాము చేయాల్సిన ‘ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌(ఓఅండ్‌ఎం)’పనుల బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. వీరే అన్ని పనులు చేస్తుండటంతో చాలామంది రెగ్యులర్‌ లైన్‌మెన్లు విద్యుత్‌ స్తంభాలను ఎక్కడం కూడా మానేశారు. పల్లెల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే క్షేత్ర స్థాయికి వెళ్లి మరమ్మతులు చేయడం ఇష్టం లేక ఎక్కడికక్కడ గ్రామాల్లో స్థానిక నిరుద్యోగ యువకులను సహాయకులుగా నియమించుకుంటున్నారు. నిపుణత, అత్యంత అప్రమత్తతో చేయాల్సిన విద్యుత్‌ సరఫరా వ్యవస్థల నిర్వహణ, మరమ్మతు పనులు చేస్తూ ఏటా పదుల సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులు విద్యుదాఘాతాలకు గురై మృత్యువాతపడుతున్నారు. 

ఆర్టిజన్ల సమ్మె ప్రభావం.. 
ఈ నెల 21 నుంచి విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ వారం రోజుల్లో ఇద్దరు ప్రైవేటు సహాయకులు మరమ్మతు పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై మరణించారు. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ప్రకటించిన సేఫ్టీ అండ్‌ ఎలక్ట్రిసిటీ సప్లై మార్గదర్శకాల ప్రకారం ఎలక్ట్రిషియన్‌ ట్రేడ్‌లో కనీసం రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతతో పాటు వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసిన వ్యక్తులనే డిస్కంలు మరమ్మతు, నిర్వహణ పనులకు నియమించుకోవాలి. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో 5,149 మంది, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)లో 4,625 మంది ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌ సిబ్బంది పని చేస్తుండగా, వీరిలో చాలా మంది కనీసం ఇద్దరు, ముగ్గురిని ప్రైవేటు సహాయకులుగా నియమించుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో 10 వేల మంది ప్రైవేటు వ్యక్తులు డిస్కంలలో అనధికారికంగా పనిచేస్తున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రైవేటు నియామకాల విషయం డిస్కంల యాజమాన్యాలకు తెలిసినా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు చనిపోతే అనధికారికంగా పనిచేస్తూ చనిపోయారని పేర్కొంటూ సంస్థ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. 

ఎల్‌సీపై ఆర్టిజన్లకే అవగాహన 
సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిస్కంలలో పనిచేస్తున్న పోల్‌ టూ పోల్‌ వర్కర్లు, సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లు, బ్రేక్‌ డైన్‌ గ్యాంగ్లు, రూట్‌ రైడర్లు, ఎంఆర్‌టీ వర్కర్లతో పాటు ట్రాన్స్‌కోలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లుగా పని చేస్తున్న ఆర్టిజన్లు విధులను బహిష్కరించారు. ఏ ఫీడర్‌ పరిధిలో ఎన్ని లైన్లు ఉన్నాయి.. మరమ్మతుల కోసం విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేసేందుకు ఎక్కడ లైన్‌ క్లీయర్‌(ఎల్‌సీ) తీసుకోవాలన్న విషయం ఆర్టిజన్లకు తెలిసినంతగా క్షేత్ర స్థాయి ఇంజనీర్లు, రెగ్యులర్‌ లైన్‌మెన్లకు తెలియని పరిస్థితి. సాధారణంగా లైన్‌మెన్లు ఎల్‌సీ తీసుకుని, ఆర్టిజన్లు/ప్రైవేటు సహాయకులతో మరమ్మతులు చేయిస్తుంటారు. కార్యాలయాలకే పరిమితమై పనిచేసే సబ్‌ ఇంజనీర్, ఏఈ, ఆపై స్థాయి అధికారులు అరుదుగా క్షేత్ర స్థాయిల్లో పర్యటిస్తుంటారు.  

ఎక్కడ ‘ఎల్‌సీ’తీసుకోవాలో తెలీదు! 
సాంకేతిక పరిభాషలో ఓ ఫీడర్‌కు ఎల్‌సీ తీసుకుంటే.. సంబంధిత ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా అందిస్తారు. ఎల్‌సీని తిరిగి అప్పగిస్తున్నట్లు స్థానిక లైన్‌మెన్‌ సబ్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే సంబంధిత ఫీడర్‌కు సరఫరాను నిలుపుదల చేస్తారు. అయితే, ఎల్‌సీ తీసుకోవడంలో లైన్‌మెన్లు చేస్తున్న పొరపాట్లతో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టిజన్ల సమ్మె ప్రభావం కనిపించకుండా చూసుకోవాలని, సాంకేతిక సమస్యలతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు కలిగితే అప్పటికప్పుడు మరమ్మతులు జరిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని డిస్కంల యాజమాన్యాలు క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించాయి. దీంతో క్షేత్ర స్థాయిలో వందలాది మంది ప్రైవేటు సహాయకులను కొత్తగా నియమించుకుని పనులు చేయించుకుంటున్నారు. విద్యుత్‌ సంస్థల్లో ప్రైవేటు వ్యక్తిగా చేరినా భవిష్యత్తులో కాంట్రాక్టు లైన్‌మెన్లుగా అవకాశం లభించవచ్చనే ఆశతో ముందుకొస్తున్న నిరుద్యోగ యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement