సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో ఇటీవల విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందిన ట్రాన్స్‌కో ఆపరేటర్ ప్రసాద్ (ఇన్‌సెట్) ప్రసాద్ (ఫైల్)
రాయచోటి రూరల్ : ఈ మధ్య కాలంలో జనాలను, విద్యుత్ వర్కర్లను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య విద్యుత్ ప్రమాదాలు. ఒక వైపు ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం, మరో వైపు జాగ్రత్తలు పాటించని ప్రజలు రెండూ కలిసి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. అందుకు పెట్టింది పేరుగా రాయచోటి డివిజన్ మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు 32 విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుని 20 మంది, 8 పశువులు ప్రాణాలు కోల్పోయారు.
మరమ్మతులు చేస్తూ..
ట్రాన్స్‌కో కార్యాలయాల పరిధిలోని వివిధ మండలాల్లో పని చేస్తున్న వర్కర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అందులో భాగంగా ఎల్‌సీ తీసుకుని విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ సరఫరా రావడంతోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఈ మధ్య కనిపిస్తున్నాయి. సరైన విధి విధానాలు లేకపోవడంతో పాటు కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఆవేదన మాత్రమే మిగులుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. ప్రమాదాలను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
మూడు రోజుల్లో ముగ్గురు మృతి
రాయచోటి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఇటీవల రోజుకో ప్రమాదం చొప్పున మూడు విద్యుత్ ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందడం గమనార్హం. సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తున్న సబ్‌స్టేషన్ ఆపరేటర్ ప్రసాద్ ప్రమాదంలో మృతి చెందగా, ఆ మరుసటి రోజు రాయచోటి పట్టణం కొత్తపేటలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో విద్యుత్ షాక్‌కు గురైన బీటెక్ విద్యార్థి ప్రేమ్‌కుమార్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే చిన్నమండెం మండలం చిన్నర్సుపల్లెలో కొండమ్మ అనే మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందింది.
వరుస విద్యుత్ ప్రమాదాలు
∙2018 మే నెలలో గాలివీడు మండలం గోరాంచెరువు వద్ద విద్యుత్ క్రాంట్రాక్టు కార్మికుడు శరత్‌కుమార్ మరమ్మతు పనులు చేస్తుండా విద్యుత్ సరఫరా అయ్యి మృతి చెందాడు.
∙2018 జూలైలో చిన్నమండెం మండలం చాకిబండ వద్ద విద్యుత్ లైన్ మీద మరమ్మతులు చేస్తున్న లైన్‌మెన్ సాంబ అనుకోకుండా విద్యుత్‌సరఫరా అయ్యి షాక్ గురై తీవ్రంగా గాయపడ్డాడు.
∙2018 సెప్టెంబర్‌లో సంబేపల్లె మండలంలో విద్యుత్ లైన్ మీద మరమ్మతులు చేస్తున్న ప్రసాద్ అనే ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ ఆపరేటర్ అనుకోకుండా విద్యుత్ సరఫరా రావడంతో షాక్‌కు గురై విద్యుత్ సంభం మీదనే మృతి చెందాడు.
ఇలా జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉండటం బాధాకరం.
జాగ్రత్తలు పాటిస్తున్నాం
వీలైనంత వరకు సబ్‌స్టేషన్ల పరిధిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాలు జరగడం బాధాకరం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజలు విద్యుత్ వాడుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. – టి.శేషాద్రి, డీఈ, రాయచోటి
Comments
Please login to add a commentAdd a comment