ఒంగోలు సెంట్రల్: విద్యుత్ సంస్థలో పనిచేసే జూనియర్ లైన్‌మన్లు, సహాయ లైన్‌మన్లు, లైన్‌మన్లు ఇక నుంచి విద్యుత్ స్తంభం ఎక్కాల్సిందేనని సదరన్ డిస్కం ముఖ్య ఇంజినీరు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత డివిజినల్ ఇంజినీరు వారానికి ఒక సెక్షన్‌కు వెళ్లి ప్రతి ఉద్యోగి స్తంభం ఎక్కగల సామర్థ్యం ఉందో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రమాదాల నివారణ, క్షేత్రస్థాయిలో ఎక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా, ట్రాన్స్‌ఫార్మర్‌లు మార్చాలన్నా, గడువులోపు బిల్లులు చెల్లించని వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపేయడం, పునురుద్ధరణ తదితర పనుల్లో స్తంభాలు ఎక్కేందుకు కొందరు శాశ్వత ఉద్యోగులు ఇష్టపడటం లేదని, మరికొందరికి స్తంభాలు ఎక్కే నైపుణ్యం లేదని తిరుపతిలోని సదరన్ డిస్కిం ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులతో ఆ పనులు చేయిస్తున్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందింది. నైపుణ్యం లేనందున పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు జాప్యం జరుగుతోందని గుర్తించారు. పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా నివారించేందుకు సిబ్బందిలో జవాదుదారీతనం పెంచాలని అధికారులు నిర్ణయించారు.
ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించకుండా శాశ్వత ఉద్యోగులే అన్ని పనులు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని తక్షణం అమలు చేయాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం విద్యుత్ స్తంభాలు ఎక్కలేని వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. 50 ఏళ్లు దాటిన లైన్‌మన్‌లు చాలామంది ప్రస్తుతం స్తంభాలు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయో ఆదేశాల్లో స్పష్టం చేయలేదు. జిల్లాలో జూనియర్ లైన్‌మన్లు–305 మంది. అసిస్టెంట్ లైన్‌మన్‌లు–380 మంది, లైన్‌మన్లు–365 మంది వరకు ఉన్నట్లు ఆ శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment